విభజన చట్టంలో ఏపీ రాజధాని అమరావతిగా పెట్టించేందుకు అవసరమైన తీర్మానాన్ని ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో చేసేందుకు సిద్ధమైంది. దీంతో వైసీపీ కుట్ర సిద్ధాంత నిపుణులు సజ్జల రామకృష్ణారెడ్డి తెరపైకి వచ్చారు. అసలుఇప్పుడు తీర్మానం చేయాల్సిన అవసరం ఏమిటని.. అమరావతిని ఎవరు వ్యతిరేకించారని ఆయన వితండవాదం చేస్తున్నారు. జగన్ రెడ్డి ఇటీవలి కాలంలో చేసిన వ్యాఖ్యలే కాదు.. అమరావతిని స్వాగతించని వారి తీరు స్పష్టంగా కళ్ల ముందే ఉంది. అయినా సజ్జల తాము వ్యతిరేకం కాదని వింత వాదనతో తెరపైకి వచ్చారు.
జగన్ రెడ్డి హయాంలో అమరావతిని శ్మశానం అని, గ్రాఫిక్స్ అని అభివర్ణించిన సంగతిని రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదు. మూడు రాజధానుల ముసుగులో అమరావతి అస్తిత్వాన్ని తుడిచిపెట్టేందుకు వైసీపీ ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. రైతుల పాదయాత్రలపై దాడులు, భూములపై ఆంక్షలు, అసెంబ్లీ సాక్షిగా అమరావతికి వ్యతిరేక ప్రసంగాలు.. ఇవన్నీ కళ్లముందే ఉన్నా, ఇప్పుడు తాము అమరావతికి వ్యతిరేకం కాదని సజ్జల చెప్పడం ప్రజల జ్ఞాపకశక్తిని తక్కువ అంచనా వేయడమే.
కీలకమైన ప్రక్రియను కూడా వైసీపీ తప్పుబట్టడం వెనుక అమరావతి అభివృద్ధిని అడ్డుకోవాలనే కుట్ర దాగి ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమరావతికి తాము వ్యతిరేకం కాదని సజ్జల చెబుతున్న మాటల్లో నిజాయితీ ఉంటే, వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి ఈ తీర్మానానికి మద్దతు తెలపాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఐదు కోట్ల ఆంధ్రుల కలల రాజధాని కోసం చేస్తున్న ఈ పోరాటంలో వైసీపీ తన నిబద్ధతను చాటుకోవాలని, లేదంటే అమరావతి ద్రోహి గా చరిత్రలో నిలిచిపోతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.


