ఎడిటర్స్ కామెంట్ : నేరస్తుల్ని రాజకీయాల నుంచి తరిమేస్తే ప్రజాస్వామ్యం “సుప్రీమే”..!

ఇప్పుడు లీడర్ ఎవరు అవుతున్నారు..? అయితే వారసత్వంతో వచ్చిన వాళ్లు… లేదా రౌడీయిజంతో ఎదిగిన వాళ్లు. వారు కాక ఇక నేతలుగా ఎదిగిన వారు ఎవరు ఉన్నారు. రిజర్వుడ్ నియోజకవర్గాల్లో మాత్రం అతి కష్టం మీద.. అప్పటి దాకా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వారిని తీసుకొచ్చి నామ్‌ కే వాస్తేగా నిలబెడతారు. కానీ.. ఆ నియోజక వర్గాలకు ఆయా పార్టీల తరపున ఇన్చార్జ్‌లుగా ఉండే వారు వేరే. పెత్తనం వారిదే. ఆ “వారు” ఖచ్చితంగా వారసులో.. నేరగాళ్లో.. దందాలు చేసే వాళ్లో అయి ఉంటారు. అంతకు మించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. నేరగాళ్లు మాత్రమే రాజకీయాల్లో ఎదుగుతున్నప్పుడు.. చట్టాలు చేయగలిగే పరిస్థితులు ఏర్పడినప్పుడు.. ప్రజలు వారి స్వభావానికి తగ్గ పాలననే చూస్తారు. ఇంకా చెప్పాలంటే.. అధికారం చేతికి అందిన తర్వాత… చట్టం తమ చేతుల్లో చుట్టం అయిన తర్వాత అంతకు మించిన వైపరీత్యం చూస్తారు. ఇప్పుడు చూస్తున్నారు కూడా. ఈ నేరస్తులందర్నీ ప్రజా జీవితానికి దూరం చేస్తే తప్ప ప్రజలు ప్రశాంతంగా బతకలేని పరిస్థితి. ఈ అవకాశం లేదా..? ఇప్పటి వరకూ లేదు.. కానీ ఇప్పుడో ఆశ మాత్రం మిణుకుమిణుకుమంటోంది. అదే సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు.

ఏడాదిలో ప్రజాప్రతినిధులు కేసులను తేల్చేయగలరా..!?

రాను రాను చట్టసభల్లో నేరగాళ్లు ఎక్కువైపోతున్నారు. సాధారణ రాజకీయ ఆందోళనల కేసుల దగ్గర్నుంచి అత్యంత తీవ్రమైన ఆర్థిక నేరాలు, హత్య వంటి కేసుల్లో నిందితులుగా ఉన్న వారు దర్జాగా పవిత్రమైన పార్లమెంట్ మెట్లెక్కుతున్నారు. చట్టాలు చేస్తున్నారు. గతంలో రెండేళ్ల శిక్ష పడిన వారు పోటీ చేయడానికి అనర్హుల్ని చేస్తూ.. చట్టం తీసుకు వచ్చారు. కానీ దాని వల్ల ప్రయోజనం లేకపోయింది. ఎందుకంటే.. భారతీయ న్యాయవ్యవస్థలో లోపాలను అడ్డం పెట్టుకుని … అధికారాన్ని ఉపయోగించుకుని న్యాయప్రక్రియను ఆలస్యం చేయడంలో విజయం సాధిస్తున్నారు. అందుకే.. ప్రజాప్రతినిధులపై కేసులను ఏడాదిలో తేల్చాలంటూ.. సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు కొంత మంది నిజమైన దేశభక్తులు. 2015లో దాఖలైన పిటిషన్‌పై సిట్టింగ్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలపై సాధ్యమైనంత వేగంగా విచారణ పూర్తి చేయాలని, అభియోగాలు మోపిన తేదీ నుంచి ఏడాదిలోపు విచారణ పూర్తి కావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అసాధారణ పరిస్థితుల్లో ఏడాదిలోపు విచారణ పూర్తి చేయకపోతే.. ప్రత్యేక కారణాలను పేర్కొంటూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కింది కోర్టు నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు రూలింగ్‌ కంటే ముందే.. 2012లోనే లా కమిషన్‌ పలుకుబడిన రాజకీయ నేతపై ఉన్న కేసులను త్వరిగతిన విచారించాలని సిఫారసు చేసింది. పోలీసులను, సాక్షులను ప్రభావితం చేస్తూ విచారణలకు హాజరుకాకుండా సాధ్యమైనంత ఆలస్యం చేస్తున్నారని లా కమిషన్‌ తెలిపింది. అయితే.. లాకమిషన్ సిఫార్సులు కానీ.. 2015లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు కూడా.. అమలైన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు..ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదు.

ప్రధాని మోడీ కూడా ఏడాదిలో శిక్షిస్తామన్నారు… ఆయనా మర్చిపోయారు..!

