కోదండరాంతో పాటు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ అయిన సియాసత్ పత్రిక ఎడిటర్ అమీర్ అలీ ఖాన్కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. వారి అభ్యర్థిత్వాలను రద్దు చేసింది. తాజాగా కేబినెట్ సిఫారసులు చేయాలని.. అవి కూడా తమ తుది తీర్పునకు లోబడి ఉంటాయని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కోటా వివాదం ఇప్పటిది కాదు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పటిది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీలు ఖాళీ అయ్యాయి. వాటిని కాస్త ఆలస్యంగా భర్తీ చేశారు కేసీఆర్. కేబినెట్ లో నిర్ణయం తీసుకుని దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణల పేర్లను గవర్నర్ కు పంపారు. గవర్నర్ కొంత కాలం అట్టి పెట్టుకుని వారు రాజకీయ వ్యక్తులని చెప్పి తిరస్కరించారు. వెంటనే కేసీఆర్ వారి పేర్లనే సిఫారసు చేసి ఉంటే గవర్నర్ కు మరో దారి ఉండేది కాదు.కానీ కేసీఆర్ అలా చేయలేదు. ఈ లోపు ఎన్నికలు వచ్చాయి.
కాంగ్రెస్ గెలిచింది. ఖాళీగా ఉన్న రెండు సీట్లకు కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లను సిఫారసు చేసింది. కానీ శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు వారిద్దరి పేర్లను సిఫారసు చేయడాన్నిక్యాన్సిల్ చేసింది. అయితే శ్రవణ్, సత్యనారాయణల పేర్లే సిఫారసు చేయాలని ఆదేశించలేదు. కేబినెట్ మరోసారి కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లనే సిఫారసు చేసింది. దీంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు.. వారిద్దరి ప్రమాణ స్వీకారానికి అంగీకారం తెలిపింది. కానీ నిర్ణయం తుది తీర్పు మేరకే చెల్లుతుందని తెలిపింది. ఆ తర్వాత అమీర్ అలీ ఖాన్, కోదండరాం ప్రమాణ స్వీకారం చేశారు.
అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు మళ్లీ వారు ఎమ్మెల్సీ పదవులను రద్దు చేసింది. తాజా సిఫారసులు కూడా తుది తీర్పునకు లోబడి ఉంటాయని చెప్పి సెప్టెంబర్ కు వాయిదా వేసింది. ఇప్పుడు కోదండరాం, అలీ ఖాన్ మాజీలయ్యారు.