రివ్యూ : ‘రైట్ రైట్’ కాదు హాల్ట్ హాల్ట్..

మళయాలంలో మంచి విజయం సాధించిన ‘ఆర్డినరీ’ అనే సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన చిత్రమే ‘రైట్ రైట్’, ‘అంతకుముందు ఆ తరువాత’, ‘లవర్స్’, ‘కేరింత’ సినిమాలతో మంచి విజయాలను అందుకున్న హీరో సుమంత్ అశ్విన్ హీరోగా నటించగా, కాళకేయ ప్రభాకర్ మరో ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘రైట్ రైట్’. శ్రీ సత్య ఎంటర్టైన్మెంట్ పతాకం పై జె.వంశీ కృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి మను దర్శకుడిగా పరిచయం అయ్యాడు. మంచి అంచనాలతో ఈ సినిమా నేడు(10.06.2016) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎంతమేరకు ప్రేక్షకులను ఆకట్టుకుందీ? చూద్దాం..

కథ:
పోలీస్ ఆఫీసర్ అవ్వాలని కలలు కనే రవి (సుమంత్ అశ్విన్) ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, పెరిగిన యువకుడు కుటుంబ బాధ్యతలన్నీ తనే మోయాల్సిన పరిస్థితుల్లో బస్ కండక్టర్ అవుతాడు. యస్.కోటా నుండి గవిటికి వెళ్లే బస్సు రూటుకు కండక్టర్ గా రవి, డ్రైవర్ గా శేషు (బాహుబలి ఫేం ప్రభాకర్) జర్నీని ఎంజాయ్ చేస్తూ గవిటి గ్రామానికి చెందిన ప్రజలతో మంచి అనుబంధం పెంచుకుంటారు. ఆ గ్రామ సర్పంచ్ విశ్వనాధం (నాజర్) తో కూడా వీరికి చక్కటి అనుబంధం ఏర్పడుతుంది. సర్పంచ్ కొడుకు దేవా సూరత్ లో ఉంటాడు. చిన్నప్పట్నుంచి పెంచుతున్న అమృతని తన కొడుకు దేవాకి ఇచ్చి పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతాడు సర్పంచ్. అమ్మ, నాన్న చనిపోవడంతో అనాధ అయిన భద్ర అనే కుర్రాడిని కూడా సర్పంచ్ చేరదీసి చిన్నప్పట్నుంచి పెంచుతాడు. భద్ర ఊళ్లోని వాళ్లందరికీ చేదోడువాదోడుగా ఉంటాడు. అదే గ్రామానికి చెందిన కళ్యాణి ని (పూజా జవేరి) రవి ప్రేమిస్తాడు. ఒక రోజు బస్సు రిపేర్ చేయించిన తర్వాత తాగి ఉన్న శేషు బస్ డ్రైవ్ చేయడం కరెక్ట్ కాదని భావించి, రవి యే బస్సు డ్రైవ్ చేస్తాడు. ఆ సమయంలో దేవా బస్సుకు అడ్డంగా రావడంతో యాక్సిడెంట్ అవుతుంది. అటు వైపుగా వెళుతున్న జీప్ లో దేవాని హాస్పటల్లో చేర్పించమని చెప్పి రవి. శేషు గవిట గ్రామానికి చేరుకుంటారు. కొడుకు గ్రామానికి వస్తున్నాడని సర్పంచ్ ఆనందంగా ఎదురుచూస్తుంటారు. యాక్సిడెంట్ అయిన విషయాన్ని దాచేస్తారు రవి, శేషు. హాస్పటల్లో ఉండాల్సిన దేవా కొండ లోయల్లో శవమై తేలతాడు. దాంతో నిర్ఘాంతపోయిన రవి, శేషు తమవల్లే దేవా చనిపోయాడని మదనపడిపోతుంటారు. యాక్సిడెంట్ సమయంలో దొరికిన దేవా బ్యాగ్ లోని లెటర్స్ రవి చదువుతున్నప్పుడు ఆ లెటర్స్ అమృత చేతికి చిక్కుతాయి. దాంతో దేవాని రవి, శేషు కలిసి ఏదో చేసారని, అందుకే దేవా చనిపోయాడని భావించిన గవిటి ప్రజలు రవి, శేషుల ను పోలీసులకు అప్పజెబుతారు.రవి, శేషుల వల్ల జరిగిన ప్రమాదం ఏంటీ? తను ప్రేమించిన అమ్మాయి కళ్యాణి రవికి దక్కుతుందా? ఒక్కసారే వచ్చిపడ్డ ఈ కష్టాలను రవి ఎలా ఎదుర్కున్నాడూ? లాంటి ప్రశ్నలకు సమాధానమే మిగతా సినిమా.

నటీనటుల పెర్ ఫామెన్స్:
బస్ కండక్టర్ గా, ఓ మిడిల్ క్లాస్ కుర్రాడైన రవి పాత్రలో సుమంత్ అశ్విన్ బాగున్నాడు. ఓ యాక్సిడెంట్ కి తనదే బాధ్యత అని, ఓ తండ్రికి కొడుకు లేకుండా చేసానని, ఓ అమ్మాయి జీవితం నాశనమవ్వడానికి తనే కారణమని భావిస్తూ మదనపడిపోయే సీన్స్ లో సుమంత్ అశ్విన్ బాగా నటించాడు. అశ్విన్ తనకు అలవాటైన పాత్రే చేసినా, ఈ పాత్రలో చాలా బాగా నటించాడు. పాత్ర పరిధులు దాటకుండా సుమంత్ తన శక్తిమేర బాగా చేశాడు. ఇక ప్రభాకర్ తన కెరీర్లో ఇలాంటి పాత్రల్లో చాలా తక్కువగా కనిపించాడు. పూర్తిగా నెగటివ్ పాత్రలనే చేయగలడన్న పేరేదైనా ప్రభాకర్‌పై ఉంటే ఈ సినిమాతో దాన్ని పోగొట్టేలా చేశాడు. తన పాత్రతో అందరూ కనెక్ట్ అయ్యేలా ప్రభాకర్ బాగా నటించాడు. ఇక నాజర్ ఎప్పట్లానే తన స్థాయికి తగ్గ నటనతో మెప్పించారు. పావని గంగిరెడ్డి తన పాత్రలో ఒదిగిపోయింది. ఇక హీరోయిన్‌గా పూజా జవేరికి చెప్పుకోదగ్గ సన్నివేశాలేవీ లేకపోయినా, ఉన్నంతలో బాగా చేసింది. భద్ర అనే పాత్రలో నటించిన వినోద్ కిషన్ గుర్తుండే పాత్రలో నటించాడు.

