చైతూ సినిమా హిట్ట‌యితే… నా సినిమా హిట్ట‌యిన‌ట్టే! – స‌మంత‌తో ఇంట‌ర్వ్యూ

సెప్టెంబ‌రు 13 చాలా ముఖ్య‌మైన రోజు.
ఆ రోజు.. అటు చైతూ, ఇటు స‌మంత సినిమాలు రెండూ విడుద‌ల అవుతున్నాయి.
భార్యా భ‌ర్త‌ల మ‌ధ్య పోరు చూసే అవ‌కాశం టాలీవుడ్‌కి ద‌క్కుతోంది.
మ‌రి ఈ బాక్సాఫీసు వార్‌పై స‌మంత కామెంట్ ఏమిటి? త‌న మ‌న‌సులోని మాటేంటి? 13న త‌ను ఎవ‌రి సినిమా చూడాల‌నుకుంటోంది?? ఈ విష‌యాల్ని తెలుగు 360 ఆరా తీసింది. ఆ చిట్ చాట్ మీ కోసం..

హాయ్ స‌మంత‌..

హాయ్‌

చైతూ సినిమాతో స‌మంత పోటీ ప‌డ‌డం విచిత్రంగా ఉందే..

నాక్కూడా అలానే ఉంది.. నిజంగానే మా ఇద్ద‌రి సినిమాలూ ఒకేరోజు వ‌స్తాయ‌ని అస్స‌లు అనుకోలేదు. నా సినిమా కంటే చై సినిమానే ముందు రావాల్సింది. కానీ కుద‌ర్లేదు. క‌నీసం మా ఇద్ద‌రి సినిమాల మ‌ధ్య వారం రోజులైనా విరామం ఉంటుంద‌నుకున్నా. కానీ అనుకోకుండా ఒకే రోజు వ‌స్తున్నాం. యూ ట‌ర్న్ తెలుగు త‌మిళంలో ఒకే రోజు వ‌స్తోంది. కాబ‌ట్టి ఆ సినిమా రిలీజ్ డేట్ మార్చ‌డానికి వీలు కాలేదు.

సొంత ఇంట్లోనే పోటీ క‌దా?

పోటీ అని కాదు. రెండూ వేర్వేరు జోన‌ర్లు క‌దా? చై సినిమా కామెడీ గా, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఉంటుంది. నాది థ్రిల్ల‌ర్‌. కాబ‌ట్టి రెండు సినిమాలూ చూస్తారు.

ఆ రోజు మీ మొద‌టి ఎంపిక ఏది? మీ అభిమానుల్ని ఏ సినిమా ముందు చూడ‌మంటారు?

ఓ భార్య‌గా చై సినిమానే చూడాల‌నుకుంటా. ఎందుకంటే త‌న ఆనంద‌మే నా ఆనందం. తానకి ఏ విష‌యాలు ఆనందాన్ని క‌లిగిస్తాయో, భార్య‌గా నాకూ అలాంటి విష‌యాలే ఆనందాన్ని క‌లిగిస్తాయి.

యూట‌ర్న్ విష‌యంలో మీరు ప్ర‌త్యేక‌మైన శ్ర‌ద్ద తీసుకున్నారు. కార‌ణ‌మేంటి?

ఇది నా సినిమా. నేను తీసుకోక‌పోతే ఎవ‌రు తీసుకుంటారు? ఇన్నేళ్ల‌కు ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్నా క‌దా. దాని ఫ‌లితం నాకు చాలా ముఖ్యం. అందుకే ఇంత జాగ్ర‌త్త‌గా ఉన్నా.

మేకింగ్‌, స్క్రిప్ట్ విష‌యంలోనూ మీరు జోక్యం చేసుకున్నార‌ని తెలుస్తోంది?

స్క్రిప్టు ద‌శ‌లో నాకు వంద అనుమానాలు ఉంటాయి. అవ‌న్నీ ద‌ర్శ‌కుడ్ని అడిగి నివృత్తి చేసుకోవ‌డం నా బాధ్య‌త‌. అదేం.. ఇన్‌వాల్వ్‌మెంట్ కాదు. ఒక్క‌సారి స్క్రిప్ట్ లాక్ అయ్యాక‌.. ఎలాంటి ప్ర‌శ్న‌లూ ఉండ‌వు. ద‌ర్శ‌కుడు చెప్పింది చేసుకుని వెళ్ల‌డ‌మే మిగిలింది.

న‌న్ను చూసి జ‌నాలు థియేట‌ర్ల‌కు వ‌స్తారు, నేనో క్రౌడ్‌పుల్ల‌ర్‌ని అనే న‌మ్మ‌కం ఇప్పుడు క‌లిగిందా?

