నవంబరులో సంబరాల కోసం మహేష్ బాబు అభిమానులు సిద్ధంగా ఉండాల్సిందే. ఎందుకంటే.. రాజమౌళి ఆ రేంజ్ లో ప్లానింగులు మొదలెట్టారు. SSMB 29 చిత్రానికి సంబంధించిన అప్ డేట్లు నవంబరులో ఉంటాయని రాజమైళి ముందే చెప్పేశారు. ఇప్పుడు అందుకు తగిన ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి.
నవంబరు 11 లేదా 15న హైదరాబాద్ లో ఓ ఈవెంట్ చేయడానికి చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇది పబ్లిక్ ఈవెంట్ కావొచ్చు. ఇందుకు సంబంధించి పర్మిషన్ల కోసం ప్రయత్నాలు మొదలెట్టారు. రాజమౌళి సినిమా అంటే అనుమతులు రావడం ఏమంత కష్టమేం కాదు. అభిమానుల తాకిడి తట్టుకొనే విధంగా కొన్ని వేదికలు ఎంపిక చేసేశారు. ఎక్కడ ఈవెంట్ చేస్తే బాగుంటుందన్న విషయంలో రాజమౌళి కూడా ఓ అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇది వరకు ఇలాంటి కార్యక్రమాలు రామోజీ ఫిల్మ్ సిటీలో చేశారు. కాకపోతే.. ఈసారి హైదరాబాద్ సిటీలోనే చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
ఈఈవెంట్ లో టైటిల్ ని రివీల్ చేస్తారు. ఓ గ్లింప్స్ కూడా రిలీజ్ చేస్తారు. ఇప్పటికే గ్లింప్స్ కి సంబంధించిన ఎడిటింగ్, ఆర్.ఆర్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయని తెలుస్తోంది. నవంబరులో ఇది కాకుండా వేరే సర్ప్రైజులు కూడా ఉండే అవకాశం ఉంది. ఈ సినిమా కోసం పని చేసే నటీనటులు, సాంకేతిక నిపుణుల్ని కూడా వరుసగా పరిచయం చేసే అవకాశం ఉంది. అలా నవంబరు మొత్తం రాజమౌళి సర్ప్రైజులతో నింపే పనిలో ఉన్నారు.