2014 ఎన్నికలకు ముందు ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. తాము అధికారంలోకి వస్తే.. ఏడాది అంటే ఏడాది కాలంలో అవినీతి రాజకీయ నేతల్ని శిక్షిస్తామని ఘనంగా ప్రకటించారు. అప్పుడు ఆయన అవినీతిని నిజంగానే అంతమొందిస్తారని అనుకున్నారు. అప్పట్లో ఆయన ప్రకటనలు అలా ఉండేవి. కానీ రెండో సారి కూడా అధికారంలోకి వచ్చారు. ఆయన తాను అన్న మాటల్ని మర్చిపోయారు. పైగా.. తన పార్టీలో చేరితే .. తన పార్టీకి మద్దతు తెలిపితే.. అవినీతి పరుల జోలికి దర్యాప్తు సంస్థల్ని వెళ్లనీయడం లేదు. అప్పటి వరకూ నోటీసులు.. కేసులతో వెంటాడే దర్యాప్తు సంస్థలు.. వారంతా పోలోమంటూ బీజేపీలో చేరిన తరవాత… వెనక్కి తగ్గిపోతున్నాయి. ఈ విషయంలో ప్రధానమంత్రి చిత్తశుద్ధిని నిస్సందేహంగా శంకించాల్సిందే. అందుకే ప్రజలు కూడా.. అవినీతి పరులను శిక్షిస్తారని… రాజకీయాల నుంచి దూరం చేస్తారనే భ్రమల నుంచి బయట పడుతున్నారు. వారికే తప్పని సరిగా ఓట్లేసే పరిస్థితిలో … ప్రజలు పడిపోతున్నారు. అయితే నేరస్తుల్ని రాజకీయాల నుంచి తరిమేయడం.. న్యాయవ్యవస్థ చేతుల్లో ఉంది. ఆ దిశగా ఇప్పుడు అడుగులు పడటం అందరిలోనూ ఆశలు నింపుతోంది.

భయంకర నేరారోపణలు ఉన్న వారు అసలు ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులేనా..?

దేశంలోని ప్రత్యేక కోర్టుల్లో 2,556 మందిపై కేసులు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై ఉన్నాయి. 413 కేసుల్లో జీవిత ఖైదు కింద యావజ్జీవ శిక్ష పడగలిగే నేరాలు చేశారు. లాంటి కేసుల్లో 174 మంది సిట్టింగ్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. మొత్తం 352 కేసుల విచారణపై హైకోర్టులు, సుప్రీంకోర్టు స్టే విధించాయి. పంజాబ్‌లో 1983 నుంచి ఒక కేసు పెండింగులో ఉంది. ఈ విషయం తెలిసి సుప్రీంకోర్టే ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో నేరస్తుల గురించి చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ఉన్న ప్రజా ప్రతినిధుల్లో కేసులు లేని వారు ఎవరైనా ఉంటే వారి వైపు విచిత్రంగా చూడాల్సిన పరిస్థితి. చిన్న చిన్న నేరాలు చేస్తే దొంగలుగా చూస్తున్నారు పెద్ద పెద్ద నేరాలు చేస్తే.. హీరోలుగా చూసే పరిస్థితి వచ్చేసింది. అలాంటి హీరోలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్ని శాసిస్తున్నారు. అంతిమంగా అది ప్రజాస్వామ్య వినాశనానికి దారి తీస్తోంది.

ప్రజాస్వామ్య రక్షణకు వెలుగు లేఖ సుప్రీంకోర్టే…!

నేరస్తులు చట్టసభల్లోకి ప్రవేశించి రాజ్యాంగాన్ని కబ్జా చేస్తున్నారు. తమదైన అర్థాలు చెప్పుకుని ఇష్టా రాజ్యంగా చేసేస్తున్నారు. ఇలాంటి సమయంలో.. సుప్రీంకోర్టు మాత్రమే… దేశానికి.. రాజ్యాంగానికి రక్షణగా కనిపిస్తోంది. ఇప్పటికే సుప్రీంకోర్టు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. అమికస్ క్యూరీ ద్వారా మొత్తం వివరాలు తెప్పించుకుంటోంది. ఒక్క తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు.. దేశం మొత్తం.. ప్రజా ప్రతినిధులపై కేసులను సుప్రీంకోర్టు పర్యవేక్షించనుంది. దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై 4,442 కేసులు ఉంటే.. వాటిని విచారించేందుకు ఉన్న కోర్టులు 12 మాత్రమే. ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ పరిస్థితుల్ని మార్చాల్సి ఉంది. ఏడాదిలో లోపు అందరు ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను తేల్చాల్సి ఉంది. అయితే.. ఇదంతా సులువు కాదు. అయితే సుప్రీంకోర్టు ఈ అంశాన్ని ఆషామాషీగా తీసుకోవడం లేదు. ఇప్పటికే హైకోర్టులకు స్పష్టమైన యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించింది. జిల్లాకో ప్రత్యేక కోర్టు పెట్టేందుకు కేంద్రం కూడా అంగీకారం తెలిపింది.

