కొత్తపలుకు : ఒక్క సామాజికవర్గ వినాశనమే జగన్ లక్ష్యమంటున్న ఆర్కే..!

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ.. ఫైర్ మీదున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏబీఎన్ చానల్‌పై.. ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం… కేబుల్ ఆపరేటర్లను బెదిరించి .. తన చానల్ ప్రసారాలను నిలిపివేయడంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తన వారాంతపు ఆర్టికల్ ” కొత్తపలుకు”లో ఈ విషయంపై… తన అభిప్రాయాలను సూటిగా వ్యక్తం చేస్తూనే.. గతవారం చోటు చేసుకున్న కీలకమైన పరిణామాలను.. మీడియాలో రాని సరికొత్త అంశాలను… వెల్లడించి.. ఆసక్తి రేపారు.

ఆ సామాజికవర్గ వ్యాపారాలను దివాలా తీయించడమే జగన్ సింగిల్ టార్గెట్..!

“ఫలానా సామాజికవర్గం వాళ్లు నా టార్గెట్. ఫలానా ఫలానా కంపెనీలు దివాలా తీసేవరకు నేను ఎవరి మాట వినను. అలాంటివారితో మీరు ఎటువంటి లావాదేవీలు పెట్టుకోవద్దు. అన్నట్టు గత ప్రభుత్వం మీకు కేటాయించిన భూమిపై కూడా సమీక్షించి రద్దుచేస్తాం” ఈ మాట సాక్షాత్తూ.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.. గుజరాత్‌కు చెందిన ఓ పారిశ్రామికవేత్తతో అన్నారట. ఆయన “ఆంధ్రా సీఎం మ్యాడ్ ఫెలో” అని పారిశ్రామికవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారట. అంతర్గతంగా జరిగే విషయాలను… పత్రికలు, టీవీలు న్యూస్‌ ఆర్టికల్స్‌గా రిపోర్ట్ చేయలేవు. గాసిప్స్‌గా ఉండిపోతాయి. కానీ ఏబీఎన్ రాధాకృష్ణ మాత్రం ” కొత్తపలుకు”లో సూటిగా సుత్తి లేకుండా… వీటిని వివరిస్తారు. ఆ గుజరాత్ పారిశ్రామిక వేత్త అలా అంటున్న విషయాన్ని… జగన్మోహన్ రెడ్డి ఒక్క సామాజికవర్గాన్ని టార్గెట్ చేసిన వైనాన్ని ప్రత్యక్షంగా చూసిన వారు రాధాకృష్ణ మాటల్ని నమ్మక తప్పదు. ఏపీలో ఇప్పుడు ప్రతీ విషయం.. ఒక్క సామాజికవర్గానికి వ్యతిరేకంగానే సాగుతోందేది.. చాలా మందికి ఉన్న అభిప్రాయం. దాన్నే ” కొత్తపలుకు”లో .. తనదైన శైలిలో రాధాకృష్ణ వ్యక్త పరిచారనుకోవచ్చు.

ఏపీ నాశనమైనా జగన్ కు పర్వాలేదా..?

రాష్ట్ర ప్రయోజనాలనూ జగన్ వ్యక్తిగత కక్షల కోసం.. పణంగా పెడుతున్నారన్న విషయాన్ని రాధాకృష్ణ… తన ” కొత్తపలుకు”లో వివరించే ప్రయత్నం చేశారు. ఇందు కోసం కేసీఆర్‌తో పోల్చారు. కేసీఆర్ వ్యక్తిగత ప్రవర్తన ఎంత అభ్యంతరకరంగా ఉంటున్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మాత్రం ఆయన చిత్తశుద్ధిని రాధాకృష్ణ ప్రశంసించాు. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి కంకణం కట్టుకున్నారు. కేసీఆర్‌కు, జగన్మోహన్‌రెడ్డికి ఇదే తేడా! అని.. రాధాకృష్ణ చెబుతున్నారు. కేసీఆర్ గత ప్రభుత్వాల నిర్ణయాలను తిరగదోడటం, రద్దుచేయడం వంటి చర్యలకు పాల్పడకుండా తనదైన శైలిలో తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్‌ అడుగులు వేశారని.. జగన్మోహన్‌రెడ్డి ఇందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆర్కే చెప్పుకొచ్చారు. ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదికను ఎందుకు కూల్చివేశారో, కూల్చివేయడం ద్వారా సాధించింది ఏమిటో ఇప్పటికీ ఎవరికీ తెలియదని గుర్తు చేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ దాదాపుగా బ్లాక్‌లిస్టులో చేరిందన్నారు.

ఆ రోజుల్లో అమరావతిలో జరిగింది 180 ఎకరాల లావాదేవీలే..!

రాజధాని ప్రాంతంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ పేరిట అతిపెద్ద కుంభకోణం జరిగిందని ప్రచారం చేసినా … ఇప్పటి వరకూ ఆధారాలు బయట పెట్టలేకపోవడానికి అసలు కారణాన్ని కూడా ఆర్కే తన కాలమ్‌లో వెల్లడించారు. భూముల క్రయవిక్రయాలకు సంబంధించి లావాదేవీలను వెలికితీయడానికి నియమితులైన అధికారి కూడా రోజుల తరబడి శోధించగా అమరావతి ప్రకటనకు ముందు ఆ ప్రాంతంలో కేవలం 180 పైచిలుకు ఎకరాలలోనే క్రయవిక్రయాలు జరిగినట్టు గుర్తించగలిగారట. అంటే బయపెట్టడానికి ఏమీ లేకపోవడం వల్లే సైలెంట్ గా ఉండిపోతున్నారంటున్నారు.

ఏపీలో నిషేధంతో తన ఇమేజ్ పెంచుకుంటున్న రాధాకృష్ణ..!

“మాకు అధికారం ఉంది. ఏబీఎన్ రాధాకృష్ణకు అధికారం ఉందా? ఏమి చేయగలడు? మేం చెప్పినట్టుగా ఆ రెండు చానెళ్ల ప్రసారాలను నిలిపివేయని పక్షంలో ఏమిచేయాలో మాకు తెలుసు..” అని కొడాలి నాని కేబుల్ ఆపరేటర్లను హెచ్చరించారు. “ఇది ముఖ్యమంత్రి జగన్ మాట, అమలు జరిగి తీరాల్సిందే” అని మరో మంత్రి పేర్ని నాని వారిపై హూంకరించారు. .. ఇవన్నీ రాధాకృష్ణ చెప్పిన మాటలు. కొంత మంది కేబుల్ ఆపరేటర్లు ఈ విషయాలను బహిరంగంగానే చెబుతున్నారు. అయితే ఆర్కే… జగన్మోహన్ రెడ్డి దుందుడుకు తనాన్ని తనకు అనుకూలంగా మార్చుకోగల శక్తి ఉన్న జర్నలిస్టు. దానికి తగ్గట్లుగానే ఆయన తన కాలమ్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. తన ఇమేజ్ ను పెంచుకునే ప్రయత్నం చేశారు. గతంలో ఆయన తండ్రి కానీ.. కేసీఆర్ కానీ ఏమీ చేయలేకపోయిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. జగన్ కూడా ఏమీ చేయలేడని తేల్చారు. దీని ద్వారా… జగన్ మరిన్ని నిర్ణయాలు తీసుకుంటే.. వాటిని అడ్వాంటేజ్ గా మార్చుకునేందుకు ఆర్కే ఇలా ప్లాన్ చేశారనుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com