ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక విచారణ బృందం కేసీఆర్ కు నీడలా ఉండే సంతోష్ రావుకు నోటీసులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంతోష్ రావు పాత్రపై లోతైన విచారణ చేపట్టేందుకు సిట్ సిద్ధమైంది. మంగళవారం ఉదయం పదకొండు గంటలకు ఆయన జూబ్లిహిల్స్ లో పోలీసుల విచారణకు హాజరు కానున్నారు.
ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారం ఎవరికి చేరింది? ఆ డేటాను ధ్వంసం చేయడంలో ఎవరి ఆదేశాలు ఉన్నాయి? అనే అంశాలపై సిట్ దృష్టి సారించింది. గతంలో అరెస్ట్ అయిన పోలీస్ అధికారుల వాంగ్మూలాల ఆధారంగా, సంతోష్ రావుకు ఈ వ్యవహారంతో ఉన్న సంబంధంపై అధికారులు స్పష్టత కోరుతున్నారు. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ బ్యూరోలోని స్పెషల్ ఆపరేషన్స్ టీమ్‌తో ఆయన జరిపిన సంప్రదింపులపై ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉంది.
కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో .. సంతోష్ రావు అనుమతి లేనిదే కేసీఆర్ ను కలిసేందుకు కూడా అవకాశం ఉండేది కాదు. అంత సన్నిహితుడైన సంతోష్ రావుకు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. విచారణకు సహకరించకపోతే తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సిట్ అధికారులు స్పష్టం చేశారు. ఈ విచారణ ద్వారా ట్యాపింగ్ నెట్వర్క్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరనేది బయటపడుతుందని దర్యాప్తు సంస్థ భావిస్తోంది.