ఆ సంగ‌తి ఈనెల 13న తేలుతుంది. నన్ను చూసి జ‌నాలు వ‌స్తారా, రాదా? అనేది వ‌చ్చే వ‌సూళ్ల‌ని బ‌ట్టి ఉంటుంది. కాక‌పోతే.. ఓ క‌థ‌ని నా భుజాల‌పై కూడా వేసుకుని న‌డిపించ‌గ‌ల‌ను అనే న‌మ్మ‌క‌మైతే క‌లిగింది. అన్నింటికంటే మించి హీరోలు ఎంత క‌ష్ట‌ప‌డ‌తారో అర్థ‌మైంది. ఓ హీరోయిన్‌గా నా సినిమా ఫ్లాప్ అయితే పెద్దగా న‌ష్ట‌పోను. నా సినిమాలు నాకుంటాయి. హీరోల‌కు అలా కాదు. ఓ సినిమా ఫ్లాప్ అయితే ఆ ప్ర‌భావం చాలామందిపై ప‌డుతుంది. వాళ్ల బ‌డ్జెట్లు ఎక్కువ‌. వాటిని తొలి మూడు రోజుల్లోనే వెన‌క్కు రాబ‌ట్టుకోవాలి. లేదంటే చాలా న‌ష్టాల్ని భ‌రించాలి. అందుకే ప్ర‌తీ సినిమా ఓ ఛాలెంజింగ్‌గా ఉంటుంది. హీరోల పారితోషికం మా కంటే ఎందుకు ఎక్కువ‌? అనే విష‌యాన్ని చాలా సార్లు ఆలోచించాను. ఇప్పుడు ఆ ప్ర‌శ్న‌కు స‌మాధానం దొరికిన‌ట్టైంది.

పెళ్ల‌య్యాక వ‌రుస విజ‌యాలు సాధించారు.. కెరీర్ మంచి స్పీడుగానే ఉంది?

అది నా అదృష్టం. వ‌రుస విజ‌యాలు ఒక ఎత్త‌యితే.. అన్నీ మంచి పాత్ర‌లు ప‌డ్డాయి. రంగ‌స్థ‌లం సినిమానైతే నేనెప్ప‌టికీ మ‌ర్చిపోను. యూ ట‌ర్న్ కూడా అలాంటి పాత్రే.

యూ ట‌ర్న్ క‌న్న‌డ‌లో చూసేసిన‌వాళ్ల‌కు ఈ సినిమా కొత్త‌గా ఎలా క‌నిపిస్తుంది?

మ‌రాఠీలో సైర‌ట్ బాగా ఆడింది. బాలీవుడ్‌లోనూ మంచి వ‌సూళ్లు ద‌క్కుతున్నాయి క‌దా? రీమేక్ సినిమా అనేస‌రికి క‌థ ముందే తెలిసిపోతుంది. కానీ దాన్ని ఈ భాష‌లో ఎంత బాగా డీల్ చేశారో చూడ‌డం కూడా అవ‌స‌ర‌మే. క‌న్న‌డ‌లో యూ ట‌ర్న్ చూసిన‌వాళ్ల‌కు సైతం తెలుగులో కొత్త‌గా అనిపిస్తుంది. చివ‌రి 30 నిమిషాల్లో చాలా మార్పులు చేర్పులూ చేశాం.

రంగ‌స్థ‌లంలో స‌మంత చాలా బాగా చేసింది. ప్ర‌తీసారీ స‌మంత నుంచి అలాంటి న‌ట‌నే కోరుకుంటారు క‌దా?

ఎవ‌రో కాదు.. నాకు నేను కోరుకుంటాను. ఈ సినిమాలో ది బెస్ట్ ఇస్తే స‌రిపోదు. ప్ర‌తీ సినిమాకీ బెస్ట్ ఇస్తూనే ఉండాలి. ఇక్క‌డ నేను చేసిన సినిమాలు, నేను పోషించిన పాత్ర‌లే నాకు పోటీ.

మిగిలిన క‌థానాయిక‌ల నుంచి పోటీ లేదంటారు?

ప‌రిశ్ర‌మ‌లో మ‌హా అయితే అర‌డ‌జ‌ను క‌థానాయిక‌ల‌కు రిటీటెడ్‌గా అవ‌కాశాలు వ‌స్తున్నాయేమో. అంటే ఉన్నది ఆరుగురం. మాలో మాకు పోటీ ఏమిటి? ఓ క‌థానాయిక‌కు మంచి సినిమా ద‌క్కితే.. అలాంటి పాత్ర‌లు మ‌ళ్లీ మ‌ళ్లీ రాసే అవ‌కాశం వ‌స్తుంది. అది మాలాంటి క‌థానాయిక‌లంద‌రికీ చాలా మంచిది. ప‌త్రిక‌ల్లో, వెబ్ సైట్ల‌లో మాత్రం వాళ్లిద్ద‌రికి పోటీ.. వీళ్లిద్ద‌రికీ పోటీ అని రాస్తుంటారు. అవేం నిజాలు కావు.

బాలీవుడ్ వెళ్లే అవ‌కాశంఉందా?

ఇప్ప‌టి వ‌ర‌కూ వెళ్ల‌లేదు క‌దా? ఇక ముందూ వెళ్ల‌ను. తెలుగు చిత్ర‌సీమ నాకు ఇల్లు లాంటిది. త‌మిళంలో సినిమాలు చేసినా.. మ‌న‌సంతా ఇక్క‌డే ఉంటుంది.

కొత్త‌గా ఒప్పుకున్న సినిమాలేంటి?

చైతో ఓ సినిమా చేస్తున్నా. దాంతో పాటు మ‌రో సినిమా ఒప్పుకున్నా. ఆ విష‌యాలు త్వ‌ర‌లో చెబుతా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com