వచ్చే ఏడాది ప్రధానమంత్రి నరేంద్రమోదీ పదవి నుంచి దిగిపోతారా..?. ఆయనకు బదులు మరొకరు ప్రధాని పదవి చేపడతారా? రేసులో చంద్రబాబు, లోకేష్ ఉంటారా?. అంతర్జాతీయ మీడియా ఏజెన్సీ రాయిటర్స్‌కు ఇండియా తరపున కాలమిస్ట్‌గా వ్యవహరిస్తున్న జర్నలిస్టు ఒకరు చేసిన విశ్లేషణ వైరల్ గా మారింది. మామూలుగా ఆ జర్నలిస్టు ఎవరో చాలా మందికి తెలియదు. కానీ ఆమె ఇచ్చిన ప్రిడిక్షన్.. రాయిటర్స్ అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించడంతో కలకలం రేగింది. ఆమెకు కాకపోయినా రాయిటర్స్ సంస్థకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా చాలా మంది ఔనా అని ఆశ్చర్యంగా చూశారు. కానీ .. నో చాన్స్ అనే వాళ్లే తప్ప.. అలాంటిది జరుగుతుందని ఎవరూ అనుకోవడం లేదు.
మోదీ మరోసారి ప్రధాని అవుతారు కానీ తప్పుకోరు!
ప్రధానమంత్రి నరేంద్రమోదీ వయసు కారణంగా తప్పుకుంటారని రాయిటర్స్ కాలమిస్ట్ అంచనా వేశారు. వచ్చే ఏడాది ప్రథమార్థం తర్వాత ఆయన ప్రధాని పదవి నుంచి వైదొగలవచ్చని అంచనా వేశారు. మొదట ఇదే ఓ పెద్ద పజిల్. ఎందుకంటే బీజేపీలో వయసు నిబంధన ఉండవచ్చు కానీ.. మోదీకి ప్రత్యామ్నాయం లేదు. అంతకు మించి ప్రధాని మోదీ సంపూర్ణ ఆరోగ్యంతో చలాకీగా ఉన్నారు. ఆయన విధి నిర్వహణలో అవిశ్రాంతంగా శ్రమిస్తూనే ఉన్నారు. మోదీకి చిన్న అనారోగ్యం అన్న మాటే ఎప్పుడూ వినిపించలేదు. అంత యాక్టివ్ గా ఉన్నప్పుడు ఆయన కూడా రిటైర్మెంట్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. వచ్చే ఎన్నికల్లోనూ ఆయనే ప్రధాని అభ్యర్థిగా పోటీ పడతారనడంలోనూ సందేహం ఉండదు.
మిత్రపక్షాలకు ప్రధానమమంత్రి పదవి ఇచ్చే చాన్సే ఉండదు !
ఇక మోదీ వైదొలిగితే.. ఆయన స్థానంలో అమిత్ షా రేసులో ఉంటారని..చెప్పారు. ప్రధాని మోదీ మరో పదేళ్ల తర్వాత రిటైరైనప్పటికీ రేసులో ఉండేది అమిత్ షానే. ఇప్పటికే ఆయన తన పవర్ ఫుల్ రోల్ ను అటు పార్టీలో ఇటు కేంద్రంలో పోషిస్తూనే ఉన్నారు. అయితే రాయిటర్స్ ఎనలిస్టు అనూహ్యంగా చంద్రబాబుతో పాటు లోకేష్ పేర్లను తీసుకు వచ్చారు. మోదీ వయసు కారణంగా తప్పు కుంటే ఆయక కన్నా కొన్ని రోజులు పెద్ద అయిన చంద్రబాబుకు పదవి ఇస్తారని అనుకోవడం అసాధ్యం. కానీ ఆమె అలాగే అనుకున్నారు. ఇక నారా లోకేష్ గురించి చెప్పారు. ప్రధాని పదవికి యంగ్ లీడర్స్ ను ఎంపిక చేసుకోవాలనుకుంటే.. తమ పార్టీలోని నేతల్ని చూసుకుంటారు కానీ లోకేష్ ను చూసుకుంటారా?
సోషల్ మీడియాలో చెప్పుకోవడానికి తప్ప ఉపయోగాల్లేని విశ్లేషణ
ఇలాంటి బిజారే విశ్లేషణలు వచ్చినప్పుడు సాధారణంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూంటాయి. ఇది కూడా అంతే. ఇలాంటివి జరుగుతాయని కనీసం ఒక్క శాతం మంది కూడా నమ్మడం లేదు. రాష్ట్రపతి ఎన్నికల నాటికి కొంత రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది. రాష్ట్రపతి ఎన్నికలు వచ్చే ఏడాది లేవు. 2027జూలైలో ఉన్నాయి. అప్పటికీ అయినా ఇంత భారీగా మార్పులు వస్తాయని అంచనా వేయలేం. రాయిటర్స్ చెప్పేవన్నీ గాలి కబుర్లే. కానీ చెబుతోంది రాయిటర్స్ కాబట్టి కాస్త ఆసక్తికరంగా ఉన్నాయి.
