సెటైర్: ఏపీ ఉద్యోగి విలాపం

రాంబాబు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగి. తనపనేదో తాను చేసుకుపోయే రకం. పెళ్లైన తర్వాత హైదరాబాద్ హిమాయత్ నగర్ లో అద్దెఇంట్లో ఉంటున్నాడు. ఆరోజు, సోమవారం …ఉదయాన్నే ఆఫీసుకు బయలుదేరడానికి రెడీ అవుతున్నాడు. రాంబాబు భార్య శిరీష కూడా భర్తని టైమ్ కి పంపడానికి తనవంతుగా హడావుడి పడుతూనే ఉంది. సరిగా అదే సమయంలో రాంబాబుకు ఫోన్ వచ్చింది. సెల్ లో నెంబర్ చూసి ఎలెర్ట్ అయ్యాడు. ఎందుకంటే, బాస్ కాల్ చేస్తున్నాడు.

`హలో… రాంబాబేనా మాట్లాడుతోంది?’

`అవును సార్, నేను రాంబాబునే. సార్.. గుడ్ మార్నింగ్.’

`ఆఁ గుడ్ మార్నింగోయ్. అవును ఏం చేస్తున్నావ్ ?’

`అదేంటిసార్, అలా అడుగుతారు… ఆఫీసుకే బయలుదేరుతున్నాను. మరో గంటలో అక్కడుంటాను సార్’ వినయంగా బదులిచ్చాడు రాంబాబు.

`వద్దయ్యా, నువ్వు ఆఫీసుకు రావద్దు’ బాస్ కంఠం గంభీరంగా వినిపించింది.

`అందేంటి సార్’ పిడుగుపడినట్లు ఫీలై, ఎలాగో గొంతుపెగుల్చుకుని అన్నాడు రాంబాబు.

`అదంతే, నేనొక్కసారి డెసిషెన్ తీసుకున్నానంటే, హరిహరబ్రహ్మాదులు అడ్డుపడినా ఆపలేరు. తెలుసా ?’ తన సత్తా ఏపాటిదో మాటల్లో చెప్పాడు బాస్.

`సార్, సార్… ఉన్నఫళంగా నా ఉద్యోగం పీకేస్తానంటే ఎలా సార్. పైగా మొన్నీమధ్యనే , `రాంబాబూ నువ్వు బాగానే పనిచేస్తున్నావోయ్, నీకో స్పెషల్ ఇంక్రిమెంట్ ఇద్దామనుకుంటున్నాను, ఫైల్ మువ్ చేస్తున్నా’నని చెప్పారుకదా సార్. ఇంతలో …’ అయోమయంలో వాగేశాడు రాంబాబు.

`భలేవాడివోయ్ రాంబాబు, నిన్ను ఉద్యోగం నుంచి ఎందుకు తీసేస్తాను’ గలగలా నవ్వేశాడు బాస్.

`మరి !! ఇప్పుడేగా సార్, ఆఫీసుకు రావద్దంటూ హుకం జారీచేశారు’ నసిగాడు.

`ఓహో, అదా. ఏం లేదయ్యా, నువ్వు ఇంటి నుంచి నేరుగా ఆఫీస్ కు వెళ్లనక్కర్లేదన్నమాట. అంటే నువ్వు అర్జెంట్ గా విజయవాడ వెళుతున్నావన్నమాట ‘ వివరణ ఇచ్చాడు బాస్

`ఇక్కడ హైదరాబాద్ హెడ్ ఆఫీస్ లోనే సాయంత్రం మీటింగ్ ఉన్నదని చెప్పారుగా మీరు. మరి ఇప్పుడు విజయవాడ…’

`అవునయ్యా, అప్పుడు అలా చెప్పాను, ఇప్పుడు ఇలా చెబుతున్నాను. మన సీఎం చంద్రబాబుగారు ఇవ్వాళ మన డిపార్ట్ మెంట్ మీటింగ్ విజయవాడలో పెట్టారు. నువ్వు వెంటనే బయలుదేరి విజయవాడ వెళ్ళు. హెడ్డాఫీస్ తరఫున నువ్వు రిప్రజెంట్ చేస్తున్నావ్… తెలిసిందా ‘

`అదేంటి సార్. నేను చాలా జూనియర్ని. ఏదో ఇంక్రిమెంట్ల కోసం పాకులాడేవాడ్ని. నేనేమిటీ, సీఎం మీటింగ్ కు… అందునా డిపార్ట్ మెంట్ రిప్రజెంటీవ్ గా అటెండ్ అవడమేమిటి సార్…!!’ ఆశ్చర్యంమీద ఆశ్చర్యం వ్యక్తం చేశాడు రాంబాబు.