సాంకేతిక వర్గం:
మళయాలంలో ఆకట్టుకున్న కథను, ఇక్కడి నేపథ్యానికి తగ్గట్టుగా బాగానే మార్చుకున్నా, ఆ కథను పాతతరం పరిస్థితులు, ఆలోచనల చుట్టూ చెప్పడమే మను చేసిన తప్పుగా కనిపిస్తుంది. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన మను పూర్తి స్థాయిలో ప్రతిభ చూపడంలో విఫలమయ్యాడనే చెప్పుకోవాలి. దర్శకుడిగా కొన్నిచోట్ల మాత్రమే ప్రతిభే చూపాడు. ‘రైట్ రైట్’ ఓ చిన్న సినిమా అన్న ఆలోచన తెప్పించదు. ముఖ్యంగా శేఖర్ వి జోసఫ్ సినిమాటోగ్రఫీ గురించి ఎంత చెప్పినా తక్కువే! సినిమా మూడ్‌ను ఎక్కడా దారితప్పించకుండా, లొకేషన్స్‌ని సరిగ్గా వాడుకుంటూ ఓ మంచి ఫీల్ తెచ్చారు. ఇంటర్వెల్ బ్లాక్‌ని శేఖర్ పనితనానికి ఓ నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇక జేబీ అందించిన మ్యూజిక్ ఫర్వాలేదు. సందర్భానుసారంగా వచ్చే పాటలన్నీ విజువల్స్‌తో కలిపి చూసినప్పుడు బాగున్నాయి. ఉద్ధవ్ ఎడిటింగ్ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు.

విశ్లేషణ:
అసలు కథతో పాటు చుట్టూ ఉండే పరిస్థితులు, ఆలోచనలు.. అన్నీ 80,90వ దశకంలో వచ్చిన సినిమాలను తలపించడం గురించే చెప్పుకోవాలి. కథేమో నేటితరంలో నడుస్తూ, చుట్టూ ఉన్న పరిస్థితులు, ఆలోచనలేమో పాతతరంలా కనిపిస్తూ రెండింటికీ కనెక్షన్ కుదరక సినిమా అసహజంగా కనిపిస్తుంది. ఇక సెకండాఫ్ మొదలయ్యే వరకూ అసలు కథలోకి తీసుకెళ్ళకుండా, అప్పటివరకూ కట్టిపడేసే సన్నివేశాలేవీ పెట్టకుండా ఫస్టాఫ్ మొత్తం కాలక్షేపంలా గడిపేయ్యడం ఆకట్టుకోలేదు.అదేవిధంగా సెకండాఫ్‌లో ట్విస్ట్‌లతో ఆకట్టుకున్నా, క్లైమాక్స్ దగ్గరకు వచ్చేసరికి సినిమా పూర్తిగా మెలోడ్రామాగా మారిపోయింది. ఈ సన్నివేశాల్లో భావోద్వేగం కనెక్ట్ అవ్వకపోగా, కాస్త అతిగా కూడా కనిపించింది. ఇక ఒక మిస్టరీ చుట్టూ తిరిగే సెకండాఫ్‍లో ఆ మిస్టరీ వెనుక ఉన్న కారణం కూడా మరీ బలమైనది కాకపోవడం కూడా చిత్రం లో మైనేస్స్ పాయింట్స్. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్, ప్రీ క్లైమాక్స్‌లో ట్విస్ట్ బయటపడే విధానం.. కాస్త పరవాలేదు అనిపిస్తుంది.చివరాఖరికి చెప్పేదేంటంటే.. కాస్త మెలోడ్రామా ఎక్కువై ‘రైట్ రైట్’ మాతృక పక్కదారి పట్టింది…! జస్ట్ టైం పాస్ మూవీ.

తెలుగు360.కామ్ రేటింగ్ 2.25/5
బ్యానర్ – శ్రీ సత్య ఎంటర్ టైన్ మెంట్స్
నటీనటులు – సుమంత్ అశ్విన్, పూజా జవేరి, పావని, నాజర్, ‘బాహుబలి’ ఫేం ప్రభాకర్, రాజా రవీంద్ర, భరత్ రెడ్డి, వినోద్, రాజ్యలక్ష్మీ, సుధ, కరుణ, జయవాణి, ధనరాజ్, తాగుబోతు రమేష్, షకలక శంకర్, జీవా తదితరులు
కథ – సుజీత్
సంగీతం – జె.బి
కెమెరా – శేఖర్.వి.జోసఫ్
మాటలు – డార్లింగ్ స్వామి
కో-ప్రొడ్యూసర్ – జె.శ్రీనివాసరాజు
నిర్మాత – జె.వంశీకృష్ణ
సమర్పణ – వత్సవాయి వెంకటేశ్వర్లు
దర్శకత్వం – మను
విడుదల తేది :10.06.2016

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com