చంద్ర‌బాబు మారారంటే సంతోషమ‌న్న సుజ‌నా..!

గ‌త‌వారంలో విశాఖ‌ప‌ట్నంలో జ‌రిగిన టీడీపీ స‌మీక్ష స‌మావేశంలో పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు ఓ వ్యాఖ్య చేశారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం కేంద్రానికి ఎదురెళ్లామ‌నీ, కానీ ఆ ప్ర‌యోజ‌నం నెర‌వేర‌క‌పోగా పార్టీ న‌ష్ట‌పోవాల్సి వ‌చ్చింద‌ని చంద్ర‌బాబు అన్నారు. ఇలాంటి ప‌రిస్థితి పున‌రావృతం కాకూడ‌ద‌న్నారు. ఈ వ్యాఖ్య‌పై ఇప్ప‌టికే చాలా చ‌ర్చ‌లూ విశ్లేష‌ణ‌లూ వ‌చ్చేశాయి. చంద్ర‌బాబు నాయుడు త‌ప్పు తెలుసుకున్నార‌నీ, భాజ‌పాకి చేరువ‌య్యేందుకు మ‌రోసారి ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టేశార‌నీ.. ఇలా చాలా వ‌చ్చాయి. ఇదే అంశంపై భాజ‌పా నాయ‌కుడు సుజ‌నా చౌద‌రి ఇప్పుడు స్పందించారు.

గాంధీ సంక‌ల్ప యాత్ర ప్రారంభించిన సంద‌ర్భంగా సుజ‌నా చౌద‌రి మాట్లాడుతూ… భాజ‌పా విష‌యంలో గ‌తంలో అనుస‌రించిన వైఖ‌రిపై చంద్ర‌బాబు నాయుడు రియ‌లైజ్ అయ్యారంటే సంతోషించాల్సిందే అన్నారు. అదేదో ముందేగ‌నుక అయ్యుంటే ఇంకా బాగుండేద‌న్నారు. ఇప్పుడు వాస్త‌వం తెలుసుకున్నా పెద్ద‌గా ప్ర‌యోజ‌నం లేద‌నీ, చేతులు కాలిన త‌రువాత ఆకులు ప‌ట్టుకుని ప్ర‌యోజ‌నం ఏముంటుంద‌న్నారు. రాష్ట్రంలో క‌లిసి పోరాటం చేద్దామ‌ని ఇత‌ర రాజ‌కీయ పార్టీలు ముందుకొస్తే, దానిపై త‌మ అధిష్టానం ఆలోచించి నిర్ణ‌యం తీసుకుంటుంద‌న్నారు. ఇదే ఆలోచ‌న‌లో చంద్ర‌బాబు నాయుడు ఉన్నారు క‌దా అనే అంశం సుజ‌నా ముందు ప్ర‌స్థావిస్తే… ఆయ‌న‌కి అలాంటి ఆలోచ‌న ఉంటే త‌మ అధిష్టానంతో మాట్లాడాల‌న్నారు.

గ‌తంలో కేంద్ర ప్ర‌భుత్వంతో వైరాన్ని పెంచుకున్నందుకు జ‌రిగిన న‌ష్టాన్ని టీడీపీ విశ్లేషించుకుంది. అంతేగానీ.. మ‌రోసారి భాజ‌పాతో పొత్తు పెట్టుకోవాల‌న్న‌ది ఆ విశ్లేష‌ణ ఉద్దేశం కాదు. ఇప్పుడు కేంద్రంతో భాజ‌పాకి ఏ ప్రాంతీయ పార్టీ ఎదురెళ్లే ప్ర‌య‌త్నం చెయ్య‌దు క‌దా. చంద్ర‌బాబు వైఖ‌రిలో మార్పు వ‌స్తే దానికి సంతోషించాల్సిన అవ‌స‌రం సుజ‌నాకి లేద‌నే చెప్పాలి. ఇప్పుడాయ‌న భాజ‌పా నాయ‌కుడు. ఆంధ్రాలో ఒంట‌రి పోరే అని ఇత‌ర భాజ‌పా నేత‌లు అంటున్నారు క‌దా. అయితే, ఇక్క‌డ వైకాపాతో, టీడీపీతో స‌మాన స్థాయిలో భాజ‌పా వ్య‌వ‌హ‌రిస్తున్న తీరును గ‌మ‌నించాలి. ఓ ప‌క్క చంద్ర‌బాబు గురించి ఇలా మాట్లాడుతూ… అధికార పార్టీ విష‌యంలో నిర్మాణాత్మ‌క‌మైన విమ‌ర్శ‌లు చేస్తామ‌ని సుజ‌నా అన్నారు. ఏపీలోని బ‌ల‌మైన రెండు ప్రాంతీయ పార్టీల‌ మ‌ధ్య భాజ‌పా ఏదో ఒక వైపు మొగ్గు చూపాల్సిన అవ‌స‌రం భ‌విష్య‌త్తులో ఉండొచ్చు. సొంతంగా అక్క‌డ ఉనికి అంటూ వారికి ఇంకా ఏం లేదు. కాబ‌ట్టి, ఒంట‌రిగా పోరాట‌మ‌ని కొంద‌రు అంటుంటే… సుజ‌నా లాంటివాళ్లు అబ్బే అవ‌స‌ర‌మైతే ఇత‌ర పార్టీల‌తో క‌లిసి పోరాటం అంటున్నారు! రెండు ర‌కాల అవ‌కాశాల‌నూ స‌జీవంగా ఉంచుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com