బావ కూడా సేంటూసేం : ‘సవాల్‌’ కాపీ పేస్ట్‌!

Harish-Rao-KTR

ఇక్కడ పోరాటానికి సంబంధించి.. బామ్మర్ది ఏం సవాలు విసిరాడో.. అక్కడి పోరాటానికి సంబంధించి బావ కూడా అదే సవాలు చేశారు. అలాగని ఇదేమీ బావా మరదుల పోరాటం మాత్రం కాదు. వేర్వేరు పోరాటాలకు సారథ్యం వహిస్తున్న బావా మరదులు విడివిడిగా చేసిన సవాళ్లు ఇవి. నిజానికి రెండూ కత్తి మీద సాములాంటి కీలకమైన పోరాటాలే. ఈ రెండు పోరాటాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బావా మరదులు తమ పదవులను, అధికారాన్ని పణంగా పెట్టి మరీ పోరాటానికి దిగుతున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల బరిలో గెలవకుంటే రాజీనామా చేస్తా అంటూ బామ్మర్ది మంత్రి కేటీఆర్‌ గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే ప్రస్తుతం నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికకు ఇన్చార్జిగా ఉన్న బావ, మంత్రి హరీష్‌రావుకూడా.. ఆ స్థానంలో పార్టీ గెలవకుంటే తన మంత్రి పదవికి రాజీనామా చేసేస్తా అంటున్నారు.

ఈ రెండు ఎన్నికలు కూడా తెరాసకు ఎంతో కీలకమైనవి. ఒక రకంగా క్లిష్టమైనవి కూడా! గ్రేటర్‌ ఎన్నికల్లో తెరాస ఉనికి మొన్నమొన్నటి వరకు అంతంతమాత్రంగా ఉండేది. తెదేపా, కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యే స్థాయి నాయకుల వలసలను ప్రోత్సహించి పార్టీని బలోపేతం చేసుకునే ముందు వరకు తెరాస బలం పరిమితమే. అప్పటి పరిస్థితుల్లో అయితే గ్రేటర్‌ ఎన్నికల్లో తెరాసకు ఎన్నిసీట్లలో అభ్యర్థులు దొరుకుతారు? అనేది కూడా ప్రశ్నార్థకమే అయి ఉండేదేమో. అలాంటి స్థితినుంచి పార్టీని బలపరుచుకున్న తర్వాత.. గ్రేటర్‌ పీఠంపై గులాబీ జెండా రెపరెపలాడిస్తాం అనే నినాదంతో వీరు బరిలోకి దిగుతున్నారు. నగరంలో నాయకుల బలం పెరిగిన మాట నిజమే కానీ, ఓట్ల బలం కూడా పెరిగిందా? అనేది ఈ ఎన్నికలు నిరూపిస్తాయి. ఏదేమైనా తెగించి ఎన్నికల్లో పోరాడుతున్న తెరాసకు గ్రేటర్‌లో కేటీఆర్‌ మాత్రమే ఏకఛత్రంగా సారథ్యం వహిస్తున్నారు. తమ పార్టీ గెలవకుంటే రాజీనామా చేస్తా అని కూడా ఆయన ఇదివరకే ప్రకటించారు.

అదే విధంగా ఖేడ్‌ కూడా కీలకమైనదే. ఎందుకంటే.. గత సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రమంతా గులాబీ హవా ఉన్నప్పుడే ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి కిష్టారెడ్డి గెలిచారు. అంటే కాంగ్రెస్‌కు అంత బలం ఉన్న నియోజకవర్గంగా చెప్పుకోవాలి. అలాంటి కిష్టారెడ్డి హఠాన్మరణంతో జరుగుతున్న ఉప ఎన్నిక ఇది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ బలానికి కిష్టారెడ్డి మరణం పట్ల ఉన్న సానుభూతి కూడా జత కలిసే అవకాశం ఉన్నదని పలువురి అంచనా. అంటే కాంగ్రెస్‌కు ఎడ్వాంటేజీ ఉండాలి. కానీ.. ఇక్కడ తెరాస తాము తప్పక గెలుస్తాం అనే నమ్మకంతో గత ఎన్నికల్లో ఓడిన అభ్యర్థినే ఈసారి మళ్లీ పోటీకి దింపింది. ఆ పార్టీలో రాజకీయ వ్యూహచతురతలో నిపుణులు అయిన మంత్రి హరీష్‌రావు స్వయంగా ఈ ఎన్నికకు ఇన్చార్జిగా ఉన్నారు. కాంగ్రెస్‌ శ్రేణులు, బలగాలను తమలో కలుపుకుంటే తప్ప ఇక్కడ తెరాస విజయం సాధించడం సాధ్యం కాకపోవచ్చు. కానీ ఆయన కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. పార్టీ గెలవకుంటే.. తాను మంత్రిపదవికి రాజీనామా చేస్తా అంటున్నారు. మొత్తానికి ఈ ఇద్దరు బావామరదులు తమ తమ వ్యక్తిగత సామర్థ్యాల నిరూపణకు ఈ రెండు ఎన్నికలను వేదికగా ఎంచుకోవడం పార్టీకి మాత్రం ఎడ్వాంటేజీ అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com