సెటైర్ : బాబు జాతకం చెప్పిన సోదమ్మి

`సోది చెబుతానమ్మా…సోది చెబుతాను. ఉన్నది ఉన్నట్లు చెబుతాను, లేనిది లేదని చెబుతాను. సోదో…సోది…’ -వీధిలో తనదైన శైలిలో `బిజినెస్ ప్రోమో ‘ఇచ్చుకుంటూ వెళుతోంది సోదమ్మి. ఆ గొంతు వినగానే టివీ కట్టేసి బయటకొచ్చింది లక్ష్మి.

`ఇదిగో సోదమ్మీ, ఇలారా…’ పిలిచింది లక్ష్మి.

అలా పిలవడం ఆలస్యం, ఇలా బిరబిరా ఇంట్లోకి వచ్చేసింది సోదమ్మి. రాగానే ఇద్దరూ వరండాలో ఓ మూల సెటిలయ్యారు. సోదమ్మి అడిగిన చేటెడు బియ్యం, పసుపు, కుంకుమ వంటి వస్తువులను తీసుకొచ్చిన లక్ష్మిని, తేరపారా చూసింది సోదమ్మి. ఆ తర్వాత వారిద్దరి మధ్య సోది `తంతు’ ఇలా జరిగింది.

`నాకు అర్థమైంది తల్లి, నీ ఆవేదన అమ్మ తెలిసుకుందే… ఈ రాష్ట్రం ఏమవుతుందోనని తెగ మదనపడిపోతున్నావ్. చంద్రబాబు అంటే నీకెంతో ఇష్టమే తల్లి, ఆయనంత మంచోడు ఎవ్వరూ లేరనుకుంటున్నావే… ఇవి గుర్తుపెట్టుకో…అవునంటే ముక్కు, కాదంటే భుజం…’

వెంటనే లక్ష్మి సోదమ్మ చేతిలోని పుల్లను తన ముక్కువద్ద ఆనించుకుంది. బాబు జాతకం అడగాలని అనుకున్నట్లు ఒప్పేసుకుంది.

`నిజమే సోదమ్మా… ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు ఒక్కరే రాష్ట్రాన్ని ముందుకు నడిపించగలరు. ఆయనే అమరావతి కట్టించగలరు. ఆయనే అవుటర్ రింగ్ రోడ్లు వేయించగలరు. ఆయనే…’

`ఆపు తల్లీ, ఆపు.. నీ ఆనందం అమ్మకెరుకే. ఇప్పుడు చంద్రబాబు జాతకం కావాలనుకుంటున్నావ్, అంతేగా తల్లీ…’ కోపం, జాలి కలగలిపి ఉండచేసినట్లు అనేసింది సోదమ్మ.

`అవును, సోదమ్మా, చంద్రబాబు జాతకం కావాలి. ఆయన పచ్చగా ఉంటేనే మేమంతా పచ్చగా ఉంటాము. నవ్యాంధ్ర ప్రదేశ్ నిర్మాణం సజావుగా సాగితే నీకు పట్టుచీర పెడతానే..’ తెలుగుదేశం పార్టీ వీరాభిమానిలా లక్ష్మీ ఊగిపోతూ సోదమ్మికి ఆశ చూపించింది.

` నేను పూనకంతో ఊగిపోవాలికానీ, నువ్వు ఊగిపోతావెందుకే తల్లీ, సరేచెబుతాను విను’ అంటూ రాగయుక్తంగా చెప్పడం మొదలుపెట్టింది సోదమ్మి.

`ఆఁ…బెజవాడ దుర్గమ్మ పలుకు… ఆఁ.. శ్రీశైలం భ్రమరాంబ పలుకు, కాశీ అన్నపూర్ణమ్మ పలుకు, తిరుపతి అలివేలుమంగ పలుకు… ఉన్నది ఉన్నట్లు చెబుతాను, లేనిది లేనట్లు చెబుతాను. ఆఁ… చెబుతాను వినుకో, నుదురంటే కేసీఆర్, నోరంటే జగన్, చెవులంటే బిజెపీ, వీపంటే పవన్…’

వింటున్న లక్ష్మికి సర్రున కోపం వచ్చింది.

