పవన్ టిడిపి పొత్తు కథనం – జగన్, సాక్షి ల మరో సెల్ఫ్ గోల్?

జనసేన టిడిపిల మధ్య రహస్య పొత్తు అంటూ మొన్న సాక్షిలో వచ్చిన కథనం మీద సోషల్ మీడియాలో వచ్చిన వ్యతిరేకత ఈ మధ్యకాలంలో మరే ఇతర కథనం మీద రాలేదు. ఈ నేపథ్యంలో సాక్షి ప్రచురించిన ఈ కథనం, వైఎస్ఆర్సిపి పాలిట మరొక సెల్ఫ్ గోల్ గా మారిందా అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

ఇటీవల సాక్షి ఒక కథనం ప్రచురించింది. ఆ కథనం ప్రకారం, రానున్న అసెంబ్లీ ఎన్నికలలో పవన్ కళ్యాణ్, టిడిపితో పొత్తు పెట్టుకోబోతున్నాడు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ కి 25 ఎమ్మెల్యే సీట్లు, 3 ఎంపీ సీట్లు చంద్రబాబు కేటాయించనున్నారు. ఇది ఆ కథనం. అయితే ఈ కథనం చదివిన పాఠకుల్లో చాలా మంది కి ఇది నమ్మగలిగేలా అనిపించలేదు. పైగా కేవలం దురుద్దేశంతోనే ఈ కథనం ప్రచురించారంటూ చాలామంది జనసేన అభిమానులు సాక్షి పత్రికను బహిరంగంగా తగలబెట్టి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఈ కథనంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇటు చంద్రబాబేమో తనను టిఆర్ఎస్ తో కుమ్మక్కయ్యారని అంటారని, అటు జగన్ ఏమో తాను టిడిపితో కుమ్మక్కయ్యారని అసత్య కథనాలను ప్రసారం చేస్తారని, తన మీద వ్యతిరేక కథనాలు ప్రచారంలోకి తీసుకు రావడంలో టిడిపి వైఎస్ఆర్సిపి రెండు చేతులు కలిపాయని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. వీళ్లిద్దరి లాగా తనకు టీవీ చానెళ్లు, పత్రికలు లేకపోవడం వల్ల వీరు ఇలా దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ వాపోయారు పవన్ కళ్యాణ్.

పవన్ రాయలసీమ పర్యటన నేపథ్యంలోనేనా ఈ కథనం?

సరిగ్గా పవన్ కళ్యాణ్ రాయలసీమ పర్యటన ప్రారంభం కావడానికి రెండు రోజుల ముందుగా ఈ కథనం వెలువడింది. పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా పర్యటించింది ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, మరియు అనంతపురం జిల్లా మాత్రమే. ఈ మూడు చోట్ల కూడా జగన్ కి కేవలం నామమాత్రపు సీట్లు మాత్రమే వచ్చాయి. 2014 ఎన్నికలలో, శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు ఉన్న ఏడు జిల్లాల్లో ని 101 సీట్లలో జగన్ కి వచ్చింది కేవలం 24 సీట్లు మాత్రమే. అలాగే రాయలసీమలో ఉన్న అనంతపురం లోని 14 సీట్లలో కూడా కేవలం 2 స్థానాలు మాత్రమే దక్కాయి. అంటే ఈ 115 సీట్లలో, 2014 ఫలితాల ప్రకారం జగన్ బలం కేవలం 26 సీట్లు మాత్రమే. అయితే ఈ 8 జిల్లాలను మినహాయించి ఉన్న మిగిలిన ఐదు జిల్లాల్లో, 41 సీట్లలో వైఎస్ఆర్సిపి గెలిచింది. ఇంతకాలం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించినప్పటికీ, ఇప్పుడు జగన్ బలం బాగా ఉన్న జిల్లాల్లో పర్యటన కి పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యాడు. బహుశా ఈ కారణంగానే సాక్షి లో పవన్ కళ్యాణ్ టిడిపితో పొత్తు పెట్టుకోబోతున్నాడంటూ కథనాలు వెలువడి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే సాక్షి ప్రచురించిన ఈ కధనం, జనాలను నమ్మించ లేకపోవడంతో ఇది సాక్షి ఖాతాలోని మరొక సెల్ఫ్ గోల్ గా మిగిలిపోయింది.

