‘కాంతార’తో తన విశ్వరూపం చూపించాడు రిషభ్ శెట్టి. ఇప్పుడు ‘కాంతార 2’తో బిజీగా ఉన్నాడు. ఈలోగా ఓ కొత్త సినిమాని ఒప్పుకొన్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థలో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు. సితార సంస్థలో ఇది 36వ చిత్రం. అశ్విన్ గంగరాజు ఈ చిత్రానికి దర్శకుడు. సితారతో పాటుగా శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సంస్థలు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. యుద్ధ నేపథ్యంలో సాగే చిత్రమిది. యుద్ధ వీరుడిగా రిషభ్ ని పరిచయం చేస్తూ ఓ ప్రీ లుక్ కూడా వదిలారు.
గుణ్ణం గంజరాజు తనయుడే అశ్విన్ గంగరాజు. రాజమౌళి రూపొందించిన ‘బాహుబలి’ ఫ్రాంచైజీలో అశ్విన్ కీలక పాత్ర పోషించాడు. ఆ తరవాత ‘ఆకాశవాణి’ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. అయితే అశ్విన్ కథలపై రాజమౌళికి గానీ, ఆయన టీమ్ కి గానీ చాలా నమ్మకం. ప్రస్తుతం మహేష్ సినిమాకూ ఆయన వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు రిషభ్ శెట్టితో ఓ భారీ చిత్రానికి శ్రీకారం చుట్టగలిగారు. `కాంతార 2` తరవాతే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుంది. సితార సంస్థలో ఇప్పుడు చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి. వాటన్నింటితో పోలిస్తే బడ్జెట్ పరంగా ఈ సినిమా పై మెట్టులో ఉండబోతోంది. ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తారు.