హిట్ 1, హిట్ 2 సినిమాలతో విజయవంతంగా తన దర్శకత్వ ప్రయాణం మొదలెట్టాడు శైలేష్ కొలను. ఇప్పుడు ‘హిట్ 3’తో మరో హిట్ తన ఖాతాలో వేసుకొన్నాడు. అయితే ఈమధ్యలో చేసిన ‘సైంధవ్’ చాలా నిరుత్సాహ పరిచింది. వెంకటేష్‌కి 75వ సినిమా ఇది. ఈ సినిమా పరాజయం శైలేష్ పరుగులకు బ్రేక్ వేసింది. అయితే.. త్వరలోనే వెంకీతో మరో సినిమా చేస్తానని, ఈసారి ఎలాగైనా హిట్ కొడతానని నమ్మకంతో చెబుతున్నాడు శైలేష్.
‘శైంధవ్] ఫ్లాప్ అయిన తరవాత వెంకటేష్ తనకు మానసికంగా అండగా నిలిచారని, తమిద్దరి మధ్య బాండింగ్ పెరిగిందని, తనకో మెంటర్‌గా మారారని, ప్రతీ విషయంలోనూ వెన్నుదన్నుగా నిలిచారని… అలాంటి హీరోకి హిట్ ఇవ్వలేకపోయానన్న బాధ తనలో ఉందని చెప్పుకొచ్చారు శైలేష్. అందుకే వెంకీతో ఓ సినిమా తీసి, పాత బాకీలన్నీ తీర్చుకొంటానంటున్నారాయన. `హిట్ 3` ఎలాగూ హిట్ అయ్యింది కాబట్టి, ఈసారి వెంకటేష్ నుంచి పిలుపు వచ్చినా, ‘సైంధవ్’ కాంబో రిపీట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
శైలేష్ వరుసగా యాక్షన్ థ్రిల్లర్లు, ఇన్వెస్టిగేషన్ డ్రామాలే తీస్తున్నాడు. వాటికీ కాస్త బ్రేక్ ఇవ్వాలనుకొంటున్నాడట. ఆయన రొమాంటిక్ కామెడీ జోనర్లో ఓ కథని సిద్ధం చేయాలనుకొంటున్నారట. వినోదాత్మక చిత్రాలంటే… వెంకీ టక్కున గుర్తొస్తారు. వెంకీ కోసం ఆయన కామెడీ టచ్ ఉన్న కథని రాసుకొంటే – ఈ కాంబోకి తెర తీసినట్టే. అన్నట్టు నాగార్జునతో శైలేష్ ఓ సినిమా చేయబోతున్నారన్న వార్త గట్టిగా చక్కర్లు కొడుతోంది. ఇందులో నిజం లేదని, తాను నాగ్ ని కలవనే లేదని, కాకపోతే నాగ్ అంటే తనకు చాలా ఇష్టమని క్లారిటీ ఇచ్చారు శైలేష్.