రివ్యూ: భారీ తనానికి సాక్ష్యం

తెలుగు360.కామ్ రేటింగ్ : 2.5/5

తలకు తలపాగా అందంగానే వుంటుంది. అలాగే కాస్త పెద్ద తలపాగా చుట్టుకోవాలని అందరికీ వుంటుంది. అయితే తలకు మించిన తలపాగా చుట్టకోవడం అందరి వల్లా కాదు. దర్శకుడు శ్రీవాస్ నిన్న మొన్నటి వరకు ఓ రేంజ్ సినిమాలు తీసుకుంటూ వచ్చారు. అలాంటిది ఓ భారీ సినిమాకు సరిపడా కథను తయారుచేసుకుని రంగంలోకి దిగారు. భారీ అంటే మళ్లీ ఇల్లా అల్లాంటి భారీ కాదు. కచ్చితంగా విభిన్నమైన పాయింట్ తో కూడిన భారీ సినిమా. అలాంటి దాన్ని డీల్ చేయడం అంటే కాస్త పెద్ద తలపాగా తలకు చుట్టుకునే ప్రయత్నం చేయడమే. శ్రీవాస్ చేసిన ఆ ప్రయత్నమే సాక్ష్యం సినిమా.

సాధారణంగా హీరో తల్లితండ్రులను విలన్ చంపడం, అది చిన్నప్పుడో, పెద్దప్పుడో హీరోకి తెలిసి పగ తీర్చుకోవడం. ఇది ఫక్తు సవాలక్ష తెలుగు సినిమాల ఫార్ములా. అయితే అలా కాకుండా పంచభూతాల ఆధారితమైన ఈ శరీరం తో మనిషి తప్పు చేస్తే, ఆ పంచభూతాలే శిక్షించడం అన్నది శ్రీవాస్ ఆలోచించిన కొత్త కాన్సెప్ట్. అంతే కాదు, ఎందుకు చంపుతున్నాడో హీరోకి, ఎవరు చంపుతున్నారో విలన్ కు తెలియకుండా, ప్రేక్షకులకు మాత్రమే తెలిసే విధంగా కథ నడిపించడం. ఇది కూడా కాస్త కొత్త తరహా స్క్రీన్ ప్లేకు పనికి వచ్చేదే.

ఇలాంటి రెండు విభిన్నమైన పాయింట్లతో దర్శకుడు శ్రీవాస్ రాసుకున్న కథేంటీ అంటే..అనగనగా ఓ రాజుగారు (శరత్ కుమార్), ఆయన చేసే మంచిపనులు నచ్చని మునుస్వామి (జగపతిబాబు), ఆయన సోదరులు. ఓ రోజు ఈ దుష్ట సోదరులు రాజుగారి కుటుంబం మొత్తాన్ని పిల్ల పాపలతో సహా మట్టుపెట్టేస్తాడు. ఓ అద్భుతం జరిగి కథానాయకుడు మాత్రం ఆ ఊరికి దూరంగా విదేశాల్లో బతుకుతాడు. ఎట్టిపరిస్థితుల్లో ఎవ్వరూ సాక్ష్యం వుండకూడదన్నది మునుస్వామి ఆలోచన. కానీ సంఘటనకు సాక్షీ భూతమైన పంచభూతాలు మునుస్వామి సోదరులను హీరో చేతే ఎలా చంపిస్తాయన్నది మిగిలిన సినిమా.

సమ్ థింగ్ కొత్తగా లేకపోతే జనాలు థియేటర్ కు రావడం లేదు. ఆ విధంగా చూసుకుంటే, ఓ మాంచి భారీ కమర్షియల్ సినిమాకు కావాల్సిన కథనే దర్శకుడు శ్రీవాస్ సమకూర్చుకున్నాడని చెప్పాలి. అయితే ఈ చిన్నది కాదు. చాలా పేద్దది. ఎందుకంటే హీరో తండ్రి వ్యవహారం. విలన్ వ్యవహారం. మళ్లీ హీరో వేరే చోట పెరిగిన వైనం, లవ్ ట్రాక్. కాస్త కామెడీ మిక్స్. ఇవన్నీ చొప్పించి అప్పుడు పగతీర్చుకోవడం అది కూడా పంచ భూతాల్లో నాలుగు శక్తులు వేరు వేరు విధాలుగా చంపించడం అన్నది.