`ఏమిటీ సోదమ్మీ, నేను చంద్రబాబు గురించి చెప్పమంటే, కేసీఆర్, జగన్ అంటావ్. నీకు అసలు సోది చెప్పడం వచ్చా..?’ నిలదీసింది లక్ష్మి.

`ఓయమ్మో..అంత కోపం ఎందుకే తల్లి. చంద్రబాబుజాతకం ఆయన చేతుల్లో ఎక్కడుందే తల్లీ, మిగతావాళ్ల చేతుల్లోకి వెళ్ళిపోయిందే… ఉల్లిత్తులా ఎగరకేతల్లి. అమ్మ ఆగ్రహిస్తోంది’

`సరే, చెప్పు’ అంటూ సర్దుకు కూర్చుంది లక్ష్మి.

`చంద్రబాబు ఎన్నో అనుకుంటున్నాడే తల్లీ, కానీ అన్నింటికీ అడ్డంకులు ఎదురవుతాయే, సింగపూర్ సింహాలు మాట వినవు. వాళ్ల దారికి బాబునే రమ్మంటారు. గొంతెమ్మ కోర్కెలతో విసిగిస్తారు. జపాన్ బొమ్మలు దెయ్యాల్లా పీడిస్తాయి. చైనా పాములు పడగవిప్పుతాయి. అందరికీ భూమే కావాలి. బాబుకి తనవాళ్లెవరో, పరవాళ్లెవరో తెలియని పరిస్థితి వస్తుంది. సొంతపార్టీ తమ్ముళ్లు మాట వినరు. కాల్ మనీ అంటారు, బాక్సైట్లంటారు, భూముల్లో వాటా కావాలంటారు. ప్రతి అవినీతిలో పీకల్లోతులో మునిగిపోయి ఉంటారు’

`మరి బాబుగారు అత్యద్భుత రాజధాని నిర్మిస్తానంటున్నారు. అది అవుతుందా అవదా..?’

`చెప్తానే, చెప్పాను. బెజవాడ కనకదుర్గమ్మమీ ఆన ఈ రహస్యం ఎవ్వరికీ చెప్పకూడదే తల్లి. రాజధాని పూర్తయ్యేసరికి బాబు ఇబ్బందుల్లో పడిపోతారు. తాను అనుకున్నది కానందకు క్రుంగిపోతారు. కలల సౌథం కూలిపోతున్నందుకు పరితపిస్తారు. తన రాజకీయ చతురత ఏమైందా ? అని చింతిస్తారు. బడ్డీకొట్టు నడుపుకునే బంగారయ్య దగ్గర నుంచి బడా వ్యాపారుల వరకు ఎవరికితోచింది వారు గుంజుకుంటారు. అయినా, భూదాహం చల్లారక అంగలారుస్తుంటారు. ఏకులా వచ్చినవారు మేకుల్లా తయారవుతారు. బెజవాడ భగ్గుమంటుంది. రక్తం ఏరుల్లా పారుతుంది. గుంటూరు గూండాలకు కేంద్రమవుతుంది. అలిపిరి అంతెత్తు ఎగిరిపడుతుంది… ‘

`అలిపిరి’- మాట వినగానే, లక్ష్మి అంతెత్తున ఎగిరిపడింది.

