రివ్యూ : క్లైమాక్స్ కోసం.. ‘శ‌మంత‌క‌మ‌ణి’

తెలుగు360.కామ్ రేటింగ్ 2.5/5

న‌లుగురు హీరోలు…. ఓ క్రైమ్ థ్రిల్ల‌ర్‌.. అన‌గానే ఓ ఆస‌క్తి మొద‌లైపోతుంది. న‌లుగురు హీరోల్ని తెర‌పై చూడ‌డం నిజంగా థ్రిల్లింగ్ ఎలిమెంటే..! దానికి తోడు భ‌లే మంచి రోజుతో ఆక‌ట్టుకొన్న శ్రీ‌రామ్ ఆదిత్య ద‌ర్శ‌కుడు. దాంతో శ‌మంత‌క‌మ‌ణి ప‌ట్ల ఓ ర‌క‌మైన క్రేజ్ ఏర్ప‌డింది. ఈమ‌ధ్య థ్రిల్ల‌ర్ త‌ర‌హా చిత్రాలు బాగానే ఉంటున్నా, స‌రైన కాస్టింగ్ లేక – బాక్సాఫీసు ద‌గ్గ‌ర చ‌తికిల ప‌డుతున్నాడు. ‘శ‌మంత‌క‌మ‌ణి’కి ఆ లోటు లేదు. మ‌రి శ్రీ‌రామ్ ఆదిత్య త‌న తొలి సినిమా మ్యాజిక్‌ని ప్ర‌ద‌ర్శించ‌గ‌లిగాడా? ఈ బుల్లి మ‌ల్టీస్టార‌ర్ ఎవ‌రికి న‌చ్చుతుంది?

* క‌థ‌

హైద‌రాబాద్‌లోని స్టార్ హోటెల్‌లో క‌ళ్లు చెదిరే పార్టీ. అక్క‌డే శ‌మంత‌కమ‌ణి అనే పేరుగ‌ల కారు మిస్ అవుతుంది. దాని విలువ రూ.5 కోట్లు. ఈ కేసు రంజిత్ కుమార్ (నారా రోహిత్‌) చేతికి వెళ్తుంది. పార్టీకి వ‌చ్చిన వాళ్ల జాత‌కాలు బ‌య‌ట‌కు తీస్తాడు రంజిత్ కుమార్‌. అందులో ముగ్గురు అనుమానితుల్ని ఇన్వెస్టిగేష‌న్ చేస్తాడు. కార్తిక్ (ఆది), మ‌హేష్ (రాజేంద్ర ప్ర‌సాద్‌), శివ (సందీప్‌కిష‌న్‌)ల‌పై రంజిత్ కుమార్ క‌న్ను ప‌డుతుంది. ఒకొక్క‌రిదీ ఒక్కో స్టోరీ. ముగ్గురికీ డ‌బ్బులు అవ‌స‌ర‌మే. ఆఖ‌రికి కారు యజ‌మానికి కార్తీక్ (సుధీర్‌బాబు)ని కూడా అనుమానించాల్సి వస్తుంది. మ‌రి ఈ న‌లుగురిలో కారుని దొంగిలించింది ఎవ‌రు? ఆ కారు వెనుక క‌థేంటి?? అనేది తెర‌పై చూడాల్సిందే.

* విశ్లేష‌ణ‌

నాలుగు లీడ్ క్యారెక్ట‌ర్స్‌… ఓ పాయింట్ ద‌గ్గ‌ర క‌లుసుకోవ‌డం, అక్క‌డ్నుంచి క‌థ మొద‌లవ్వ‌డం, ఒక్కో పాత్ర త‌న క‌థ చెప్ప‌డం.. ఇవ‌న్నీ చాలా సినిమాల్లో చూసేశాం. ద‌ర్శ‌కుడు కూడా అదే స్క్రీన్ ప్లేతో ఈసినిమాని న‌డిపించాడు. కారు పోవ‌డం ద‌గ్గ‌ర్నుంచి క‌థ మొద‌ల‌వుతుంది. అది ఇంట్ర‌స్టింగ్ పాయింటే. కార్తిక్‌, మ‌హేష్‌, శివ‌, కృష్ణ ఇలా ఒక్కో పాత్రనీ ప‌రిచ‌యం చేస్తూ వెళ్లాడు ద‌ర్శ‌కుడు. ఇవ‌న్నీ క‌లిసిన చోట… ఇంట్ర‌వెల్ ప‌డుతుంది. అంటే… తొలి భాగాన్ని కేవ‌లం పాత్ర‌ల ప‌రిచ‌యానికే వాడున్నాడ‌న్న‌మాట‌. ఈ త‌ర‌హా క‌థ‌ల్లో… ఈ ఇబ్బంది త‌ప్ప‌దు. సెకండాఫ్‌లో ఇన్వెస్గిటేష‌న్ మొద‌ల‌వుతుంది. ప్ర‌తీ పాత్ర‌నీ అనుమానించాల్సివ‌స్తుంది. ఒక్కో పాత్ర నిర్దోషిత్వం బ‌య‌ట‌ప‌డుతుంది. అయితే అస‌లు దొంగ ఎవ‌రు?? అనే స‌స్పెన్స్‌ని ప‌తాక దృశ్యాల వ‌ర‌కూ కొన‌సాగించ‌గ‌లిగాడు. సినిమా ఇంకాసేప‌ట్లో ముగుస్తుంద‌న‌గా… అస‌లు ట్విస్ట్ బ‌య‌ట‌కు వ‌స్తుంది. అది బాగానే ఉన్నా… దాన్ని ఇంకాస్త తెలివిగా డీల్ చేస్తే బాగుండేద‌నిపిస్తుంది. ఇన్వెస్టిగేష‌న్ లో రంజిత్ కుమార్ చేసేదేం ఉండ‌దు. చివ‌ర్లో వచ్చిన ఫోన్ కాల్‌తో ట్విస్ట్ మొత్తం రివీల్ అవుతుంది. అలా కాకుండా రంజిత్ కుమారే… ఈ కేసు ఛేదించిన‌ట్టు చూపిస్తే బాగుండేది. అన్ని పాత్ర‌ల్ని ముగించిన తీరు ఆకట్టుకొంటుంది. చివ‌రి ప‌ది నిమిషాలూ ఈ క‌థ‌కు ప్రాణం. దాని కోసం సినిమా మొత్తం చూడొచ్చ‌నిపిస్తుంది. తొలిభాగంలో పాత్ర‌ల్ని ప‌రిచ‌య‌డం చేయ‌డం వ‌ల్ల‌, స్లో నేరేష‌న్ వ‌ల్ల కాస్త విసుగు అనిపిస్తుంది. రాజేంద్ర ప్ర‌సాద్ – ఇంద్ర‌జ‌ల ల‌వ్ ట్రాక్ కూడా అస‌హ‌జంగా అనిపిస్తుంది. ట్విస్టు బాగానే ఉన్నా, అది లాజిక్‌కి దూరంగా ఉండ‌డం మైన‌స్‌.

