పంచాయతీ ఎన్నికలు మొదటి దశ ప్రశాంతంగా జరిగాయి. ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏకగ్రీవాలు జరిగిన చోట కూడా ఆయా గ్రామాల ప్రజలే డిసైడ్ చేసుకున్నారు కానీ.. రాజకీయ నేతలు ఒత్తిడి చేయలేదు. పోలీసులు జోక్యం చేసుకోలేదు. పోలింగ్ కూడా అంతే. తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఓటు హక్కు వినియోగించుకున్నారు. తమ గ్రామాలను ఎవరు పరిపాలించారో వారే నిర్ణయించుకున్నారు. ఇందులో వింతేం కాదు. కానీ గతంలో జరిగిన పరిణామాలు.. ప్రస్తుతం మారిపోయిన రాజకీయాలు చూసే వారికి మాత్రం వింతగానే ఉంటుంది. ప్రజల హక్కను గౌరవించే అధికార పార్టీ ఉండటం అందర్నీ ఆశ్చర్యపరిచేదే. ఈ ఘనత రేవంత్ రెడ్డిదే అనుకోవచ్చు.
ఎలాగైనా స్వీప్ చేయాలని అనుకోని రేవంత్
ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలు ఎలాంటి ఎన్నిక వచ్చినా.. ఎలాగైనా గెలిచి తీరాలని అనుకుంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో నయానో..భయానో తమ పార్టీకి చెందిన వారే పదవుల్లో ఉండాలని అనుకుంటారు. గతంలో కొన్ని సందర్భాల్లో నామినేషన్లు కూడా వేయనివ్వకుండా ఏకగ్రీవాలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. బీఆర్ఎస్ హాయంలోనూ పంచాయతీ ఎన్నికలు ఇంత ప్రశాంతంగా జరగలేదు. పోలీసులు జోక్యం చేసుకుని కాంగ్రెస్ నేతలను పోటీలో లేకుండా చేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. అధికార బలంతో కొన్ని చోట్ల పోటీ లేకుండా చేసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఇక ఏపీలో అయితే జగన్ రెడ్డి హయాంలో పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ తప్ప మరో అభ్యర్థి పోటీ చేయాలంటే.. చావుకు సిద్ధపడే వాతావరణాన్ని కల్పించారు. ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ కూడా..గ్రామాల్లో పట్టు కోసం అలాంటి పద్దతులను పాటిస్తారని అనుకున్నారు.
ప్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగేలా చూసిన సీఎం
కానీ రేవంత్ రెడ్డి అందర్నీ ఆశ్చర్యపరిచారు. పార్టీ నేతల్ని రెచ్చగొట్టలేదు. ఎలాగైనా గెలవాలని ఆదేశించలేదు. ప్రజల్ని మెప్పించి అత్యధిక సీట్లు పొందాలని దిశానిర్దేశం చేశారు. వ్యవస్థల్ని వాడుకోవాలని కూడా ఆఫర్ ఇవ్వలేదు. ఫలితంగా పోలీసులు ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు పరిమితమయ్యారు. నామినేషన్లు వేయకుండా చేయడం.. పార్టీల్లో చేర్పించడం, కేసుల కత్తి పెట్టడం వంటివి చేయలేదు. పోలీసులు ఇలాంటి జోక్యం చేసుకోకపోవడం వల్ల పంచాయతీలు ఎన్నికలు మరింత ఉత్సాహంగా సాగాయి. ప్రజలు తమకు కావాల్సిన వారిని గ్రామ పాలకులుగా ఎంచుకుంటున్నారు.
ప్రజల అధికారాన్ని లాక్కునే ప్రయత్నం చేయని రేవంత్ రాజకీయం
అధికారంలో ఉన్న పార్టీకి సహజంగానే ఎక్కువ పంచాయతీలు వస్తాయి. దానికి కారణం గ్రామాల్లో ఉన్న పనులు అవ్వాలంటే .. అధికార పార్టీ ద్వారానే సాధ్యం. ఆ విషయం అందరికీ స్పష్టత ఉంటుంది. సామాన్య ప్రజలకు పథకాలు రావాలన్నా.. గ్రామాల్లో చిన్న చిన్న పనులు కావాలన్నా.. అధికారంతోనే సాధ్యమవుతుంది. అందుకే ఎక్కువ సీట్లు వస్తాయి. ఆ ప్రభావం ఫలితాల్లో కనిపిస్తోంది. కానీ అసలు విపక్షాలకు చోటు లేకుండా చేయాలన్న ఆలోచన మాత్రం రేవంత్ కు రాలేదు. ప్రజల అధికారాన్ని ప్రజల వద్దనే ఉంచారు. ఇది ఆయనకు నవతరం నాయకుల్లో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చి పెడుతుంది.
