గ‌వ‌ర్న‌ర్ కు కూడా రేవంత్ స్వీట్ వార్నింగ్‌..!

ఇప్ప‌టివ‌ర‌కూ కేసీఆర్ స‌ర్కారు వైఫ‌ల్యాల‌పై సంబంధిత శాఖ‌ల‌కు ఫిర్యాదు చేశామ‌నీ, స్పందించ‌క‌పోతే న్యాయ‌స్థానాల త‌లుపుత‌ట్టామ‌న్నారు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి. జ‌గ్గారెడ్డి అరెస్టు అంశ‌మై రాబోయే రెండ్రోజుల్లో పూర్తి కార్యాచ‌ర‌ణ మీడియాకు వివ‌రిస్తామ‌న్నారు. కేసీఆర్ పెట్టే అక్ర‌మ కేసుల‌కు భ‌య‌ప‌డే ప‌రిస్థితి లేద‌నీ, కేసులు పెడితే రాజ‌కీయాలు వ‌దిలేసి పోతార‌ని భ్ర‌మ‌ ప‌డుతున్నార‌ని విమ‌ర్శించారు. ‘నువ్వు ఎంత చేస్తే అంత‌. నువ్వు ఎంతెంత అయితే చెల్లిస్తున్నావో, మిత్తితో స‌హా తిరిగి చెల్లిస్తాం. ఏదీ ఉంచుకునే అల‌వాటు కాంగ్రెస్ పార్టీకి లేదు’ అంటూ కేసీఆర్ ను హెచ్చ‌రించారు. అధికారం శాశ్వ‌తం కాద‌నీ, ఉమ్మ‌డి ఆంధ్రా నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ ఎంతోమంది ముఖ్య‌మంత్రుల‌య్యార‌నీ, ఈయ‌న మొద‌టివాడూ కాదు, చివ‌రివాడు కాద‌న్నారు. ఆస్తులూ అధికార‌ం ఎలాగైతే వార‌సుల‌కు చెల్లిందే, అలాగే చేసిన త‌ప్పుల్ని కూడా వ‌డ్డీతో స‌హా అన్నీ వారసుల‌కు అప్ప‌జెప్తామ‌న్నారు.

అంద‌రి పేర్ల మీదా డైరీలు రాస్తున్నామ‌నీ, మూడు నెల‌ల్లో ఎన్నిక‌లు పూర్తికాగానే రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోంద‌నీ, కేసీఆర్ కుటుంబంతోపాటు వేధింపుల‌కు గురిచేస్తున్న అందరికీ లెక్క బ‌రాబ‌ర్ అప్ప‌జెప్తామ‌ని రేవంత్ హెచ్చ‌రించారు! జగ్గారెడ్డి అరెస్టు సంద‌ర్భంగా ఐపీఎస్ అధికారుల‌ను క‌లిస్తే, రాష్ట్రంలో మ‌ళ్లీ కేసీఆర్ అధికారంలోకి వ‌స్తారు కాబ‌ట్టి, ఆయ‌న చెప్పిన‌ట్టు వినాల్సి వ‌స్తుంద‌ని అంటున్నార‌ని చెప్పారు. అవ‌న్నీ భ్ర‌మ‌ల‌నీ, కేంద్రంలో వ‌చ్చేది కూడా కాంగ్రెస్ పార్టీయేన‌నీ, ఐపీఎస్ అధికారుల‌పై విచార‌ణ చేసే అధికారం కేంద్రానికి ఉంటుంద‌ని రేవంత్ చెప్పారు. చ‌ట్ట‌ప్ర‌కారంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్తుంద‌న్నారు.

‘గ‌వ‌ర్న‌ర్ గారు.. మీరు కూడా తెలంగాణలో శాంతిభద్రతలు సమీక్షించండి. డీజీపీలు, కమిషనర్లు, జిల్లా ఎస్పీల‌ను పిల‌వండి. కేసీఆర్ సామాజిక వ‌ర్గానికి చెందిన అధికారుల‌ను నియ‌మించుకుని, ఎలా వేధిస్తున్నారో వివ‌రాలు తెలుసుకోవాలి. గ‌వ‌ర్న‌ర్ గా మీ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించుకోలేరు. ఒక‌వేళ ఏదైనా జ‌రిగితే… మీరు కూడా లెక్క చెప్పాల్సిన అవ‌స‌రం వ‌స్తుంది’ అంటూ రేవంత్ వ్యాఖ్యానించడం గమనార్హం. మొత్తానికి, గవర్నర్ తో సహా ఉన్న‌తాధికారులు, నాయ‌కుల‌కు వార్నింగ్ ఇచ్చేశారు! డైరీ రాస్తున్నామ‌న‌డం కాస్త తీవ్ర‌మైన వ్యాఖ్యాన‌మే. మ‌రి, వీటిని ప్ర‌భుత్వం ఎలా చూస్తుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com