తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తెచ్చేది ఎవరు.. హరీష్ రావునా లేకపోతే రేవంత్ రెడ్డినా? . ఇదేం ప్రశ్న.. వారిద్దరూ వేర్వేరు పార్టీల్లో ఉన్నారు. పైగా రేవంత్ సీఎంగా ఉన్నారు. ఇలాంటి డౌట్ ఎవరికైనా ఎందుకొస్తుంది?. కానీ వచ్చేలా చేయడంలో ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఈ వారం నిప్పు రాజేశారు. ప్రధాని మోదీ అటు హరీష్ రావుపైనా.. ఇటు రేవంత్ పైనా కన్నేసి బీజేపీలోకి లాగే ప్రయత్నంలో ఉన్నారని తేల్చారు. ఈ వారం కొత్తపలుకులో ఆయన మోదీ, షాల రాజకీయాలపై సుదీర్ఘంగా విశ్లేషించి మధ్యలో వీరిద్దరి పేర్లు కలిపేశారు.
రేవంత్ రెడ్డిని ఇటీవల హైదరాబాద్ లో జరిగిన సభలో మోదీ నేరుగా తనతో కలిసి పని చేయాలని ఆహ్వానించారు. అది ప్రభుత్వ కార్యక్రమం కావడంతో అధికారికంగా.. అభివృద్ధి కోసం కలసి పని చేయాలని ఆహ్వానించారని అందరూ కవర్ చేసుకున్నారు. కానీ అసలు మోదీ చేసేదే రాజకీయం అని తెలిసిన వాళ్లు మాత్రం అది రాజకీయ ఆహ్వానంగానే భావించారు. భావిస్తున్నారు. ఆర్కే కూడా అదే అనుకుంటున్నారు. అయితే ఇక్కడ నేరుగా రేవంత్‌ను మాత్రమే రాకుండా.. రేవంత్ రెడీగా లేకపోతే హరీష్‌ను అయినా తీసుకుంటారని అంటున్నారు. హరీష్ ను తీసుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయో మాత్రం ఆర్కే చెప్పలేదు. గతంలో రేవంతే.. రహస్యంగా కలుస్తున్నారని లీకులు ఇచ్చారు.
ఇక్కడ ఆర్కే బీజేపీ, మోదీ కోసం మైండ్ గేమ్ కూడా ఆడారు. అదేమిటంటే.. బీజేపీని ధిక్కరించిన వారికి రాజకీయమనుగడ లేదని ఉదాహరణలతో చెప్పారు. అలాగే బీజేపీ కోసం పార్టీలను చీల్చిన వారు.. పార్టీని వీడి వచ్చిన వారు మంచి పదవుల్లో ఉన్నారని ఉదాహరణ చెప్పారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా తన పార్టీని కోల్పోయే స్థితిలో ఉండగా..బీజేపీతో మంచి రిలేషన్స్ ప్రారంభించిన డీఎంకే సేఫ్‌గా ఉందని కూడా గుర్తు చేశారు.
అదే సమయంలో ఇండియా కూటమికి భవిష్యత్ లేదని కూడా ఆయన తేల్చేశారు. కూటమి పూర్తిగా బలహీనపడింది. రాహుల్ కు ఇప్పటికీ రాజకీయాలు తెలియడం లేదు. మోదీ రోజు రోజుకు బలపడుతున్నారు కానీ బలహీనపడుతున్న సంకేతాలు కనిపించడం లేదు. మొత్తంగా తన ఆర్టికల్ ద్వారా రేవంత్, హరీష్ రావులను పరోక్షంగా మోటివేట్ చేయడానికి ఆర్కే ప్రయత్నించారని సులువుగానే అర్థమవుతుంది.

