హైదరాబాద్‌లో అత్యంత రద్దీగా ఉండే చాదర్ ఘాట్ విక్టరీ గ్రౌండ్స్‌లో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. సెల్ ఫోన్ దొంగలపై డీసీపీ చైతన్య కాల్పులు జరిపినట్లుగా పోలీసులు ప్రకటించారు. సెల్ఫోన్లు స్నాచింగ్ చేసే ఇద్దరు దొంగలు విక్టరి గ్రౌండ్స్ వద్ద ఉన్నట్లుగా పోలీసులకు సమాచారం వచ్చింది. వారిని పట్టుకునేందుకు డీసీపీ చైతన్య తన సిబ్బందితో కలిసి వెళ్లారు. అక్కడ దొంగల్ని పట్టుకునే ప్రయత్నంలో పెనుగులాట జరిగింది.
పోలీసులు వచ్చినట్లుగా గుర్తించి పారిపోయేందుకు దొంగలు ప్రయత్నించారు. ఆ సమయంలో పోలీసులు వారిని పట్టుకోవడంతో.. దొంగలు దాడికి ప్రయత్నించారు. డీసీపీ చైతన్యపై కత్తితో దాడికి ప్రయత్నించారు. ఇతర పోలీసు సిబ్బందిని నెట్టివేశారు. దాంతో చైతన్య గన్ మెన్ కింద పడిపోయారు. పరిస్థితి తీవ్రంగా మారుతూండటంతో వెంటనే చైతన్య గన్‌మెన్ వద్ద ఉన్న గన్‌తో ఫైరింగ్ ప్రారంభించారు. మొత్తం మూడు రౌండ్లు కాల్పులు జరపడంతో ఓ దొంగకు బుల్లెట్ గాయాలయ్యాయి. మరో దొంగను పోలీసులు పట్టుకున్నారు.
గాయపడిన దొంగను నాంపల్లి ఆస్పత్రికి తరలించారు. కాల్పులు ఘటన జరిగిన విషయం తెలియనే పెద్ద ఎత్తున పోలీసులు ఆ ప్రాంతం వద్దకు వచ్చారు. సజ్జనార్ కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు ఎవరికీ గాయాలు కాలేదని సజ్జనార్ ప్రకటించారు. ఆ దొంగలు ఎవరు అన్నది పోలీసులు ప్రకటించారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి కూడా స్పష్టత లేదు.