మహేష్ బాబు రాజమౌళి సినిమాకు ‘వారణాసి’ అనే టైటిల్ ఫిక్సయ్యింది. ఈ సినిమా టైటిల్ ఏమిటన్న విషయంలో ముందు నుంచీ రకరకాల వార్తలొచ్చాయి. ‘వారణాసి’ టైటిల్ గట్టిగా తిరిగింది. రాజమౌళి సినిమాకు ఇంత సింపుల్ గా టైటిల్ ఉంటుందా? అని కొంతమంది కొట్టిపారేశారు. ఇంకేదో టైటిల్ పెట్టి ఉంటారని ఊహించారు. గ్లింప్స్ విడుదల చేసే రోజున కొత్త టైటిల్ తో షాక్ ఇస్తాడని ఊహించారు. ‘సంచారి’, ‘రుద్ర’ అనే టైటిళ్లు కూడా బయటకు వచ్చాయి. చివరికి ‘వారణాసి’కే ఫిక్సయ్యాడు జక్కన్న. దేశ వ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానులకు ‘వారణాసి` ‘పేరు గురించీ, ఆ ప్రదేశానికి ఉన్న ప్రాముఖ్యత ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. తప్పకుండా రీచ్ ఈజీగా ఉంటుంది. కాకపోతే ఈ సినిమాని గ్లోబల్ గా విడుదల చేయాలనుకొంటున్నాడు రాజమౌళి. వాళ్లందరికీ ఈ పేరు కొత్తే. ఈ సినిమాతో ‘వారణాసి’ పేరు ప్రపంచ వ్యాప్తంగా మరింత పాపులర్ అవ్వడం ఖాయం.
ఈ సినిమా కథలో కీలకమైన భాగం వారణాసిలోనే జరగబోతోంది. అందుకోసం హైదరాబాద్ శివారల్లో భారీ సెట్ వేశారు. ఈ కథ రామాయణంతో ముడి పడి ఉంటుందని, మహేష్ బాబు పాత్ర హనుమంతుడ్ని పోలి ఉంటుందని అనుకొంటున్నారు. ఇంకొందరు మహేష్ రాముడిగా కనిపిస్తాడని అంటున్నారు. వాటికి సంబంధించిన క్లూ ఏమైనా గ్లింప్స్ లో రాజమౌళి చూపిస్తారేమో..? హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఇంకాసేపట్లో ఈవెంట్ మొదలు కాబోతోంది. ఈపాటికే… అభిమానులతో ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఈ ఈవెంట్ లో గ్లింప్స్ తో పాటుగా సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాల్ని కూడా జక్కన్న చూపించబోతున్నాడని టాక్.


