ప్రత్యేక హోదాని 2019 ఎన్నికల వరకు సజీవంగా ఉంచుతాము: జగన్

ప్రత్యేక హోదా కోసం జగన్ చేస్తున్న పోరాటాలు దేనికో ఆయనే స్వయంగా నిన్న మరోసారి బయటపెట్టుకొన్నారు. అంతే కాదు.. తన ‘ఆశయం’ ఏమిటో…దాని కోసం తను అమలుచేయబోతున్న వ్యూహాలు ఏమిటో కూడా ఆయనే నిన్న ఎన్.ఆర్.ఐ.లతో జరిపిన వీడియో కాన్ఫరెన్సింగ్ లో స్వయంగా బయటపెట్టుకొన్నారు.

ఆయన నిన్న రాత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సింగ్ లో ఒక ఎన్.ఆర్.ఐ. అడిగిన ప్రశ్నకి సమాధానం చెపుతూ, “తెలంగాణా ప్రజలు కేంద్రంతో పోరాడి తెలంగాణా రాష్ట్రం సాధించుకోగలిగినప్పుడు మనం పోరాడి ప్రత్యేక హోదా ఎందుకు సాధించుకోలేమన్నది నా ప్రశ్న. ప్రత్యేక హోదా రేపో..ఎల్లుండో..లేదా ఒక సంవత్సరంలోనో వస్తుందని నేను మీకు భరోసా ఇవ్వలేను కానీ దానిని సాధించేవరకు పోరాటం కొనసాగిస్తాను. వచ్చే ఎన్నికల వరకు దానిని సజీవంగా ఉంచుతాను. ఆ తరువాత కేంద్రప్రభుత్వం మా ప్రభుత్వంపై ఆధారపడే పరిస్థితి వస్తుంది. అప్పుడు దాని మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తాము” అని అన్నారు.

ప్రత్యేక హోదా అంశాన్ని ఒక సెంటిమెంటుగా మార్చడంలో కాంగ్రెస్, వైకాపాలు విజయవంతం అయ్యాయని చెప్పక తప్పదు. కనుక దానిని 2019 ఎన్నికల వరకు సజీవంగా ఉంచి, దాని ద్వారానే రాష్ట్రంలో అధికారం రావడం కోసమే పోరాటాలు చేస్తున్నట్లు చెప్పకనే జగన్ చెప్పుకొన్నారు. గతంలో రాష్ట్ర విభజన ప్రక్రియ దాదాపు కొలిక్కి వస్తున్న సమయంలో, తను చేస్తున్న సమైక్యాంద్ర పోరాటం రాష్ట్రం విడిపోకుండా ఆపడానికేనని, తనని గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొనేలాగా చేస్తానని ప్రజలని మభ్యపెట్టే ప్రయత్నాలు చేశారు. అప్పుడూ ఆయన ‘ఆశయం’ అధికారంలోకి రావడమే ఇప్పుడూ అదే ఆశయం. అందుకోసం ఆయన ఎంచుకొన్న అస్త్రాలు మారాయి అంతే తప్ప ఆయన ‘ఆశయం’ మాత్రం అదే.

ఆయన సిద్దం చేసుకొంటున్న మరో సరికొత్త వ్యూహాన్ని కూడా నిన్న వీడియో కాన్ఫరెన్సింగ్ లో బయటపెట్టుకొన్నారు. అదే తన ఎంపిల చేత రాజీనామాలు చేయించడం. అయితే వారి చేత రాజీనామాలు చేయిస్తే ప్రత్యేక హోదా గురించి పార్లమెంటులో మాట్లాడేవారు ఉండరు కనుకనే ఆ ఆలోచన విరమించుకొన్నానని, కానీ సమయం చూసి ఆ ‘బ్రహ్మాస్త్రాన్ని’ కూడా ప్రయోగిస్తానని జగన్ చెప్పారు.

వైకాపా ఎంపిల చేత రాజీనామాలు చేయిస్తే ఏమవుతుంది? అని ఆలోచిస్తే తెదేపా ఎంపిలపై, ముఖ్యంగా ఇద్దరు కేంద్రమంత్రులపై కూడా ఒత్తిడి పెరుగుతుంది తప్ప ప్రత్యేక హోదా రాదని చెప్పవచ్చు. వారిద్దరి రాజీనామాల కోసం జగన్ గత రెండేళ్ళ నుంచి తెదేపాపై తీవ ఒత్తిడి చేస్తున్న సంగతి కూడా అందరికీ తెలుసు. ఎందుకు అంటే, ఆ కారణంగా తెదేపా-భాజపాల మధ్య విభేదాలు ఏర్పడి, అవి తెగతెంపులు చేసుకొంటే భాజపాతో తను జత కట్టాలనే ఆలోచనతోనే అని అర్ధమవుతుంది.

ప్రత్యేక హోదా విషయంలో ఆయన ఎల్లప్పుడూ తెదేపాపైనే తన పోరాటాలు సాగిస్తున్నారు తప్ప అది ఇవ్వవలసిన కేంద్రప్రభుత్వం చేయకపోవడం గమనిస్తే ఆయన నేటికీ భాజపాతో పొత్తుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారని అర్ధం అవుతుంది. కానీ ప్రత్యేక హోదా ఇవ్వందుకు తెదేపాని భాజపాతో తెగతెంపులు చేసుకోమని గట్టిగా కోరుతున్నప్పుడు మళ్ళీ అదే పార్టీతో వైకాపా పొత్తులుపెట్టుకోవడం సాధ్యమేనా? పెట్టుకొంటే ఏమవుతుంది? ప్రజలకి ఎటువంటి సంకేతాలు వెళతాయి? అప్పుడు తెదేపా ఏవిధంగా రియాక్ట్ అవుతుంది?అని జగన్ ఆలోచించినట్లు లేదు.

ఒకప్పుడు ఆంధ్రా ప్రజలకి చాల సెంటిమెంటుగా ఉన్న సమైక్యాంధ్ర ఉద్యమాలని జగన్ ఏవిధంగా తన రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకొన్నారో, ఇప్పుడు సెంటిమెంటుగా మారిన ఈ ప్రత్యేక హోదా అంశాన్ని కూడా అదేవిధంగా వాడుకొని అధికారంలోకి రావాలని కలలు కంటున్నారు. అయితే ప్రజలని ఈవిధంగా మభ్యపెడుతూ వారి సెంటిమెంటుతో ఆటలాడుకొన్నవారికి ప్రజలు ఏవిధంగా గుణపాఠం చెప్పారో గత ఎన్నికలలోనే జగన్ కి భోదపడి ఉండాలి కానీ జగన్ మాటలు వింటే భోదపడలేదని అర్ధం అవుతోంది.

ముఖ్యమంత్రి కావాలనే తన కోరిక నెరవేర్చుకోవడం కోసం, వైకాపా అధికారంలోకి రావాలనే తపనతో ఇప్పటికే దెబ్బ తిన్న రాష్ట్రాన్ని భూటకపు పోరాటాలతో జగన్ ఇంకా దెబ్బ తీయాలని ప్రయత్నిస్తుండటం చాలా దారుణం. జగన్మోహన్ రెడ్డికి, ఆయన పార్టీకి నిజంగా ప్రత్యేక హోదా సాధించాలనే తపన, పట్టుదల ఉన్నట్లయితే రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసే ఆలోచనలు, ప్రయత్నాలు మానుకొని డిల్లీకి వెళ్ళి అక్కడే నేరుగా కేంద్రప్రభుత్వంతో పోరాడితే అందరూ హర్షిస్తారు కదా?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com