ఒక సినిమా మీద ఇంత కసి ఎందుకు?

మంచయినా, చెడు అయినా ఇటీవలి కాలంలో ఎన్టీఆర్ బయోపిక్ మీద వచ్చినన్ని వార్తలు మరే సినిమా మీద కూడా రాలేదేమో? సంక్రాంతికి సినిమా విడుదలయ్యేవరకు అంతా బాగానే వుంది.సవ్యంగానే సాగింది. సినిమా విడుదలై బాలేదు అన్న మాట అయితే రాలేదు. మంచి సమీక్షలే వచ్చాయి.

కానీ ఆ తరువాత నుంచి ప్రారంభమైంది ఆ సినిమా మీద దాడి. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు బయోపిక్ ఆర్థికంగా మంచి సినిమా అనిపించుకోకపోవడానికి చాలా కారణాలు వున్నాయి. ముఖ్యంగా జనాల్లో మారిపోతున్న అభిరుచి. క్రయిమ్, థ్రిల్లర్, సెక్స్, కలర్ ఫుల్ డ్యూయట్లు, ఫైట్లు ఇలా రకరకాల మేళవింపులు వుంటే తప్ప సినిమాలకు జనం రావడం లేదు. అలాంటిది ఓ నటుడి జీవిత కథ అలా చెప్పుకుంటే వెళ్తే చూసేంత ఉదార హృదయం ఇప్పడు ప్రేక్షకులకు లేదు. అలాంటి విశ్వాసాలు, ఇతరత్రా వ్యవహారాలు వుంటే తెలుగుదేశం పార్టీ సభ్యులు చూస్తే చాలు సినిమా బ్లాక్ బస్టర్ కావడానికి.

కానీ సినిమా సినిమానే, ఇతర వ్యవహారాలు వేరే. ఇలాంటి టైమ్ లో రెండో సినిమా విడుదల కసరత్తు ప్రారంభమైంది. ట్రయిలర్ వచ్చింది. ఇక ప్రారంభమైంది ఎన్టీఆర్ రెండో భాగంపై విమర్శల దాడి. విమర్శ తప్పు కాదు. కానీ ఓ ట్రయిలర్ ను పట్టుకుని, దాని నేపథ్యంలో ఇన్ని రకాల కథనాలు వండి వార్చడం అంటే కాస్త అనుమానించాలి.

ఎన్టీఆర్ జీవితంలో మెలోడ్రామా చివరి అంకంలో తప్ప మరెక్కడా లేదు. ఆ అంకం మినహా మిగిలిన కథే సినిమాగా మలిచారు. ఉన్నంతలో క్రిష్ తన ప్రతిభా ప్రదర్శన చేసారు. ఆ విషయం సమీక్షల్లోనే వెల్లడయింది. రెండో భాగం ఇంకా రాలేదు. కానీ ఈలోగానే ట్రయిలర్ ను ఆధారం చేసుకుని, క్రిష్ ను భయంకరంగా టార్గెట్ చేయడం ప్రారంభమైంది. మరో పక్క బయ్యర్ల వ్యవహారం దీనికి తోడయింది. ఇంకోపక్క రెండో భాగాన్ని కూడా కిందకుతొక్కే విధంగా టాక్ ను స్ప్రెడ్ చేసే ప్రయత్నాలు ఆరంభమయ్యాయి.

రెండో భాగం ఆడొచ్చు..ఆడకపోవచ్చు. అది వేరే సంగతి. అయితే బాగుండదు అని చెప్పడానికి అవకాశం తక్కువ. ఎందుకంటే క్రిష్ లాంటి అనుభవం వున్న, ప్రతిభ వున్న దర్శకుడు సినిమాను రీజనబుల్ గానే ప్రెజెంట్ చేస్తాడనే నమ్మకం వుంది. తొలిభాగాన్ని ఆయన అలాగే ప్రెజెంట్ చేసాడు కదా?

ఆ విషయం పక్కన పెడితే, తొలిభాగానికి దాదాపు మీడియా అంతా మూడు రేటింగ్ ఆపైన ఇచ్చింది. అంటే సినిమా బాగుండబట్టే కదా? మీడియా మూడు రేటింగ్ ఇచ్చిన సినిమా రెవెన్యూ పరంగా విజయం సాధించలేదు. అప్పుడు తప్పు ఎవరిది? మీడియా మంచి సినిమా అనుకున్న దానిని ఆదరించని ప్రేక్షకులదా? గతంలో మీడియా శభాష్ అన్న ఎన్నో సినిమాలు పైసలు తెచ్చుకోలేదు. అదే సమయంలో మీడియా తిట్టిన సినిమాలు కాసులు కురిపించాయి.

అందువల్ల డబ్బులు రావడం, రాకపోవడం అన్నది వేరు. సినిమా బాగుండడం, బాగా లేకపోవడం అన్నది వేరు. కానీ మీడియా ఏం చేస్తోంది? ఎన్టీఆర్ తొలిభాగం పరాజయం నేపథ్యంలో మొత్తం సినిమానే బాలేదన్న ఆలోచనలోకి వెళ్లిపోయింది. ఆ కళ్లతోనే ఇంకా విడుదల కాని ద్వితీయ భాగాన్ని చూస్తూ, వార్తలు వండి వారుస్తోంది.

ఇది ఎంత వరకు సబబు. ఇటీవలి కాలంలో ఏ సినిమాకు ఇలా జరగలేదు. ఇటు క్రిటిక్స్ పరంగా, అటు రెవెన్యూ పరంగా విఫలమైన అజ్ఞాతవాసికి తప్ప. దీని వెనుక ఏ ఈక్వేషన్లు వున్నాయో? ఏయే కారణాలు వున్నాయో, ఊహించలేనంత అమాయకులు కారు జనం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com