`తప్పదయ్యా, నువ్వే వెళ్ళాలి. నేను వెళదామంటే కుదరడంలేదు. మా రెండోవాడు ఇవ్వాళే అమెరికా వెళుతున్నాడు. ఎయిర్ పోర్ట్ లో దిగబెట్టాలి. పోనీ డిఎంనో, ఏఎంనో పంపుదామంటే వాళ్లకీ హైదరాబాద్ లో బోలెడన్ని పర్సనల్ పనులున్నాయట. ఎవ్వరికీ హైదరాబాద్ విడిచి వెళ్ళేందుకు వీలుచిక్కడంలేదోయ్. అటు చూస్తే, సీఎంగారు చిటికీమాటికీ విజయవాడలోనే మీటింగ్ లంటున్నారు. అమరావతి రాజధాని పనులేమోకానీ మన పీకలకు చుట్టుకుంటున్నాయి. హైదరాబాద్ ని ఎలాగయ్యా విడిచి వెళ్లడం. పిల్లల చదువులు, ఉద్యోగాలు.. కొత్తింటి నిర్మాణాలు …. ఇవన్నీ వదులుకుని ఎలాగయ్యా వెళ్లడం…’ కాస్తంత చిరాకుపడ్డాడు బాస్.

`నిజమే సార్. నా పరిస్థితి అదేనండి, పిల్లలుగట్రా లేరన్నమాట నిజమే అయినా , హైదరాబాద్ వెదర్ నాకు బాగా నచ్చేసిందండి. పైగా మా ఆవిడ శిరీష పుట్టింటివాళ్లంతా ఇక్కడే ఉంటున్నారుకదండీ, నాకూ కష్టమేనండి’

`అంటే, నువ్విప్పుడు విజయవాడ వెళ్లనంటావా? నీ ఇంక్రిమెంట్…’ గాండ్రించాడు బాస్

`అబ్బే , ఇప్పటి సంగతి కాదండీ,ఏదో జనరల్ గా చెబుతున్నాను. ‘

`సరే, వెళ్లు. సాయంత్రం ఐదు గంటలకు సీఎం గారితో మీటింగ్. ఆయనేం చెప్తారో శ్రద్ధగావిని నోట్ చేసుకో. అర్థమైందా ? మన ఆఫీస్ ఇన్ఫర్మేషనంతా నేను నీకు మెయిల్ పెడుతున్నాను. ఫైళ్లూ గట్రా అక్కర్లేదు. అర్థమైందా ??’

`అర్థమైంది సార్. వెంటనే బయలుదేరతాను సార్’

ఫోన్ పెట్టేశాక భార్య శిరీషకు అంతా చెప్పి, హడావుడిగా విజయవాడ బస్సెక్కాడు రాంబాబు. సాయంత్రం మీటింగ్ కి అంతా ప్రిపేర్ అయ్యాడు. జూనియర్ పోస్ట్ లో ఉన్నా పెద్ద బాధ్యత అప్పగించినందుకు ఓ రకంగా తెగసంతోషపడ్డాడు.

సీఎంగారితో మీటింగ్ అనుకున్న సమయానికి మొదలవలేదు. సాయంత్రం 5 గంటలన్నది ఆ మర్నాడు తెల్లవారుఝామున 5 గంటలకు జరిగింది. బాబుగారికి తాను చెప్పాల్సింది చెప్పాడు. బాబుగారు చాలా సంతోషించారు. వెంటనే ఆయన…

` బాగా చెప్పారు. చాలా సంతోషం. మనం ఇప్పుడు విశాఖపట్నం వెళుతున్నాము. అక్కడ పరిస్థితి చూద్దాం. ఎక్కడ వీలైతే అక్కడ మన ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకుపోదాం. ఆ విధంగా నవ్యాంధ్రప్రదేశ్ ని నిర్మిద్దాం …’ అంటూ కారెక్కి రయ్యిన వెళ్ళిపోయారు.

బాబుగారు చెప్పినదాంట్లో `మనం’ అన్న మాటలో తానున్నాడోలేదో తెలియక రాంబాబు అవస్థపడ్డాడు. ఎందుకైనా మంచిదని విశాఖపట్నం బస్సెక్కాడు చాలాసేపు తర్జనభర్జనపడ్డాడు. చివరకు తానూ వెళ్లడం బెటరనిపించి బస్సెక్కేశాడు. బాబుగారు విశాఖలో రాంబాబుని చూసి….

