తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నాలుగు వారాల్లోపు పార్టీ ఫిరాయింపులపై వచ్చిన ఫిర్యాదులపై నిర్ణయం ప్రకటించాల్సిన అవసరం పడింది. ఇప్పటి వరకూ ఎనిమిది మంది క్రాస్ ఎగ్జామిన్ చేశారు. వారెవరూ పార్టీ మారామన్న విషయాన్ని అంగీకిరంచడం లేదు. పార్టీ మారారు అన్నదానికి చట్టం ప్రకారం కావాల్సిన విప్ ధిక్కరణ వంటి సాక్ష్యాలు బీఆర్ఎస్ వద్ద లేవు. దాంతో ఆ ఎనిమిది మంది పార్టీ ఫిరాయించలేదు అని తేల్చి స్పీకర్ అనర్హతా పిటిషన్లను తోసి పుచ్చువచ్చు.
కానీ ఇద్దరి విషయంలో మాత్రం ఏమీ తేలడం లేదు. ఆ ఇద్దరు కడియం శ్రీహరి, దానం నాగేందర్, కడియం శ్రీహరి తాను పార్టీ మారలేదని చెప్పడానికి సిద్ధంగా లేరు. ఆయన కుమార్తె ఎంపీగా ఉన్నారు. దానం నాగేందర్ అలా చెప్పినా వర్కవుట్ కాదు. ఎందుకంటే ఆయన ఎంపీగా కాంగ్రెస్ తరపున పోటీ చేసిన రికార్డు ఉంది. ఈ ఇద్దరు పార్టీ మారినట్లుగా తేల్చాల్సిందే. అలా తేలిస్తే అనర్హతా వేటు వేయాల్సిందే. కానీ ఉపఎన్నికలు వస్తాయి. అలా రావడం ఈ ఎమ్మెల్యేలకే కాదు సీఎం రేవంత్ కూ ఇష్టం ఉండదు.
తన ఆలోచనలను వివరించేందుకు దానం నాగేందర్ ఢిల్లీ వెళ్లారు. కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలతో మాట్లాడారు. అనర్హతా వేటు అనే ప్రశ్నే రాదని పార్టీ హైకమాండ్ ఆయనకు భరోసా ఇచ్చింది. అలాంటి పరిస్థితి వస్తే.. స్పీకర్ రాజీనామాలు తీసుకుని ఆమోదిస్తారు. అంటే అప్పుడు రాజీనామాలు చేసినట్లవుతుంది కానీ.. అనర్హతా వేటు పడదు. అనర్హతా వేటు కంటే రాజీనామానే గౌరవంగా ఉంటుంది.