సో టోటల్ గా సినిమా నిడివి చాలా వుంటుంది. అంత కథ చెప్పాలి మరి. ఇలా భారీ కథకు సరైన స్క్రీన్ ప్లే తయారుచేసుకోవడం అంత సులువు కాదు. రాజమౌళి లాంటి కొంత మందికే చాతనమవుతుంది. సాక్ష్యం సినిమా చూసిన తరువాత చాలా మందికి కలిగే ఫీలింగ్ ఇదే. ఇదే కథ రాజమౌళి చేతిలో పడితేనా? బోయపాటి అాయితేనా? అన్న మాటలు థియేటర్ బయట వినిపిస్తాయి కూడా.

అయితే అలా అని దర్శకుడు శ్రీవాస్ కృషిని మరీ తీసిపడేయడానికి లేదు. ఆయన గతంలో అందించిన సినిమాలతో పోల్చుకుంటే, ఇప్పుడు చాలా ఎక్కువ వర్క్ నే చేసినట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా కథకు కీలకమైన సన్నివేశాలను చాలా బాగా హ్యాండిల్ చేసారు. సన్నివేశాల రూపకల్పన కానీ, యాక్షన్ ఎపిసోడ్ లకు దారి తీసే వ్యవహారాలు కానీ, వాటి టెంపో కానీ అన్నీ చాలా బాగా రాసుకుని తెరకెక్కించారు. అయితే సమస్య ఎక్కడ వచ్చింది అంటే, కేవలం కథను అసలు పాయింట్ కు పరిమితం చేయకుండా, ఓ కమర్షియల్ సినిమాకు కావాల్సిన అదనపు హంగులు అన్నీ అద్దాలని ప్రయత్నించడం. పైగా ఎక్కడా లాజిక్ మిస్ కాకుండా వుండడం కోసం, లింక్ లు అల్లుకుని, వాటికి తగినట్లు పాత్రలు, ఆ పాత్రల కోసం సన్నివేశాలు అల్లుకుంటూ వెళ్లడంతో నిడివి పెరిగిపోయింది.

దీనికితోడు దర్శకుడు తను ఆలోచించుకున్న కొత్త పాయింట్లకు చేసిన న్యాయం, అలవాటైపోయిన రెగ్యులర్ కమర్షియల్ పాయింట్లకు చేయలేకపోవడం అన్నది గమ్మత్తయిన విషయం. సినిమా ఎత్తుగడ స్మూత్ గానే వుంటుంది. కానీ అక్కడి నుంచి మళ్లీ హీరో అసలు కథలోకి వచ్చేవరకు మాత్రం కాస్త బోరింగ్ కానే వుంటుంది. హీరో వృత్తి వ్యవహారాలు, హీరోయిన్ పరిచయం, ఆమె సంగతులు, రెగ్యులర్ పాటలు ఇవన్నీ పెద్దగా ఆకట్టుకునే రేంజ్ లో తీయలేకపోయారు. భారీతనం కనిపిస్తుంది తప్ప, సోల్ మిస్సయింది. దీనివల్ల తొలిసగం యావరేజ్ మార్కులు మాత్రమే తెచ్చుకుంటుంది. సినిమాలో నాలుగు కాన్సెప్ట్ ఫైట్లలో ఒకటి తొలిసగంలోనే వుంటుంది. కానీ ఇది కూడా ఏమంత అద్భుతంగా వుండదు.

కానీ కథ ద్వితీయార్థంలోకి ప్రవేశించాక, అడ్డంపడే పాటల సంగతి పక్కన పెడితే, మిగతాది అంతా గ్రిప్పింగ్ కానే సాగుతుంది. వివిధ లోకేషన్లు, యాక్షన్ సీన్లు, ఆ ప్లానింగ్ అంతా కాస్త కొత్తగా, భారీగా వుండి ఆకట్టుకుంటాయి. ద్వితీయార్థంలో ఇబ్బంది అనేది ఏదయినా వుందీ అంటే అది పాటలే తప్ప వేరు కాదు. ఆ పాటలు మరీ పెద్దగా ఆకట్టుకోకపోవడం అన్నది ఓ సమస్య. కానీ టోటల్ గా చూసుకుంటే ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం ఎక్కువ మార్కులు తెచ్చుకుంటుంది. క్లయిమాక్స్ బాగుంది. ఇలా అన్ని విధాలా కాస్త బాగున్న ఆ ద్వితీయార్థం వల్లనే సినిమా కాస్త నిలబడుతుంది అనే ఆశ కలుగుతుంది. కానీ ద్వితీయార్థంలో కూడా సమస్య ఏమిటంటే, టూమచ్ సీన్లు రాసుకోవడం. ప్రతి పాత్రను కథతో ముడిపెట్టేందుకు దర్శకుడు డిసైడ్ కావడంతో, ఆ పాత్ర, దాని కోసం అల్లుకున్న సీన్, ఆ సీన్ కోసం అనుబంధ పాత్రలు అన్నీ కలిసి నిడివిని అమాంతం పెంచేసాయి.