`మంచిపని చేశారు. మీ లాంటి ఉద్యోగులంటేచాలు, మనం ముందుకు దూసుకుపోతాము. ఇప్పుడు మనం కాకినాడ వెళుతున్నాము. ఎంతో చేయాలి. మీ అందరీ సహకారం కావాలి’ అంటూ మళ్ళీ కారెక్కి రయ్యిన వెళ్ళిపోయారు బాబు.

అలవాటైన `మనం’ కావడంతో రాంబాబు కాకినాడ వెళ్లాడు. ఆ తర్వాత అమలాపురం వెళ్లాడు. అక్కడి నుంచి అనంతపురం బస్సు ఎక్కాడు. ఈలోగా సూర్యుడు తూర్పునుంచి పడమరకీ, పడమర నుంచి మళ్లీ తూర్పువైపుకీ వస్తూనే ఉన్నాడు. తన ఉద్యోగం ఎక్కడో, తన అవసరం ఎక్కడో ఏపీ ఉద్యోగి అయిన రాంబాబుకు బాగానే తెలిసొచ్చింది. ఒక నిర్ణయం తీసుకున్నాడు. సెంటర్ గా ఉంటుందని విజయవాడలో ఫ్యామిలీ పోర్షన్ తీసుకుని శిరీషకు కబురుపంపాడు. ఒక వారంలో పెట్టాబేడా సర్దుకుని వచ్చేయమన్నాడు. మధ్యమధ్యలో బాస్ ఫోన్ చేసి రాంబాబును పొగుడుతూనే ఉన్నాడు. తాను హైదరాబాద్ విడిచి వద్దామంటే బోలెడు పనులున్నాయంటూ ముక్తాయింపులు ఉండనేఉన్నాయి. ఈలోగా రాంబాబుకు విజయవాడ వాతావరణం అలవాటైంది. అమరావతి మీద మక్కువ ఎర్పడింది. `రాజధాని నిర్మాణంలో నేనుసైతం’ అనుకుంటూ పనిలో మునిగిపోయాడు.

ఓ రోజు పొద్దున్నే బాస్ దగ్గర నుంచి ఫోన్…

`ఏమయ్యా, రాంబాబు. ఎక్కడున్నావు?’

`సార్, మీరు చెప్పనట్లే విజయవాడలోనే ఉన్నాను సార్. మీటింగ్ ల మీద మీటింగ్ లు సార్. ఊపిరిసలపనంత పని. మా ఆవిడ శిరీష కూడా వచ్చేసిందిసార్. ఇక్కడ అద్దెఇల్లు కూడా తీసుకున్నాను సార్’

`అంతతొందరెందుకయ్యా నీకు. ఫ్యామిలీ పెట్టేశావా…!? చూడు నువ్వు వెంటనే బయలుదేరి హైదరాబాద్ వచ్చేయాలి. సీఎంగారితో ఇక్కడ మీటింగ్ ఉంది. నేనే వెళ్లాదమనుకున్నాను కానీ మా పెద్దోడు… ‘

`అర్థమైంది సార్, ఊర్లో మీటింగ్ అయినా మీరువెళ్లలేరు… ఎందుకంటే, మీ పెద్దోడు అమెరికా…’

`ఛా…అది చిన్నోడి సంగతయ్యా, పెద్దోడు ఆస్ట్రేలియా వెళుతున్నాడు. మరో పక్కేమో జూబ్లీహిల్స్ లో సెకండ్ ఫ్లోర్ కి శ్లాబ్ వేస్తున్నారు… పైగా మా ఆవిడ ఆరోగ్యం బాగోలేదు. అందుకే నువ్వు ఐదారునెలలు అక్కడా, ఇక్కడా పనిచూసుకోవాల్సిందే. అవును, చెప్పడం మరిచాను. నీ ఇంక్రిమెంట్ ఫైల్ పైకి పంపానోయ్. కదులుతోంది…’ బాస్ ఇంకా చెబుతూనే ఉన్నాడు. కానీ రాంబాబు అప్పటికే స్పృహతప్పి పడిపోయాడు. శిరీష అతడి ముఖాన నీళ్లుజల్లుతోంది.

పక్కింటి రేడియోలో నుంచి ఘంటసాల ఆలపించిన పుష్పవిలాపం వస్తోంది. కానీ శిరీషకు మాత్రం అది ఉగ్యోగి విలాపంలా వినిపించసాగింది. అందులో తనభర్త గుండెచప్పుడు వినిపిస్తోంది.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com