రుషికొండ ప్యాలెస్‌ను ఎలా ఉపయోగించాలో నిర్ణయించేందుకు మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అయింది. కందుల దుర్గేష్, పయ్యావుల, బాలవీరాంజనేయుల స్వామి ఈ మంత్రి వర్గ ఉపసంఘంలో సభ్యులుగా ఉన్నారు. ఈ భవనం వల్ల నెలకు రూ. పాతిక లక్షలు ఖర్చు అవుతున్నాయని ఎలా ఉపయోగించుకోవాలన్నదానిపై చర్చించారు.
పర్యాటకరంగానికి ఇచ్చి లగ్జరీ హోటల్ గా నిర్వహించేలా చూడాలన్న ఆలోచనలో ఉన్నారు. అయితే ఈ అంశంపై పూర్తిగా ప్రజాభిప్రాయం కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు. ఎలా వినియోగించాలో ప్రజల నుంచి సలహాలు తీసుకునేందుకు ప్రకటనలు ఇవ్వాలని నిర్ణయించారు. ఆ ప్యాలెస్ గురించి ప్రజలకు మరింత వివరంగా తెలిసేలా చేయనున్నారు. ఆ తర్వాత ప్రజల నుంచి సలహాలు తీసుకుని నిర్ణయం తీసుకోనున్నారు.
అంతకు ముందు అక్క డ ఉన్న టూరిజం కాంప్లెక్స్ వల్ల ఏటా పాతిక కోట్ల వరకూ ఆదాయం వచ్చేది. దాన్ని ధ్వంసం చేసి ఐదు వందల కోట్లకుపైగా వ్యయం చేసి ప్యాలెస్ కట్టడం, అది కూడా హోటల్ కూడా పనికి రాని విధంగా కేవలం జగన్ మోహన్ రెడ్డి, ఆయన పిల్లల కోసం అన్నట్లుగా కొద్ది రూముల్ని కట్టడంతో… హోటల్ గా మార్చడం కూడా కష్టం అవుతుంది. ప్రజల నుంచి అభిప్రాయాలను తీసుకుని ప్రభుత్వానికి .. ఆదాయం వచ్చేలా ఆ భవనాన్ని వినియోగించుకునే అవకాశం ఉంది.