పార్టీ ఫిరాయింపులపై విచారణ దానం నాగేందర్ వద్దకు చేరుకుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై దాఖలైన అనర్హత పిటిషన్‌పై విచారణను వేగవంతం చేసిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఈ నెల 30వ తేదీన వ్యక్తిగతంగా హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. గతంలో జారీ చేసిన నోటీసులకు దానం నాగేందర్ నుంచి సరైన వివరణ రాకపోవడం, అఫిడవిట్ దాఖలు చేయడంలో జాప్యం జరగడంతో స్పీకర్ ఈసారి నేరుగా విచారణకు రావాలని ఆదేశించారు.
ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు కఠినగా వ్యవహరిస్తోంది. స్పీకర్ నిర్ణయం తీసుకోవడంలో జరుగుతున్న ఆలస్యంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. గత విచారణలో రెండు వారాల సమయం ఇచ్చింది. బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన దానం నాగేందర్, కాంగ్రెస్ పార్టీలో చేరడమే కాకుండా సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడంపై సాంకేతిక ఆధారాలు బలంగా ఉన్నాయని బీఆర్ఎస్ వాదిస్తోంది. మొత్తం పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలలో ఏడుగురిపై ఇప్పటికే పిటిషన్లు తిరస్కరించారు. కడియం, సంజయ్‌లపై తీర్పు వెల్లడించాల్సి ఉంది.
ఒకవేళ 30వ తేదీన జరిగే విచారణలో దానం నాగేందర్ ఇచ్చే వివరణ ఆధారంగా స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. ఏ మాత్రం సాంకేతికంగా అవకాశం ఉన్నా.. దానంపై నిర్ణయం వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయి. ఒక్క దానం విషయాన్ని పెండింగ్ పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా భావిస్తున్నారు. తదుపరి విచారణలో సుప్రీంకోర్టు స్పందనను బట్టి దానంపై నిర్ణయం తీసుకోనున్నారు.


