డిసెంబరులో రాబోతున్న మరో సినిమా… ‘ఛాంపియన్’. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్నాడు. టీజర్ ప్రామిసింగ్ గా వుంది. మిక్కీ జే.మేయర్ నుంచి వస్తున్న బాణీలు కూడా ఆకట్టుకొంటున్నాయి. చాలా కాలం తరవాత మిక్కీ నుంచి వస్తున్న బాణీ ఇది. తన మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. ఈరోజు `సల్లగుండాలే` అనే పెళ్లి పాట విడుదల చేశారు. చంద్రబోస్ సాహిత్యం అందించారు. రితీష్, మనీషా ఆలపించారు. కల్యాణ చక్రవర్తి సుదీర్ఘ విరామం తరవాత తెరపై కనిపిస్తున్న సినిమా ఇది. ఈ చిత్రంలో ఆయన ఓ కీలకమైన పాత్రధారి. ఈ పాటలో ఆయన కూడా మెరిశారు. మిక్కీ ట్యూన్ ఎప్పటిలానే లైవ్లీగా వుంది. చంద్రబోస్ సాహిత్యంలో పదును మరోసారి కనిపించింది. ఊరంతా కలిసి ఓ అమ్మాయికి పెళ్లి చేస్తున్న దృశ్యమిది. దానికి తగ్గట్టుగానే పాటలో ఎమోషన్ రాబట్టారు. ముఖ్యంగా చరణాల్లో చంద్రబోస్ పెన్ పవర్ తెలిసొచ్చింది.
”ఎల్లిరమ్మని ఎల్లగొట్టొద్దే.”. – అని పెళ్లి కూతురు కన్నీళ్లు ఎట్టుకొంటే..
”ఎదురు సూస్తుంటాయి ఏప సెట్టు కొమ్మలే..
బెంగటిల్లిపోతాయి.. లేగదూడలే
సేయి సాస్తుంటాయి.. బురుజు గోడ నీడలే
కండ్లు నులుపుకొంటాయి బండ్ల బాటలే” – అని ఊరంతా తల్లడిల్లిపోతుంది. ఈ ఎమోషన్ని చంద్రబోస్ తన కలంలో బాగా పండించారు. పెళ్లి పాటలో ఉండాల్సిన జోష్ ఎక్కడా తగ్గకుండా చూసుకొంటూనే, ఎమోషన్ని రాబట్టడం ఈ పాటలోని విశిష్టత. ప్రదీప్ అద్వైతం ఈ చిత్రానికి దర్శకుడు. స్వప్నదత్ నిర్మించారు.