`ఎందుకే, అంతెత్తులేస్తావు, ఎప్పుడూ అక్కడే కలిపురుషుడు కాచుక్కూర్చోడులే. మధ్యలో అడ్డుతగలకు, ఆఁ… అమ్మ పలుకుతోంది… కృష్ణమ్మ ఎండిపోతుంది, గోదావరి గుడ్లుతేలేస్తుంది. పైనుంచి నీళ్లు వదలనుంటాడు కేసీఆర్. తన కోర్కెల చిట్టా విప్పుతాడు. రాజధాని నిర్మాణంలో తనవాటా ఏమిటని అడుగుతాడే తల్లి. రియలెస్టేట్ బూమ్ లో తాలాకాస్తా వాటాలు పంచుకుంటారు. పెద్ద ప్రాజెక్టులొచ్చిన చోటల్లా భూములను ఒకరిద్దరే కొనిపాడేస్తారు. మిడియా కస్సుబుస్సమని తుస్సుమంటుంది. ప్రజలు ఆగ్రహిస్తారు. పార్టీల రూపురేఖలు మారిపోతాయి. కబుర్లు చెప్పేవాడు కొండెక్కుతాడు, పనిచేసేవాడు పల్టీలు కొడుతుంటాడు. వచ్చే ఎన్నికల్లో బాబుకు గడ్డుకాలమే తల్లి. కొడుకు కుంపటి రాజేయలేడు, వియ్యంకుడు విసర్లేడు, అయినా ఎడంచేత్తో వందమందికి పెడతామంటారు. రాష్ట్రంలో ప్రకృతి కన్నెర్రచేస్తుంది. ఏటికి వరదొచ్చిందని వెళితే, కరువు కాటికిచేరుకుని రమ్మన్నట్లు తయారవుతుంది. ఎక్కడా మనశ్శాంతి ఉండదు. పీడకలలు వస్తుంటాయి. సింగపూర్ సింహాలు అదుపుతప్పి ఊర్లమీద పడతాయి. చైనా పాములు కొండచిలువల్లా మారిపోతాయి. కొండపల్లి బొమ్మలు కనుమరుగవుతాయి. వాటి స్థానంలో జపాన్ బొమ్మలకు విలువహెచ్చుతుంది. రాయలసీమలో ఉద్యమాలు రేగుతాయి. శ్రీకాకుళంలో సిగపట్లు ఎక్కువ అవుతాయి’

`అమ్మో…మా బాబుగారికి కష్టకాలమేనన్నమాట…’ తెగబాధపడింది లక్ష్మి.

`అమ్మ దయ ఎలా ఉంటే అలా జరుగుతుందో తల్లి, ఇక నీ విషయం చెబుతాను వినుకో. నీ భూమి కరిగిపోతుంది. నీ ఇల్లు పీకేస్తారు. రింగంటూ, బొంగంటూ నిన్ను పీక్కుతుంటారు. ఇస్తామన్న నష్టపరిహారం కోసం కాళ్లరిగేలా తిరుగుతావు. చివరకు మంచానపడతావు’

`ఓరి నాయనో… నా ఎకరం నేల కూడా పోతుందా.. బుద్ధుడి పేరుతో కడుతున్న అమరావతిలో ఇంత అన్యాయమా..’ ఆక్రోశించింది లక్ష్మి.

`పేరుకే బుద్ధుడి అమరావతి తల్లీ, కలిపురుషుడే రాజ్యమేలతాడు. అహింస స్థానంలో హింస పెరిగిపోతుంది. రోడ్లు రక్తసిక్తమవుతాయి. భూబకాసురులు, నరకాసురులు రాజ్యమేలతారు. కలల రాజధాని అనుకున్నవారు కలలుకనడం మానేస్తారు. ఇవన్నీ తప్పవేతల్లి..’

`మరి పరిష్కారమేమిటి సోదమ్మి ??’

`నూటికి నూరుశాతం మార్కులు రావని తెలిసినప్పుడు 35 మార్కులతో పాసైతేనే పండుగ. చంద్రబాబు ఇది తెలుసుకుంటే, మానసిక ప్రశాంతత వస్తుంది. దక్కినదాంతో, వచ్చినదాంతో సంతృప్తిపడాల్సిందే. అదే ప్రజాస్వామ్య పాలన అనుకోవాల్సిందే. ఈ విషయం గుర్తుంచుకోవాలని బెజవాడ కనకదుర్గమ్మ, శ్రీశైలం భ్రమరాంబ, అలిపిరి…’

`అమ్మో… చాలుతల్లీ, చాలు నీ సోది ఆపు. మళ్ళీ అలిపిరి, గిరిపిరి అంటూ భయపెట్టకు. ఎలా జరగాల్సి ఉంటే అలాజరుగుతుంది. ఇదిగో నీ దక్షిణ. తీసుకుని వెళ్లు…’

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మాధవీలత ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాతబస్తీ గడ్డపై బీజేపీ ఎగరేసి ఒవైసీకి ఓటమి రుచి చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు....

ఎన్నికల వరకు జగన్ అంతే..!?

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్...

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close