అసెంబ్లీ రివ్యూ : బిల్లులు, ఆరోపణలు, హెచ్చరికలు..!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తొలి బడ్జెట్ సమావేశాలు… ఊహించని విధంగా జరిగాయి. గత ప్రభుత్వంలో జరిగిన వాటిపై.. ఆరోపణలు.. విచారణలతో పాటు… కొత్తగా 19బిల్లులు ఆమోదించి.. రికార్డు సృష్టించారు. 14 రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కొత్త ప్రభుత్వం తన ప్రాదాన్యాలకు అనుగుణంగా.. బిల్లుల్లో మార్పులు చేర్పులు చేసుకుంది. 20 బిల్లులు సభలో పెట్టి.. ఒకటి న్యాయబద్ధంగా లేదని ఉపసంహరించుకుంది. దాన్ని మార్పులు చేసి.. వచ్చే సమావేశాల్లో ప్రవేశ పెడతారు. మిగతా 19 బిల్లులు ఆమోదం పొందాయి. విద్యా వ్యవస్థలో ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణ, నియామకపు పదవులు, కాంట్రాక్ట్ లు, నామినేషన్లలో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పదవులు, భూ హక్కు చట్టం, కౌలు రైతుల హక్కులు, రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకు ఉద్యోగాలిచ్చే చట్టాలను ఆమోదించారు.

ఐదేళ్ల పాలనపై విచారణలు..!

చంద్రబాబు ఐదేళ్ల పాలనలో.. ఎన్నో అక్రమాలు జరిగాయని గట్టిగా నమ్ముతున్న సర్కార్.. అన్నింటిపైనా విచారణకు ఆదేశించింది. విధానపరమైన నిర్ణయాలపైనే కాదు.. చివరికి.. పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాటపై కూడా.. విచారణ జరిపించాలని నిర్ణయించడం కొసమెరుపు. చివరి రోజు.. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ను టార్గెట్ చేశారు. దానిలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ.. విచారణకు నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ఫైబర్ గ్రిడ్ నుంచి వచ్చే టీవీ ప్రసారాలకు రెండు బాక్స్ లు కొనుగోలు చేయాలని, ఇవి 3 వేల 500 రూపాయల ఖర్చవుతుందని, కానీ 4 వేల 400 రూపాయలు వసూలు చేశారని మంత్రి అసెంబ్లీలో బాక్సులు చూపించి మరీ ఆరోపించారు. దాంతో ఓపెనింగ్ టు ఎండింగ్.. చంద్రబాబు పాలనను టార్గెట్ చేసుకుంటూ సాగి… ముగిసింది.

జగన్‌కు పొగడ్తలే పొగడ్తలు..!

ఈ సమావేశాల్లో.. వైసీపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి జగన్ ను పొగడటానికి … ప్రత్యేకంగా స్క్రిప్ట్ రచయితల్నీ పెట్టుకుని మరీ.. రచనలు చేయించుకున్నట్లుగా పొగడ్తల వర్షం కురిపించారు. చివరికి.. తాము పలకలేని… వాక్యాలతో ఉన్న పొగడ్తలను.. పలకడలో తడబడి నవ్వుల పాలయ్యారు. జగన్‌ను… వాస్కోడం ( వాస్కోడిగామా ) నుంచి గాంధీ వరకూ పోలికలు తెచ్చారు. గాంధీ ఫాదర్ ఆఫ్ నేషన్ అయితే… జగన్ ఫాదర్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ అన్నారు. అది ప్రారంభం మాత్రమే… జగన్ కు… హీరోచితాన్ని అంటగట్టడానికి ఎమ్మెల్యేలు ఎవరూ మొహమాట పడలేదు.

విపక్షాలకు తిట్లు, శాపనార్థలు..!

జగన్‌ను పొగడటంలో పోటీ పడిన వైసీపీ ఎమ్మెల్యేలు.. విపక్ష నేత చంద్రబాబును… టీడీపీ ఎమ్మెల్యేలకు తిట్లు, వార్నింగ్‌లు ఇవ్వడంలో ఏ మాత్రం.. సంకోచించలేదు. ఖబడ్దార్.. ఓ ఎమ్మెల్యే హెచ్చరిస్తే… బుద్ది జ్ఞానం లేదని.. నేరుగా ముఖ్యమంత్రే విమర్శించారు. తాము లేస్తే.. మీరు కూర్చోలేరని.. నేరుగా సీఎం వార్నింగ్ ఇచ్చారు. ముగుర్ని సమావేశాలు మొత్తం సస్పెండ్ చేశారు. నలుగుర్ని ఓ రోజు సస్పెండ్ చేశారు. తొలి సమావేశాలే ఇలా ఉంటే.. ముందు ముందు.. ఎలా ఉంటాయోనన్న భావన మాత్రం ఈ సమావేశాలు తీసుకొచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com