భారతదేశ రియల్ ఎస్టేట్ రంగంలో సీనియర్ లివింగ్ అనేది ఇప్పుడు ఒక విలాసంగా కాకుండా ఒక అత్యవసర అవసరంగా మారుతోంది. మారుతున్న సామాజిక పరిస్థితులు, ఉమ్మడి కుటుంబాల విచ్ఛిన్నం , యువత ఉపాధి కోసం విదేశాలకు వెళ్లడం వంటి కారణాల వల్ల వృద్ధుల సంరక్షణ కోసం ప్రత్యేక వసతులు కలిగిన గృహాలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. 2026లో ఈ విభాగంలో పెట్టుబడులు భారీగా పెరగనున్నాయని అంచనా.
అయితే, ప్రస్తుతం వీటిని సాధారణ నివాస గృహాల కేటగిరీలోనే చూస్తున్నారు. దీనిని ఒక ప్రత్యేక రియల్ ఎస్టేట్ కేటగిరీగా గుర్తించి, ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించాలని డెవలపర్లు , సామాజిక నిపుణులు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. బడ్జెట్లో ఈ మేరకు ప్రతిపాదనలు పెట్టాలని కోరుతున్నారు. సీనియర్ సిటిజన్ హోమ్స్‌ను ప్రత్యేక విభాగంగా గుర్తించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని పరిశ్రమ వర్గాలు వాదిస్తున్నాయి. దీనివల్ల బిల్డర్లకు తక్కువ వడ్డీకే రుణాలు లభించడమే కాకుండా, పన్ను మినహాయింపులు కూడా పొందే అవకాశం ఉంటుంది.
అలా చేయడం వల్ల సామాన్య మధ్యతరగతి వృద్ధులకు కూడా అందుబాటు ధరలో నాణ్యమైన వసతులు కల్పించవచ్చు. ప్రస్తుతం ఉన్న నిబంధనలు వృద్ధాశ్రమాలకు లేదా సాధారణ అపార్ట్మెంట్లకు సరిపోతాయి తప్ప, 24/7 వైద్య సేవలు, ఫిజియోథెరపీ సెంటర్లు, వృద్ధులకు అనుకూలమైన డిజైన్లతో కూడిన అసిస్టెడ్ లివింగ్ ప్రాజెక్టులకు పూర్తిస్థాయిలో వర్తించడం లేదు. ప్రభుత్వం గనుక దీనిని ప్రత్యేక కేటగిరీగా గుర్తిస్తే, ఈ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది.
