ఈమధ్య నిర్మాతలకు సినిమా మేకింగ్ మీద కంటే… పారితోషికాల మీద ఎక్కువ పోకస్ చేయాల్సివస్తోంది. హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, విలన్లు… పారితోషికాల పేరుతో నిర్మాతల్ని పిండేస్తున్నారు. ముఖ్యంగా విలన్లని భరించడం చాలా కష్టం. కొత్తదనం కోసం పరాయి రాష్ట్రాల నుంచి ప్రతినాయకుల్ని తీసుకొచ్చి, వాళ్లకు భారీ పారితోషికాల్ని అర్పించుకోవాల్సివస్తోంది. అయితే ఈ విషయంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లక్కీ అనుకోవాలి. ఈ సంస్థ నుంచి వస్తున్న సినిమా ‘మోగ్లీ: 2025’. ఇందులో బండి సరోజ్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం సరోజ్ ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదు. ఈ విషయాన్ని దర్శకుడు సందీప్ రాజ్ స్వయంగా వెల్లడించారు.
బండి సరోజ్‌ది విభిన్నమైన వ్యక్తిత్వం. తను ఇండిపెండెంట్ సినిమాలు చేసుకొంటుంటాడు. తనే హీరో, తనే నిర్మాత, తనే దర్శకుడు. అన్ని క్రాఫ్ట్స్‌ని దగ్గరుండి చూసుకొంటాడు. సినిమాల్లో తనకు ఇది వరకు కూడా చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ సందీప్ ఒప్పుకోలేదు. మరో దర్శకుడి నీడలో పని చేయడం తనకు ఇష్టం ఉండకపోవడమే కారణం. సందీప్ రాజ్‌కు కూడా ముందు ‘నో’ చెప్పాడు. కానీ కథ విని.. తన పాత్ర నచ్చి… ‘ఓకే’ చేశాడు. కానీ ఒకే ఒక్క కండీషన్ పెట్టాడట. ‘నాకు ఒక్క రూపాయి కూడా పారితోషికం ఇవ్వొద్దు.. అలా ఇస్తే నేను చేయను’ అంటూ షరతు విధించాడని టాక్. పారితోషికం వద్దంటే నిర్మాతలూ హ్యాపీనే కదా.
ఈనెల 12న మోగ్లీ రావాలి. కానీ అఖండ 2 వల్ల వాయిదా పడింది. కాకపోతే ఇప్పుడు 13న రిలీజ్ చేయడానికి నిర్మాత రెడీ అవుతున్నారు. 12న ప్రీమియర్లు ప్రదర్శించే వీలుంది. సో…. డిసెంబరు 12 తేదీ మోగ్లీ మిస్ అవ్వనట్టే..
