‘రూల‌ర్’ టీజ‌ర్‌: సింహం వేట మొద‌లైంది

కె.ఎస్‌.ర‌వికుమార్‌వి ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ సినిమాలే. ఆయ‌న ఎప్పుడు ఏ క‌థ ఎంచుకున్నా వాణిజ్య సూత్రాల్ని వ‌ద‌లిపెట్ట‌రు. ఇక అందులో హీరో బాల‌కృష్ణ అయితే మాస్ మ‌సాలా అద‌రాల్సిందే. ‘రూల‌ర్‌’ టీజ‌ర్ చూశాక‌… ఈ సినిమా కూడా అందుకు మిన‌హాయింపు కాద‌నిపిస్తోంది. ఓ ప‌వ‌ర్ఫుల్ పోలీస్ అధికారి – త‌న కుటుంబం – ఎదురైన స‌వాళ్లు.. ఇదే లైన్‌తో అల్లుకున్న క‌థ‌లా అనిపిస్తోంది. వేదిక‌, సోనాల్ చౌహాన్ క‌థానాయిక‌లుగా న‌టించారు. సి.క‌ల్యాణ్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించిన ఈ చిత్రం డిసెంబ‌రు 20న వ‌స్తోంది. ఈరోజు.. టీజ‌ర్‌ని వ‌దిలారు.

ధ‌ర్మ మా ఊరి గ్రామ దైవం. ఎవ‌రికి ఏ క‌ష్టం వ‌చ్చినా త‌నే ముందుంటాడు.. అనే డైలాగ్‌తో ఈ టీజ‌ర్ మొద‌లైంది. అక్క‌డి నుంచి… సింహం వేట మొద‌లైంది. యాక్ష‌న్ సీన్లు ట‌ప ట‌ప వ‌చ్చి ప‌డ్డాయి. ప్ర‌కాష్‌రాజ్‌, భూమిక‌, జ‌య‌సుధ‌.. ఇక మిగిలిన విల‌న్ గ్యాంగూ, కథానాయిక‌లు ఫ్రేముల్లో చ‌క చ‌క వ‌చ్చి వెళ్లారు. టీజ‌ర్ క‌ట్ చేసిన విధానం చూస్తుంటే `సింగం` చిత్రాల ద‌ర్శ‌కుడు హ‌రి మేకింగ్ స్టైల్ గుర్తుకు రాక మాన‌దు. బాల‌య్య సినిమాలో ‘సింహం’ డైలాగులు త‌ప్ప‌నిస‌రి. అది ఈ టీజ‌ర్‌తో మ‌రోసారి రుజువైంది.

ఒంటిమీద ఖాకీ యూనిఫామ్ ఉంటేనే బోనులో పెట్టిన సింహంలా ఉంటాను..యూనిఫామ్ తీశానా.. బ‌య‌టికి వ‌చ్చిన సింహంలా ఆగ‌ను.. ఇక వేటే.. అనే డైలాగ్ వినిపించింది. ఇక వేటే అన్న చోట‌.. బాల‌య్య మ‌రోసారి త‌న పాత సినిమాల స్టైల్‌ని గుర్తు చేశాడు. బాల‌య్య పాత్ర రెండు కోణాల్లో ఉంటుంది. ఒక‌టి పోలీస్‌.. మ‌రోటి స్టైలీష్ గెట‌ప్‌. రెండూ బాగానే కుదిరాయి. బాల‌య్య మ‌రోసారి వ‌న్ మాన్ షో చేసిన‌ట్టు ఈ టీజ‌ర్ చూస్తే అర్థ‌మైపోతోంది. అన్నీ ప‌క్కాగా కుదిరితే మాస్‌కి ఈ సినిమా పండ‌గే అనుకోవ‌చ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.