పరిటాల హత్య కేసు నిందితుడిపై జగన్‌ స్పెషల్‌ కన్సర్న్‌!

Jagan Mohan Reddy

అసలే ఆ వ్యవహారం ఒక రాచపుండు.. దాన్ని మళ్లీ కెలుక్కోవడం ఎందుకు? ఎంత కెలుక్కుంటే అంతగా నష్టం జరిగేది మనకే కదా? అనే స్పృహ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డికి ఉన్నట్లుగా కనిపించడం లేదు. తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్‌ నాయకుడు పరిటాల రవి ని హత్య చేసిన కేసులో అసలు సూత్రధారి వైఎస్‌ జగన్‌ అంటూ అనేక ఆరోపణలు రాజకీయంగా తరచూ వినిపిస్తూ ఉండే సంగతి అందరికీ తెలిసిందే. టెక్నికల్‌గా ఈ కేసులో జగన్‌ నిందితుడుగా లేడు తప్ప.. ఆరోపణలు మాత్రం నిత్యం ఆయన చుట్టూతానే తిరుగుతూ ఉంటాయి. ఇంత జరుగుతూ ఉన్నా సరే.. పరిటాల రవి హత్యకేసులో నిందితుడు అయిన ఒక వ్యక్తి గురించి జగన్‌ ఆధ్వర్యంలోని సాక్షి దినపత్రిక ఇప్పుడు ప్రత్యేకమైన శ్రద్ధను కనపరుస్తున్నట్లుగా కనిపిస్తోంది.

ఇంతకూ వివరాల్లోకి వెళితే..

కడపజిల్లాలో ఒక రేషన్‌ షాపు డీలరు గురించి ఆ జిల్లాకే చెందిన సీనియర్‌ నాయకుడు మల్లెల లింగారెడ్డి, జిల్లా పౌరసరఫరాల అధికారిని బెదిరించినట్లుగా, దూషించినట్లుగా సాక్షి దినపత్రికలో ఓ కథనం వచ్చింది. దీనికి సంబంధించి సదరు లింగారెడ్డి అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. డీఎస్‌వోను బెదిరించారని అనడానికి ఆయనేమీ సాధారణ తెదేపా కార్యకర్త కూడా కాదు. ఏపీ పౌరసరఫరాల సంస్థకు ఆయనే చైర్మన్‌. తన సొంత జిల్లాలోనే రేషన్‌ డీలరుగా హత్యకేసులో నిందితుడు (అది పరిటాల రవి హత్యా? మరొకటా? అనేది వేరే సంగతి) కొనసాగుతూ ఉండడాన్ని ఆయన ఎలా సహించగలరు? అందుకే తను రాష్ట్ర ఛైర్మన్‌గా ఉన్న శాఖకే చెందిన జిల్లా అధికారిని ఆయన ప్రశ్నించారు. పరిటాల రవి హత్యకేసులో 8వ నిందితుడుగా ఉన్న వ్యక్తిని రేషన్‌ డీలరుగా ఎలా కొనసాగిస్తారని అడిగినట్లుగా తెలుస్తోంది.

అయితే సదరు డీలరుకు దన్నుగా సాక్షి ఈ గొడవను తన భుజస్కంధాల మీదికి తీసుకున్నట్లు కనిపిస్తోంది. లింగారెడ్డి తాను డీఎస్‌వోను దూషించినట్లు నిరూపించకపోతే సాక్షి మీద కేసు పెడతానంటే.. ఏకంగా సాక్షిని భూస్థాపితం చేసేస్తానని బెదిరించారని మరో కథనాన్ని కూడా అందించింది. ఈ వ్యవహారం మొత్తం కలిసి.. ”ఒక తెలుగుదేశం నాయకుడి వైఖరితో జగన్‌కు చెందిన సాక్షి దినపత్రిక తలపడడం” లాగా ప్రజల దృష్టికి వెళితే పరవాలేదు. కానీ.. అదే సమయంలో.. ”పరిటాల రవి హత్యకేసులో నిందితుడికి దన్నుగా నిలవడానికి సాక్షి తపన పడిపోతున్నదనే” కలర్‌ వచ్చేలా.. ప్రజల దృష్టిలో పడితే మాత్రం.. ఆ హత్య వెనుక జగన్‌ ప్రమేయం ఉన్నదనే పుకార్లకు కూడా సాక్షి పనిగట్టుకుని బలం చేకూర్చినట్లు అవుతోందా?

ఇంతకూ సాక్షి దినపత్రిక తమ అధినేత వైఎస్‌ జగన్మోహనరెడ్డికి మేలు చేస్తున్నట్లా? చేటు చేస్తున్నట్లా?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com