* న‌టీన‌టుల ప్ర‌తిభ‌

ఈ క‌థ‌లో న‌లుగురు హీరోలు క‌నిపిస్తున్నా, రాజేంద్ర ప్ర‌సాద్ క్యారెక్ట‌ర్ కూడా కీల‌క‌మే. అంద‌రికీ స‌మాన పాత్ర‌లిచ్చాడు ద‌ర్శ‌కుడు. రోహిత్ ఎప్ప‌ట్లా… యార‌గెంట్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో ఇమిడిపోయాడు. ఆది ఓకే అనిపిస్తాడు. సందీప్ కిష‌న్‌ పాత్ర చాలా జోవియ‌ల్‌గా సాగుతుంది. న‌లుగురిలో ఎక్కువ మార్కులు వేయాలంటే సందీప్ కే ప‌డ‌తాయి. కార్లో.. అమ్మాయి ప‌క్క‌నుంటే వ‌చ్చీ రాని ఇంగ్లీష్‌తో కామెడీ పండిస్తాడు. సుధీర్ బాబుది ఎమోష‌న‌ల్ ట‌చ్ ఉన్న పాత్ర‌. త‌న న‌ట‌న కూడా ఆక‌ట్టుకొంటుంది. రాజేంద్ర ప్ర‌సాద్ కాస్త రిలీఫ్ ఇస్తాడు.

* సాంకేతికంగా

ఫొటోగ్ర‌ఫీ ఆక‌ట్టుకొంటుంది. ఈ జోన‌ర్‌ని ఎలా చూపించాలో అలా చూపించాడు కెమెరామెన్‌. కీల‌క‌మైన సన్నివేశాల్లో మ‌ణిశ‌ర్మ ఇచ్చిన ఆర్‌.ఆర్‌… త‌ప్ప‌కుండా మూడ్‌ని ఎలివేట్ చేసేదే. ఒక్క పాట‌తో స‌రిపెట్ట‌డం ద‌ర్శ‌కుడి తెలివైన నిర్ణయం. చివ‌రి ప‌ది నిమిషాలూ క‌థ‌కు ప్రాణం. క‌థ‌ని ముగించిన తీరూ స‌ర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. అక్క‌డే ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ బ‌య‌ట‌ప‌డుతుంది. తానే రాసుకొన్న కామెడీ డైలాగులు అక్క‌డ‌క్క‌డ వ‌ర్క‌వుట్ అయ్యాయి. అదుర్స్ ర‌ఘు చేత ప‌లికించిన ప్ర‌తీ డైలాగూ పేలింది. క్యారెక్ట‌ర్లు ఎక్కువ అవ్వ‌డం వ‌ల్ల‌, నాలుగు క‌థ‌లు ఒక చోట క‌ల‌ప‌డం వ‌ల్ల‌.. జంపింగ్‌లు ఎక్కువ‌య్యాయి.

* చివ‌ర‌గా : శ‌మంత‌క‌మ‌ణి – కామెడీ థ్రిల్ల‌ర్‌లు చూడాల‌నుకొన్న‌వాళ్ల‌కు న‌చ్చుతుంది. న‌లుగురు హీరోలున్నారు కాబ‌ట్టి… ఏ హీరోకి మీరు ఫ్యాన్ అయినా… థియేట‌ర్‌కి వెళ్లొచ్చు. క్లైమాక్స్‌లో ఉన్న టెంపో… క‌నీసం మ‌రో రెండు మూడు చోట్ల క‌నిపించి ఉంటే.. ఈ ‘మ‌ణి..’ ఇంకా మెరిసిపోయేది.

తెలుగు360.కామ్ రేటింగ్ 2.5/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.