ప్రతి మధ్య తరగతి కుటుంబానికి సొంత ఇల్లు అనేది ఓ డ్రీమ్. కానీ వారి ఆదాయాలకు మించి ఇళ్ల రేట్లు పెరిగిపోతూ ఉంటాయి. ఓ ఇరవై లక్షలు బడ్జెట్ అనుకుని .. సంపాదన, అప్పులు ఇలా మొత్తం సెట్ చేసుకుని ఇల్లు కొనడానికి ప్రయత్నిస్తే ఇళ్ల ధర నలభై లక్షలకు చేరి ఉంటుంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి. ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితుల్లో లాభదాయమైన బేరంతో ఇల్లు కొనుగోలుకు సరైన సమయం అని నిపుణులు చెబుతున్నారు.
వివిధ కారణాలతో ఇళ్ల అమ్మకాలు అనుకున్న మేర జరగడం లేదు. ఈ కారణంగామార్కెట్ లో ఇళ్ల ధరలు కాస్త అందుబాటులోనే ఉన్నాయి. బిల్డర్లు ధరలు తగ్గించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. బేరాలాడితే SFTకి కనీసం 100 రూపాయల నుంచి 300 రపాయల వరకు ధరలు తగ్గిస్తున్నారు . నిర్మాణదారులతో బేరాలాడితే ఇప్పుడు సరసమైన ధరకు లభించే అవకాశం ఉంది. హైదరాబాద్ లో ప్రస్తుతం వందలకొద్దీ భారీ నివాస ప్రాజెక్టులు నిర్మాణం పూర్తై అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ఇల్లు కొనాలనుకుంటున్న ప్రాజెక్టులో మనకు నచ్చిన ఫ్లాట్ ను ఎంచుకునే ఛాన్స్ ఉంది.
అమ్మకాలు ఎక్కువగా ఉన్నప్పుడు మనకు నచ్చిన ఫ్లోర్ లో, నచ్చిన దిశగా ఇల్లు దొరికే అవకాశం తక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు అమ్మకాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి నిర్మాణ ప్రాజెక్టులో మనకు నచ్చిన ఇంటిని ఎంపిక చేసుకునే ఛాన్స్ లభిస్తుంది. అంతే కాకుండా మన కుటుంబ అవసరాలకు సరిపోయే విస్తీర్ణంలో ఫ్లాట్ కావాలన్నా ఇదే రైట్ టైమ్ అనుకోవచ్చు. పూర్తయినవే కాకుండా ఇంకా పెద్ద ఎత్తున అపార్ట్ మెంట్, విల్లా ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో ఇప్పటికే సిద్దమైన ప్రాజెక్టులతో పాటు ఈ ఏడాది ఆఖరు, వచ్చే ఏడాది ప్రారంభం నాటికి గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న నివాసాలు ఉన్నాయి.
వీటిలో మంచి ఆప్షన్ చూసుకుని కొనుగోలు చేయవచ్చు. వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి. అన్నీ సానుకూలతలే కనిపిస్తున్నాయి. ఆరు నెలల తర్వాత మళ్లీ రియల్ బూమ్ పెరిగితే.. వాటిని అందుకోవడం చాలా కష్టమవుతుంది.