శోభిత ధూళిపాళకు ఓటీటీ మార్కెట్ లో మంచి ఫేమ్ ఉంది. తను చేసిన మేడిన్ హెవెన్, ది నైట్ మేనేజర్ ఓటీటీ వేదికపై పెద్ద హిట్లు. ఇప్పుడు అమేజాన్ కోసం ‘చీకట్లో’ అనే ఓ సినిమా చేసింద. ఈనెల 23న విడుదల అవుతోంది. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ రూపొందించింది. ఈరోజు ట్రైలర్ వదిలారు.
ఇదో క్రైమ్ థ్రిల్లర్. ఓ హంతకుడి కోసం అన్వేషణ. సాధారణంగా ఇలాంటి కథల్లో హీరోలు, లేదా హీరోయిన్లు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో భాగం పంచుకొంటుంటారు. కానీ ఇందులో శోభిత మాత్రం ఓ పాడ్ కాస్ట్ రన్ చేస్తుంటుంది. చీకటి నేరాలపై ఈ పాడ్ కాస్ట్ కథనాలు ప్రసారం చేస్తుంటుంది. ఓరకంగా ఇదో కొత్త ప్రయత్నం అనుకోవాలి. వరుసగా జరుగుతున్న హత్యలు, వాటిని శోధించే టీమ్, పాడ్ కాస్ట్ రూపంలో ఆ కథనాల్ని ప్రసారం చేసే జర్నలిస్టు.. ఇదీ స్థూలంగా కథ. థ్రిల్లింగ్ మూమెంట్స్ ఈ కథలో చాలా ఉన్నాయన్న విషయం ట్రైలర్ చెప్పేసింది. శోభిత స్క్రీన్ ప్రెజెన్స్, నటన.. ఆకట్టుకొనేలా ఉన్నాయి. ముఖ్యంగా పాత్రలో ఉన్న సీరియస్నెస్ ని శోభిత బాగా ఆకళింపు చేసుకొన్నట్టు కనిపిస్తోంది. హంతకుడ్ని ముసుగులో చూపించారు. ఆ ముసుగు వెనుక దాగున్నదెవరో తెలియాలంటే చివరి వరకూ చూడాలి. సురేష్ ప్రొడక్షన్ నుంచి వచ్చే ప్రాజెక్టులు కంటెంట్ పరంగానే కాకుండా, క్వాలిటీ పరంగానూ స్ట్రాంగ్ గా ఉంటాయి. ‘చీకట్లో’ కూడా అలాంటి సినిమానే అనిపిస్తోంది. శోభితకు ఓటీటీ వేదికపై మరో విజయం దక్కుతుందన్న భరోసా ఈ ట్రైలర్ ఇచ్చేసింది.
