తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్టకేలకు పోలింగ్ వరకూ వచ్చాయి. తొలి విడతలో 3800కుపైగా పంచాయతీల్లో పోలింగ్, కౌంటింగ్ గురువారం జరగనుంది. ఇందులో మేజర్ పంచాయతీలు ఉన్నాయి. చిన్న గ్రామాలు ఉన్నాయి. అయితే గ్రామ రాజకీయాల్లో ఉండే సహజమైన ఆధిపత్యపోరు వల్ల పోటీ మాత్రం భీకరంగా సాగుతోంది. ఎవరికి వారు తమ శక్తికి మించి ఖర్చు పెట్టి గెలవడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే గ్రామాల్లో ఎన్నికల సందడి ఎక్కువగా కనిపిస్తోంది.
ఏకగ్రీవాలు కోసం లక్షలు వెచ్చించిన అభ్యర్థులు
పోలింగ్ 3800కు పైగా గ్రామాల్లో జరుగుతుంది. అయితే దాదాపుగా 890 గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిసాయి.ఈ గ్రామాలలో డబ్బు మాట లేకుండా మీరే సర్పంచ్ గా ఉండాలని నాయకుల్ని ఎంచుకున్నది అతి తక్కువ. అత్యధిక గ్రామాల్లో వేలం పాట ద్వారా సర్పంచ్ పదవుల్ని దక్కించుకున్నారు. కొన్ని పెద్ద పంచాయతీల్లో అయితే కోటి వరకూ పాడుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏదైనా ఆ డబ్బును గ్రామానికే ఖర్చు చేస్తారు. ఇంత డబ్బు పెట్టి సర్పంచ్ గా ఎన్నికయ్యి సంపాదించుకునేది ఏమీ ఉండదు. గ్రామంలో పలుకుబడి ఇస్తుందన్న కారణం తప్ప.
పోటీ తప్పని గ్రామాల్లోని అదే ఖర్చు
ఇక పోటీ తప్పదు అనుకున్న గ్రామాల్లోనూ అదే స్థాయిలో ఖర్చు కనిపిస్తోంది. రెండు వేలు జనాభా దాటిన గ్రామాల్లో వార్డు సభ్యులు, సర్పంచ్ అభ్యర్థి కలిసి కనీసం కోటి రూపాయలు ఖర్చు చేస్తున్నారని అంటున్నారు. ప్రచారానికి.. ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్లిన వారిని తీసుకొచ్చి,తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు , వారికి డబ్బులు ఇలా మొత్తంగా అన్ని రకాలుగా ఖర్చు పెట్టుకుంటున్నారు. కొన్ని ప్రతిష్టాత్మక గ్రామాల్లో పార్టీ ముఖ్యనేతలు గ్రామ స్థాయి నేతలకు ఆర్థిక సాయం చేస్తున్నారు. గెలిచినా గెలవకపోయినా ఇప్పుడు పోటీకి సాయం చేస్తేనే తర్వాత వారు అండగా ఉంటారు.అందుకే.. కాదనుకుండా సాయం చేస్తున్నారు. ఆ దన్నుతో గ్రామ నేతలు బలమైన పోటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
సహజంగా అధికార పార్టీ హవా
గ్రామాల్లో పనులు జరగాలంటే.. అధికార పార్టీ నేతను సర్పంచ్ గా ఎన్నుకుంటే మంచిదని సహజంగానే అందరూ అనుకుంటారు. అదే కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ గా మారనుంది. గ్రామాల్లో పథకాలు అందాలంటే.. కాంగ్రెస్ నేతను ఎన్నుకుంటే.. తర్వాత ఆయనను అడగడానికో.. నిలదీయడానికో అందుబాటులో ఉంటారు. అందుకే చాలా చోట్ల ఏకగ్రీవాలు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారివే అయ్యాయి. ఇప్పుడు బ్యాలెట్ పోరులోనూ వారే ముందంజలో ఉండే అవకాశం ఉంది. పంచాయతీ ఫలితాలు.. రాష్ట్ర స్థాయిలో ప్రభావం చూపవు. అవి ఆయా గ్రామ రాజకీయాలు మాత్రమే. గతంలో బీఆర్ఎస్ 90 శాతానికిపైగా పంచాయతీలు గెలిచినా.. పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయింది.
