2026 సంక్రాంతి హడావుడి అంతా బాక్సాఫీసు దగ్గరే కనిపించబోతోంది. ఏకంగా 7 సినిమాలు ఈ సీజన్లో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాయి. పండగ ముందూ.. ఆ తరవాత కూడా కొత్త సినిమాల ఊపు, ఉత్సాహం కనిపించడం ఖాయం. అంత వరకూ బాగానే ఉంది. కానీ… పండగ సినిమాల టికెట్ రేట్ల విషయంలోనే అయోమయం, గందరగోళం. పెద్ద సినిమాలు వస్తున్నప్పుడు కచ్చితంగా టికెట్ రేట్ల పెంపు ఉంటుంది. సంక్రాంతి సీజన్ కాబట్టి.. క్యాష్ చేసుకోవాలన్న ఉద్దేశం నిర్మాతలకు ఉండడంలో తప్పు లేదు. అన్ని సినిమాలకూ టికెట్ రేట్ల పెంపు ఉండకపోవొచ్చు. కనీసం ‘రాజాసాబ్’, ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాల వరకూ నిర్మాతలు హైక్ కోసం ప్రయత్నించవచ్చు. ఏపీలో టికెట్ రేట్ల పెంపుకు ఎలాంటి అభ్యంతరాలూ ఉండవు. ఎటొచ్చీ తెలంగాణ విషయంలోనే అయోమయం నెలకొంది. ఓజీ, అఖండ 2 సినిమాల ప్రీమియర్లకు, టికెట్ రేట్ల పెంపుదలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కాకపోతే భవిష్యత్తులో టికెట్ రేట్లు పెంచే సమస్యే లేదంటూ ఒకరిద్దరు మంత్రులు వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. ఇది వరకు కూడా టికెట్ రేట్లు పెంచే విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుముఖంగా ఉండేది కాదు. రేవంత్ రెడ్డి ఈ విషయమై అసెంబ్లీలోనే ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ తరవాత నిర్మాతలంతా కలిసి రేవంత్ రెడ్డిని కలుసుకొని, తమ సాధక బాధకాలు చెప్పుకొన్నారు. రాబడిలో సినీ కార్మికులు 20 శాతం తిరిగి ఇస్తామన్న షరతుతో టికెట్ రేట్ల పెంపుదలకు ప్రభుత్వం ఒప్పుకొంది. గత కొన్ని సినిమాలకు ఇదే నియమం వర్తించింది. అయితే ఇప్పుడు మంత్రుల స్టేట్ మెంట్లతో అయోమయ పరిస్థితి నెలకొంది.
రేవంత్ రెడ్డి డైరెక్షన్లోనే మంత్రులు ఇలా మాట్లాడుతున్నారా, లేదంటే సీ.ఎంకి తెలియకుండానే ఇదంతా జరుగుతోందా? అనే చర్చ కూడా ఓ వైపు నడుస్తోంది. రేవంత్ రెడ్డికీ, సినీ పరిశ్రమకూ ఇది వరకు కమ్యునికేషన్ గ్యాప్ ఉండేది. దాంతో టాలీవుడ్ పై సీఎం కాస్త గరమ్ గరమ్ గా ఉండేవారు. టికెట్ రేట్లు పెంచడానికి సీఎం అందుకే ఒప్పుకోలేదని అప్పట్లో టాక్ వినిపించింది. అయితే అదంతా గడిచిపోయిన ఎపిసోడ్. సీఎంతో రెండు మూడు దఫాలుగా టాలీవుడ్ పెద్దలు కలుస్తూనే ఉన్నారు. సీఎం కూడా పాత విషయాల్ని మర్చిపోయారు. కాబట్టి… టికెట్ రేట్ల బెంగ తీరిపోయిందనుకొన్నారు. ఇప్పుడు ఈ కొత్త ట్విస్టుని నిర్మాతలు ఊహించలేకపోయారు.
‘రాజాసాబ్’ లాంటి సినిమాల్ని పాత రేట్లకు విడుదల చేయడం కష్టం. ఎందుకంటే భారీ బడ్జెట్ సినిమా ఇది. టికెట్ రేట్ల పెంపుతో… పెట్టుబడి తిరిగి రాబట్టుకోవాలని నిర్మాత భావించడంలో ఎలాంటి తప్పూ లేదు. ఇప్పుడు టికెట్ రేట్లు పెంచేది లేదంటే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. సంక్రాంతి సమయానికి పరిస్థితులు చక్కబడతాయని, సీఎం ఈ విషయంలో చొరవ తీసుకొంటారని నిర్మాతలు గట్టిగా నమ్మకాలు పెట్టుకొన్నారు. త్వరలోనే మరోసారి నిర్మాతలంతా ఏకమై ముఖ్యమంత్రిని కలుసుకొనే అవకాశం ఉంది. ప్రతీసారీ టికెట్ రేట్లపై బెంగ పడాల్సిన పని లేకుండా ఓ శాశ్వతమైన జీవో తెచ్చుకోవాలన్నది నిర్మాతల ప్రయత్నం. అది ఈసారైనా నెరవేరుతుందేమో చూడాలి.