ఇక మళ్లీ ప్రథమార్థం సంగతి అవలోకిస్తే, దర్శకుడు ఈ సినిమా కోసం కొత్త పాయింట్ ను ఆలోచించిన తరువాత, పాత వ్యవహారాలను కాస్త తగ్గించేయాల్సింది. ముఖ్యంగా లవ్ ట్రాక్ విషయంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. అమెరికాలో తీసిన సీన్లు అన్నీ పెద్దగా ఇంపాక్ట్ కలిగించలేదు. పైగా హీరో కూడా ఆ సీన్లలో కాస్త తేలిపోయాడు. అదే హీరో ఛాలెంజింగ్ సీన్లు, యాక్షన్ ఎపిసోడ్లు బాగా చేసాడు. దీనికి తోడు హీరోయిన్ పూజా హెగ్డే ఏమిటోగా వుంది. బక్కచిక్కిన ఆ ఫేస్ కొన్ని సన్నివేశాల్లో అస్సలు చూడగలిగేట్టు లేదు. పాటల్లో మాత్రం డ్రెస్ లు, ఫ్యాడింగ్ లు ఆదుకుని ఓకె అనిపించాయి. ఇంకో విషయం ఏమిటంటే, సినిమాకు ఫ్యామిలీలను రప్పించడం అన్న విషయం మరిచిపోయి, హింసను పెంచేసారు. బోయపాటి యాక్షన్ సీన్ల ఆదర్శంగా తీసుకున్నట్లు వుంది. కానీ బోయపాటి యాక్షన్ సీన్లకు ముందుగా చేసే ఎలివేషన్ వ్యవహారాన్ని మాత్రం చేయలేకపోయారు. ఎప్పుడైతే బలమైన ఎలివేషన్ తరువాత యాక్షన్ సీన్ వస్తుందో దాని సత్తా వేరుగా వుంటుంది. అలా కాకుండా కేవలం యాక్షన్ సీన్ మాత్రమే అంటే వేరుగా వుంటుంది.

వాస్తవానికి తీసిన తరువాత ఎడిటింగ్ కన్నా, స్క్రీన్ ప్లే లోనే స్ట్రయిట్ టు పాయింట్ నెరేషన్ ను ఎంచుకుని, రెగ్యులర్ ఫార్మాట్ వ్వవహారాలను కాస్త పక్కన పెట్టి వుంటే, తొలిసగంలో రెండు యాక్షన్ సీక్వెన్స్ లు, మలి సగంలో రెండు యాక్షన్ సీక్వెన్స్ లు జోడించే అవకాశం వుండేది. దానికి తగినట్లు క్లయిమాక్స్ సెట్ అయ్యేది. కానీ హీరో గత సినిమాలు, వాటి వైనాలు గుర్తు పెట్టుకుని, డ్యాన్స్ లకు పాటలకు చోటివ్వడం, లవ్ ట్రాక్ జోడించడం అనేవాటికి అసలు కథతో పాటు సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సి వచ్చింది. అదే సినిమాకు సమస్యగా మారిందని చెప్పాలి.

డైరక్టర్లను బట్టి హీరోల పెర్ ఫార్మెన్స్ కొంత వరకు అటు ఇటుగా వుంటుంది. టోటల్ గా చూసుకుంటే బెల్లంకొండ శ్రీనివాస్ ఫెర్ ఫార్మెన్స్ ఓకే అనిపిస్తుంది. పూజా హెగ్డే మళ్లీ యాక్టింగ్ నేర్చుకోవాలి. మిగిలిన వారు ఓకె.

సినిమాకు పెట్టిన ఖర్చు తెరమీద అన్ని విధాలా కనిపిస్తుంది. ఇటు లెక్కకు మించిన నటులు, పాటల కోసం వేసిన సెట్ లు, అలాగే కొత్త కొత్త లోకేషన్లు, అన్నీ కూడా సినిమాకు పెట్టిన ఖర్చును చూపిస్తాయి. కానీ ఖర్చు తోపాటు, ఈ కథను మోయగలిగిన డైరక్టర్, ఆ డైరక్టర్ అందించే స్క్రీన్ ప్లే సమకూరి వుంటే, ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయి వుండేది. ఇప్పుడు ఓ రెగ్యులర్ కమర్షియల్ సినిమాగా మిగిలింది.

ఫినిషింగ్ టచ్ : వీగిపోయిన సాక్ష్యం

తెలుగు360.కామ్ రేటింగ్ : 2.5/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com