రష్మిక ప్రధాన పాత్ర పోషించిన సినిమా ‘గాళ్ ఫ్రెండ్’. రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. నవంబరు 7న విడుదల అవుతోంది. ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రకోసం సందీప్ రెడ్డి వంగాని సంప్రదించింది టీమ్. అయితే సందీప్ సున్నితంగా తిరస్కరించారు. సరదాగా కెమెరాముందుకు రావాలని కొంతమంది దర్శకులకు ఉంటుంది. సందీప్ కూడా ఈ పాత్రని క్యారీ చేయగలరు. కానీ.. ఇది అతిథి పాత్ర లాంటిది కాదట. కాస్త లెంగ్తీ ఉన్న పాత్రే. ”కాసేపంటే పర్వాలేదు. నాలుగైదు సీన్లంటే.. కష్టమే” అని సందీప్ రెడ్డి చెప్పారని, అందుకే ఆ ఆప్షన్ ని పక్కన పెట్టామని దర్శకుడు రాహుల్ రవీంద్రన్ అంటున్నారు. ట్విస్ట్ ఏమిటంటే… చివరికి ఆ పాత్ర స్వయంగా రాహుల్ పోషించాల్సి వచ్చింది.
”సినిమాలో చాలా కీలకమైన పాత్ర అది. సందీప్ అయితే బాగుంటుందని అనిపించింది. ఆయన ‘నో’ చెప్పారు. ఆ తరవాత వెన్నెల కిషోర్ ని అడిగాను. నిజానికి వెన్నెల కిషోర్ చాలా మంచి పెర్ఫార్మర్. తనలోని ఆ యాంగిల్ బయటకు తీసుకొద్దామనుకొన్నా. కానీ తాను కూడా ‘నో’ చెప్పాడు. ‘నన్ను చూడగానే నవ్వేస్తారు. నేను చెప్పే సీరియస్ కంటెంట్ ప్రేక్షకులకు ఎక్కదు. ఈ పాత్ర ఫెయిల్ అయితే.. నువ్వు చెప్పాలనుకొన్న విషయం పక్కదోవ పడుతుంది’ అని హెచ్చరించాడు. చివరికి నేనే ఆ క్యారెక్టర్ చేశా. నటన – దర్శకత్వం ఇలా రెండూ చేయడం నా వల్ల కాదు. నేను మల్టీటాస్కర్ కాదు. నేను ఇది వరకు దర్శకత్వం వహించిన రెండు సినిమాల్లోనూ నేను నటించలేదు. ఈసారి తప్పలేదు” అని చెప్పుకొచ్చాడు రాహుల్.
‘గాళ్ ఫ్రెండ్’ ఓ అమ్మాయి కథ. ఇందులో చాలా పార్శ్వాలు ఉండబోతున్నాయట. మరీ ముఖ్యంగా కొన్ని డార్క్ ఎమోషన్స్ ని ఈ సినిమాలో చూపించబోతున్నారని తెలుస్తోంది. మరి ఆ డార్క్ ఎమోషన్స్ ఏమిటో, రష్మిక ఈ పాత్రలో ఎలా కనిపించబోతోందో తెలియాలంటే నవంబరు 7 వరకూ ఆగాలి.
