కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ దర్యాప్తులో నిజాలు బయటపడ్డాయని సజ్జల రామకృష్ణారెడ్డి అంగీకరించారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనని సజ్జల విమర్శించారు. సీబీఐ సమర్పించిన నివేదికలో నెయ్యిలో జంతువుల కొవ్వు, చేప నూనె వంటి ఆనవాళ్లు ఏమీ లేవని తేల్చిందని అన్నారు. ఒక పద్ధతి ప్రకారం వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురద జల్లడానికి, భక్తుల మనోభావాలను దెబ్బతీయడానికి ఈ లడ్డూ రాజకీయం చేశారని మండిపడ్డారు.
అయితే సీబీఐ సిట్ రిపోర్టులో మొత్తం అసలు నెయ్యి లేదని.. అంతా కెమికల్స్ తో తయారు చేశారని పేర్కొన్న విషయం.. ప్రతి నెయ్యి కేజీల లెక్కల కమిషన్లు తీసుకున్నారని చెప్పిన విషయాన్ని మాత్రం చెప్పడానికి సజ్జల ధైర్యం చేయలేకపోయారు. కానీ సిట్ రిపోర్టుతో నిజాలు బయటపడ్డాయని ఆయన అంగీకరించారు కాబట్టి.. ఆ రిపోర్టును ఆయన ఆమోదించినట్లే అవుతుంది. చంద్రబాబు ఎన్డీడీబీ రిపోర్టు ఆధారంగానే మాట్లాడారు. ఉత్తినే మాట్లాడలేదు. ఇప్పుడు సిట్ ఏం చెప్పిందన్నది ఫైనల్ అయితే.. సజ్జల కూడా కల్తీ జరిగిందని ఒప్పుకున్నట్లే.
కోట్లాది మంది భక్తులు ఆరాధించే వేంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కల్తీ చేసి.. అత్యంత ఘోరంగా ఆ నెయ్యిలో కూడా కమిషన్లు తీసుకుని దేవుడ్ని మోసం చేసిన వ్యవహారంపై వైసీపీ నేతలు తప్పు చేశారని సజ్జల అంగీకిరంచినట్లుగా అయింది. రేపు కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు.. రిపోర్టులోని అసలు అంశాలన్నీ బయటకు వచ్చి.. సీబీఐ తమ రిపోర్టులో ఉన్న వివరాలను బ యటపడితే అప్పుడు మళ్లీ వీరు ఖండిస్తారేమో తెలియదు కానీ ఇప్పటికైతే రిపోర్టును ఆమోదించారు. తమ హయాంలో ఘోరమైన తప్పు జరిగినట్లుగా నిర్దారించారు. ఇక అసలు ఆ కల్తీ నెయ్యి నుంచి కమిషన్లు తీసుకుంది ఎవరో తేల్చాల్సి ఉంది.