జనసేన తో పొత్తుకు టిఆర్ఎస్ ద్వారా ప్రయత్నించిందన్న పవన్ వ్యాఖ్యలపై వైకాపా స్పందన ఏది?

ఆమధ్య పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ సీపీ నేతలు టిఆర్ఎస్ పార్టీ ద్వారా తమ మీద ఒత్తిడి తెస్తున్నారని, వైకాపా తో పొత్తు పెట్టుకోవాలని జనసేనని ప్రాధేయ పడుతున్నారు అని బహిరంగంగా వ్యాఖ్యానించినప్పటికీ, జగన్ కానీ, వైఎస్ఆర్ సీపీ నేతలు కానీ, టిఆర్ఎస్ నేతలు కాని దాన్ని గట్టిగా ఖండించలేకపోయారు. కనీసం సాక్షి పత్రిక కూడా పవన్ వ్యాఖ్యలను గట్టిగా ఖండించకపోవడంతో పవన్ వ్యాఖ్యలు నిజమేనన్న అభిప్రాయం ప్రజల్లో కలిగింది. పవన్ తో పొత్తు కోసం వై ఎస్ ఆర్ సి పి ప్రయత్నించి భంగ పడడంతోనే సాక్షిలో ఇలాంటి కథనాలు ప్రచురిస్తున్నారు అని జనసేన అభిమానులు వాపోతున్నారు.

పవన్ టిడిపి పొత్తు కథనం వైఎస్ఆర్సిపి అభిమానులను నిరాశపరిచిందా?

పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేయడం వల్ల 2014లో టీడీపీ జనసేన బిజెపి కూటమికి పడ్డ ఓట్లు చీలిపోయి తమకు లాభం చేకూరుతుందని వైయస్ జగన్ ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. అలాగే రెండు విపక్షాలు విడిగా పోటీ చేయడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుందని తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ రెండింటిలో ఏది నిజమో అన్నది ఎన్నికలయ్యాకే తెలుస్తుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ మూడు పార్టీల్లో ఏ రెండు పార్టీలు కలిసినా అది మూడవ పార్టీ కి శరాఘాతమే అవుతుంది. ఈ లెక్కన జనసేన టిడిపితో నిజంగా కలిసి నట్లయితే కచ్చితంగా ఆ మేరకు వైకాపాకి నష్టం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. సాక్షి ప్రచురించిన ఈ కథనం, ఆ కారణంగానే, వైఎస్ఆర్సిపి అభిమానులకు కూడా నిరుత్సాహాన్ని మిగిల్చింది. ఇటువంటి కథనాలు ప్రచురించడం వల్ల, పార్టీకి నష్టమే తప్ప ఎటువంటి ప్రయోజనం లేదని వైఎస్ఆర్సిపి అభిమానులు అంటున్నారు ‌ . ఆ రకంగా చూసినా, ఈ కథనం జగన్ – సాక్షి ల మరొక సెల్ఫ్ గోల్ లా మిగిలిపోతుంది.

మొత్తం మీద:

ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు చాలా ధీమాగా కనిపించడం, తీరా ఎన్నికల సమయానికి సెల్ఫ్ గోల్ మీద సెల్ఫ్ గోల్ వేసుకుంటూ ఫలితాన్ని తారుమారు చేసుకోవడం జగన్ కి పరిపాటిగా మారింది. 2014 ఎన్నికల్లో కానీ, నంద్యాల ఉప ఎన్నికల్లో కానీ ఇదే జరిగింది. ఇప్పుడు 2019 ఎన్నికల సమయంలో కూడా జగన్ తన సెల్ఫ్ గోల్ ఒరవడిని కొనసాగిస్తున్నట్లు గా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com