శ్రీకాంత్ తనయుడు రోషన్ జోరు పెంచాడు. మొన్ననే.. ‘ఛాంపియన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా ఆడలేదు. కాకపోతే రోషన్ లుక్స్ బాగున్నాయి అనే పేరు అయితే వచ్చింది. దానికి తోడు నటనలో ఈజ్ చూపించాడు. అందుకే అవకాశాలు వరుసగా వస్తున్నాయి. ఇటీవలే.. ఓ కొత్త సినిమా మొదలెట్టాడు. శైలేష్ కొలను దర్శకుడు. ఈ చిత్రానికి `ఏమో ఏమో ఇది` అనే పేరు ఖరారు చేశారు. గ్లింప్స్ కూడా వదిలారు. ఈ సినిమా సెట్స్‌పై ఉంది.
ఈలోగా మరో సినిమాపై సంతకాలు చేశాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శత్వంలో అశోక్ వర్దన్ ముప్పా నిర్మాతగా ఓ సినిమా రూపుదిద్దుకోనుంది. ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతీ’ చిత్రానికి నిర్మాత ఈయన. ఇప్పుడు ఇదే బ్యానర్లో సినిమా చేయబోతున్నారు. హీరోగా రోషన్ ఎంపికయ్యాడు. కథా చర్చలు పూర్తయ్యాయి. ఇంద్రగంటి స్టైల్ లో సాగే టిపికల్ లవ్ స్టోరీ ఇది. వినోదానికి పెద్ద పీట వేశారు. ‘సారంగపాణి జాతకం’ తరవాత ఇంద్రగంటి చేస్తున్న సినిమా ఇదే. మధ్యలో దిల్ రాజు బ్యానర్లో ఓ సినిమా చేయాల్సివుంది. విజయ్ దేవరకొండ కోసం ఆయన ఓ కథ రాసుకొన్నారు. బడ్జెట్ దాదాపు రూ.100 కోట్ల పైమాటే. ఈ సినిమా చేయడానికి దిల్ రాజు మొన్నటి వరకూ ఉత్సాహం చూపించారు. కానీ ఎందుకో ఆలస్యం అవుతోంది. అందుకే ఈలోగా ఓ సినిమా ఫినిష్ చేయాలని భావించారు. విజయ్ తో సినిమా 2027లో ఉండొచ్చు.