సుప్రీంకోర్టు లక్ష్యాన్ని సాధించాలంటే ఎన్నో నిందలను భరించాల్సిందే..!

రాజకీయం ఇప్పుడు అంతా నేరగాళ్ల మయం. ఇప్పుడు ఆ రాజకీయం నుంచి నేరగాళ్లను వేరు చేస్తానని సుప్రీంకోర్టు కంకణం కట్టుకుంటే.. ఆ వ్యవస్థ ఎదుర్కొనే సవాళ్లు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే కొన్ని అంశాల్లో… వ్యతిరేక తీర్పులు చెప్పినందుకే న్యాయవ్యవస్థ విశ్వసనీయతపైనే గురి పెట్టిన ఘటనలు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. ఇక అలాంటిది.. తమపై ఉన్న కేసుల బూజు దులిపి.. శిక్షిస్తామని చెబితే.. ఎందుకు ఊరుకుంటారు. తమ ఉనికి కోసం.. న్యాయవ్యవస్థ విశ్వసనీయతను దెబ్బ తీసేందుకు వెనుకాడరు. న్యాయమూర్తులపై అనేకానేక రకాలుగా దాడి చేస్తారు. వీటన్నింటినీ తప్పించుకుని సుప్రీంకోర్టు.. రాజకీయాల్ని ప్రక్షాళన చేయాల్సి ఉంది. అలా చేసినప్పుడే.. భారత ప్రజాస్వామ్యం మరికొన్నాళ్లు మనగలుగుతుంది. లేకపోతే.. రాజ్యాంగానికే తమదైన అర్థాలు చెప్పుకుని… దేశాన్ని అథోగతికి తీసుకెళ్తారు.

ప్రతీ సమస్యకూ ఓ పరిష్కారం ఉంటుంది. కాకపోతే.. ఆ పరిష్కారం సరైన సమయానికి లభిస్తేనే ప్రయోజనం. ఇప్పుడు ప్రజాస్వామ్యానికి నేరగాళ్ల వైరస్ పట్టింది. ఆ వైరస్‌ మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థను చుట్టబెట్టక ముందే అంతం చేయాలి. ఆలస్యం అయితే ప్రజాస్వామ్య వ్యవస్థ కుప్పకూలిపోతుంది. ఆ తర్వాత ఏం చేసినా ప్రయోజనం ఉండదు. ఇప్పుడు… ఈ వైరస్‌ను అరికట్టగలిగే ఒకే ఒక్క ఆయుధం.. సుప్రీంకోర్టు.. ! అందుకే ప్రజాస్వామ్య పరిరక్షణ వెలుగురేఖగా కనిపిస్తోంది.. !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉద్యోగం ఊస్టింగ్ ? వెంకట్రామిరెడ్డి ఇక జగన్ సేవకే.. !

ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది ఈసీ. ఆయన వైసీపీ కోసం ఎన్నికల ప్రచారం చేయడంతో నిర్ణయం తీసుకుంది. అంతే కాదు ఆయనను అమరావతి దాటి వెళ్లవద్దని ఉత్తర్వులు...

సీఎస్, డీజీపీ బదిలి ఇంకెప్పుడు !?

ఏపీలో వ్యవహారాలన్నీ గీత దాటిపోతున్నాయి. ఎన్నికలకోడ్ ఉన్నా.. రాజారెడ్డి రాజ్యాంగమే అమలవుతోంది. ఐపీసీ సెక్షన్ల కాకుండా జేపీసీ సెక్షన్లతో పోలీసులు రాజకీయ కేసులు పెట్టేస్తున్నారు. అమాయకుల్ని బలి చేస్తున్నారు. మరో...

ఎక్స్ క్లూజీవ్: మారుతి నుంచి ‘బేబీ’లాంటి ‘బ్యూటీ’

గ‌తేడాది వ‌చ్చిన సూప‌ర్ హిట్ల‌లో 'బేబీ' ఒక‌టి. చిన్న సినిమాగా వ‌చ్చి, సంచ‌ల‌న విజ‌యాన్ని అందుకొంది. నిర్మాత‌ల‌కు, పంపిణీదారుల‌కూ విప‌రీత‌మైన లాభాల్ని పంచిపెట్టింది. ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా...

కాళ్లు పట్టుకోవడంలో పెద్దిరెడ్డి ఎక్స్‌పర్ట్ – కిరణ్ చెప్పిన ఫ్లాష్ బ్యాక్ !

కిరణ్ కుమార్ రెడ్డికి.. పెద్దిరెడ్డికి రాజకీయ వైరం దశాబ్దాలుగా ఉంది. ఆ విషయం అందరికీ తెలుసు. ఒకే పార్టీలో ఉన్నా కిరణ్ కుమార్ రెడ్డిపై పెద్దిరెడ్డికి వ్యతిరేకత ఉంది. కానీ తాను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close