విమ‌ర్శ‌కులు కాస్త క‌నిక‌రించాల్సింది: శ‌ర్వానంద్‌

గురువారం విడుద‌లైన `ర‌ణ‌రంగం` సినిమాకి మిక్డ్స్ టాక్ వ‌చ్చింది. క‌థ‌లో బ‌లం లేద‌ని, స్ర్కీన్ ప్లే గ‌జిబిజిగా ఉంద‌న్న విమ‌ర్శ‌లు వినిపించాయి. అయితే తొలి రోజు వ‌సూళ్లు బాగానే కనిపించాయి. శ‌ర్వా కెరీర్‌లోనే అత్య‌ధిక తొలిరోజు వ‌సూళ్ల‌ని ‘ర‌ణ‌రంగం’ సొంతం చేసుకుంది. అయితే.. విమ‌ర్శ‌కులూ కాస్త క‌నిక‌రించాల్సిఉండాల్సింద‌ని అభిప్రాయ ప‌డుతున్నాడు శ‌ర్వా.

“ఈ రిజ‌ల్ట్‌ని ఎలా తీసుకోవాలో అర్థం కావ‌డం లేదు. రివ్యూలు యావ‌రేజ్‌గా వ‌చ్చాయి. వ‌సూళ్లు మాత్రం బాగున్నాయి. ఎప్పుడూ లేనిది బీ,సీ సెంట‌ర్ల‌లో థియేట‌ర్లు హౌస్‌ఫుల్స్ అవుతున్నాయి. ఈ సినిమాలో క‌థేం లేద‌ని నేను ముందు నుంచీ చెబుతూనే ఉన్నాను. కేవ‌లం స్ర్కీన్ ప్లేని న‌మ్మి తీసిన సినిమా ఇది. విమ‌ర్శ‌కులూ ఇదే విష‌యం చెప్పారు. ఈ సినిమాలో క‌థ లేద‌ని తేల్చేశారు. నా సినిమా అనేస‌రికి.. కొత్త క‌థేదో ఉంటుంద‌ని ఆశించారు. వాళ్లంతా కాస్త నిరాశ చెందారు. రివ్యూలు బాగున్న‌ట్ట‌యితే… వ‌సూళ్లు మ‌రింత బాగా వ‌చ్చేవి. ఈ సినిమా రిజ‌ల్ట్ ఏమిట‌న్న‌ది ఇంకొన్ని రోజులు ఆగితే గానీ తెలీదు. కొన్ని రోజులు ఆగాకే… `రణ‌రంగం` త‌ప్పొప్పులేంట‌న్న‌ది అర్థం అవుతుంది” అని చెప్పుకొచ్చాడు. త‌న న‌ట‌న‌కు, నిర్మాణ విలువ‌ల‌కూ చాలా మంచి పేరొచ్చింద‌ని, అయితే అదొక్క‌టే స‌రిపోద‌ని, సినిమా బాగున్న‌ప్పుడే న‌టుడిగా సంతృప్తి ఉంటుంద‌ని, అయితే ఏ ఒక్క‌రూ సినిమా బాగాలేద‌ని చెప్ప‌డం లేద‌ని, అదొక్క‌టీ ఆనందాన్ని క‌లిగించింద‌ని చెబుతున్నాడు శ‌ర్వా. మొత్తానికి ర‌ణ‌రంగం రిజ‌ల్ట్‌ని త్వ‌ర‌గానే క్యాలిక్లేట్ చేయ‌గ‌లిగాడు. సినిమాని విమ‌ర్శించిన రివ్యూల‌పై విరుచుకుప‌డిపోకుండా స్ట‌డీగానే విశ్లేషించుకోగ‌లుగుతున్నాడు. ఈ మాత్రం చాలు. త‌ప్పుల్ని స‌రిదిద్దుకోడానికి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com