బిజెపి ఎంపీ ఈటల రాజేందర్ బిఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం అంధకారంలో ఉంది.. అందుకే నన్ను మళ్లీ కావాలనుకుంటున్నారు ఏమో అంటూ చేసిన వ్యాఖ్యలు ఆయన ఘర్ వాసపీ అంటూ జరుగుతున్న ప్రచారానికి ఊతమిస్తున్నాయి. గులాబీ పార్టీ నుంచి ఆయనకు గట్టిగానే ఆహ్వానం అందుతున్నట్లు స్పష్టమవుతోందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. గతంలో కేసీఆర్ పక్కన కుడిభుజంలా ఉండి, ఆ తర్వాత అవమానకర రీతిలో బయటకు వచ్చిన ఈటల, ఇప్పుడు మళ్లీ అదే పార్టీ గురించి సాఫ్ట్‌గా మాట్లాడటం వెనుక ఏదో బలమైన రాజకీయ వ్యూహం ఉందనే ప్రచారం జరుగుతోంది.
బిజెపిలో ఉక్కపోత.. భవిష్యత్తుపై అయోమయం
ఈటల రాజేందర్ బిజెపిలో చేరినప్పటి నుండి ఆయనకు ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత దక్కడం లేదనేది బహిరంగ రహస్యం. జాతీయ నాయకత్వం ఆయనకు ఎంపీ సీటు ఇచ్చి గెలిపించినప్పటికీ, రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ప్రాభవం తగ్గుతోందనే ఆవేదన ఆయనలో ఉందంటున్నారు. ముఖ్యంగా బీజేపీ సీనియర్ నేతలతో పోలిస్తే, ఈటల రాజేందర్ అక్కడ కొంత మిస్ ఫిట్ గా మారుతున్నారన్న విశ్లేషణలు వస్తున్నాయి. అందుకే, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆయన మళ్ళీ పాత గూటి వైపు చూస్తున్నారా అనే అనుమానాలు బలపడుతున్నాయి.
పాడి కౌశిక్ రెడ్డి ఫ్యాక్టర్ – అడ్డంకులు ఎన్నో
ఒకవేళ ఈటల బిఆర్ఎస్ లో చేరాలనుకున్నా, అక్కడ పరిస్థితులు అంత సులభంగా లేవు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆయనను ఓడించిన పాడి కౌశిక్ రెడ్డి ప్రస్తుతం అక్కడ బిఆర్ఎస్ లో చక్రం తిప్పుతున్నారు. పైగా కేసీఆర్ గతంలో భూ కబ్జా ఆరోపణలతో ఈటలను మంత్రి పదవి నుంచి తొలగించిన వైనం సామాన్యమైనది కాదు. ఆ గాయాన్ని మర్చిపోయి ఈటల వెళ్తారా లేక బిఆర్ఎస్ అధిష్టానమే తన తప్పు దిద్దుకుని ఆయనను సాదరంగా ఆహ్వానిస్తుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎంపీ పదవికి రాజీనామా చేసి, ఉనికి కోసం పోరాడుతున్న బిఆర్ఎస్ లో చేరడం అంటే అది రాజకీయంగా ఆత్మహత్యాసదృశ్యమే అవుతుందనే వాదనలు కూడా ఉన్నాయి.
క్లారిటీ కావాల్సిందే
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరన్నది నానుడి. ఈటల రాజేందర్ తన వ్యాఖ్యలతో ఒక్కసారిగా తన పాత పార్టీ నేతల్లో ఆశలు, సొంత పార్టీ లో అలజడి రేపారు. ఒకవైపు కేసీఆర్ ను మా బాస్ అనడం, మరోవైపు బిఆర్ఎస్ అంధకారంలో ఉందని ఎద్దేవా చేయడం చూస్తుంటే.. ఆయన రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నారా లేక తన విలువను పెంచుకునేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా అన్నది తేలాల్సి ఉంది. ఏదేమైనా, ఈటల రాజకీయ ప్రయాణం ఇప్పుడు ఒక అత్యంత ఆసక్తికరమైన మలుపు వద్ద నిలబడింది.