తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారని నమోదైన కేసులో టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్నను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అప్పన్నతో పాటు మరో ఆరుగురు టీటీడీ ఉద్యోగులనూ ప్రశ్నిస్తున్నారు అధికారులు. వీరిని ప్రశ్నించిన తర్వాత వైవీ సుబ్బారెడ్డికి కూడా నోటీసులు ఇచ్చి ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది.
వైసీపీ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించారని గత ఏడాది సెప్టెంబర్ లో సీఎం చంద్రబాబు ఆరోపించిన సంగతి తెలిసిందే. జంతు కొవ్వుతో తయారైన నెయ్యిని పవిత్రమైన శ్రీవారి లడ్డూలో కలిపారని చెప్పారు. దీనిపై వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు కూటమి సర్కార్ సిట్ ను ఏర్పాటు చేసింది. అయితే,రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని సిట్ పై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ..సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సీబీఐ ఆధ్వర్యంలో స్పెషల్ సిట్ ను ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఇద్దరు సీబీఐ, ఏపీ నుంచి మరో ఇద్దరు, ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఒకరు సభ్యులుగా ఉన్నారు.
కల్తీ నెయ్యి వ్యవహారంలో తెర వెనుక ఎవరు ఉన్నారన్న దానిపై దర్యాప్తు చేపట్టిన స్పెషల్ సిట్ .. ఈ కేసుకు సంబంధించి 15మందిని నిందితులుగా పేర్కొంది. వీరిలో ఆరుగురిని అరెస్ట్ చేసింది. అయితే, తమిళనాడులోని ఏఆర్ డెయిరీకి టెండర్ దక్కేలా వైసీపీ నేతలు , టీటీడీలోని కొంతమంది ఉద్యోగులు వ్యవహరించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో వైవీ సుబ్బారెడ్డి పీఏకు నోటీసులు జారీ చేసి ప్రశ్నిస్తున్నారు. ఆయన చెప్పిన సమాచారం ఆధారంగా వైవీని కూడా విచారణకు పిలిచే అవకాశం ఉంది.