ఒకే హీరో నటించిన సినిమాలు ఒకే రోజు విడుదల కావడం.. చాలా అరుదైన సంగతి. అప్పుడెప్పుడో నందమూరి బాలకృష్ణ సినిమాలు రెండూ ఒకే రోజు వచ్చాయి. ఆ తరవాత నాని విషయంలోనూ ఇదే జరిగింది. ఇప్పుడు శ్రీవిష్ణు ఈ అరుదైన రికార్డ్ సొంతం చేసుకోబోతున్నాడు. శ్రీవిష్ణు నటించిన ‘మృత్యుంజయ’, ‘విష్ణు విన్యాసం’ రెండూ ఒకే రోజు విడుదల అయ్యే ఛాన్స్ ఉంది. ఫిబ్రవరి 27న ఈ సినిమాలు వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు ఇద్దరు నిర్మాతలూ సన్నాహాలు మొదలెట్టేశారు.
ఒకే రోజు, రెండు సినిమాలు రావడం నిజంగా కొత్తగా అనిపించే విషయం. అయితే తన సినిమాపై తానే పోటీగా నిలవడం శ్రీవిష్ణుకి కొంత ఇబ్బందిగా ఉంటుంది. పైగా నిర్మాతలకూ కక్కలేక మింగలేక అన్నట్టు తయారైంది. ఇదంతా ఓటీటీల చలవే. ఈ రెండు సినిమాల ఓటీటీ హక్కులు రెండు వేర్వేరు సంస్థలకు అమ్ముడుపోయాయి. ఓటీటీ సంస్థలే ఈ సినిమా రిలీజ్ డేట్లు ఖరారు చేశాయి. చెప్పిన సమయానికి రిలీజ్ చేస్తేనే ఓటీటీ నుంచి డబ్బులు వస్తాయి. కాబట్టి… ఆ డేట్ కి ఫిక్స్ కాక తప్పలేదు. శ్రీవిష్ణు కూడా రెండు సినిమాల మధ్య కనీసం నెల రోజుల వ్యవధి ఉన్నా బాగుంటుంది అనుకొంటున్నాడు. ఈ విషయంలో నిర్మాతలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ వాళ్ల చేతుల్లోనూ ఏమీ లేకుండా పోయింది. ఓటీటీ రైట్స్ రూపంలో డబ్బులు రాకపోయినా ఫర్వాలేదు అనుకొంటే తప్ప… రిలీజ్ డేట్ మార్చే అవకాశం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ రిస్క్ ఎవ్వరూ చేయరు. కాబట్టి ఒకే రోజున రెండు సినిమాలూ రాక తప్పడం లేదు. ‘మృత్యుంజయ’ సినిమా రిలీజ్ డేట్ ఇప్పటికే ప్రకటించేశారు. ఇప్పుడు ‘విష్ణు విన్యాసం’ రిలీజ్ డేట్ బయటకు రావాల్సివుంది.
