‘సింగిల్’ ట్రైలర్ అందరికీ నచ్చింది. మంచి ఫన్ రైడ్‌తో సాగి, సినిమాపై అంచనాలు పెంచింది. ట్రైలర్లో వినిపించిన ‘శివయ్యా’, ‘మంచు కురిసిపోవడం’ డైలాగులు కాస్త వివాదాస్పదమయ్యాయి. దానిపై శ్రీవిష్ణు వెను వెంటనే స్పందించి `సారీ` చెప్పాడు కూడా. దాంతో ఆ ఇష్యూ సర్దుమణిగింది.
దీనిపై తెలుగు 360 ఇంటర్వ్యూలో శ్రీవిష్ణు ఇంకాస్త విపులంగా చెప్పుకొచ్చారు. ‘శివయ్య వివాదం ముగిసినట్టేనా?’ అని అడిగితే ‘సారీ చెప్పేశాను కదా, దాంతో క్లోజ్ అయిపోయింది’ అంటూ క్లారిటీ ఇచ్చారు. తాను ఏదీ కావాలని చేయలేదని, ఎవరైనా హర్ట్ అవుతారంటే అసలు దాని జోలికే వెళ్లనని, ట్రైలర్లో ఆ డైలాగ్ ఉంటుందో లేదో తనకే తెలీదని, లాస్ట్ మినిట్ లో ట్రైలర్ చూశానని, అందుకే దాన్ని ఆపే అవకాశం లేకుండా పోయిందని శ్రీవిష్ణు చెప్పుకొచ్చారు. ఈ ఇష్యూ వల్ల అందరి టైమ్ వేస్ట్ అని, అందుకే ‘సారీ’ చెప్పేస్తే – సర్దుకుంటుందన్న ఉద్దేశంతో తానే ముందడుగు వేశానని, ఇందులో ఎవరిది తప్పో, ఎవరిది ఒప్పో.. టైమ్ చెబుతుందని వ్యాఖ్యానించారు శ్రీవిష్ణు.
నిజానికి శ్రీవిష్ణు చాలా త్వరగా స్పందించాడు. వివాదం ముదరకముందే దానికి తెర దించే ప్రయత్నం చేసి మార్కులు కొట్టేశాడు. ఈలోగా ఈ ట్రైలర్ జనాల్లోకి వెళ్లిపోయింది. రావాల్సిన మైలేజీ వచ్చేసింది. సినిమాల్లో ఆ డైలాగులు వినిపించవు. కాకపోతే.. ఆ డైలాగులకు బీప్ వచ్చినప్పుడు తప్పకుండా రెస్పాన్స్ అదిరిపోవడం ఖాయం. ఈనెల 9న ‘సింగిల్’ థియేటర్లలోకి వస్తున్న సంగతి తెలిసిందే.