ఇటీవలే OGతో అలరించారు పవన్ కల్యాణ్. ఈ సినిమా పవన్ ఫ్యాన్స్‌కి బాగా నచ్చేసింది. పవన్ ని ఎలా చూడాలనుకొన్నారో, అలానే సుజిత్ చూపించాడు. బాక్సాఫీసు దగ్గర ఈ సినిమా కలక్షన్ల వర్షం కురిపించుకొంది. పవన్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రీకరణ దశలో ఉంది. తరవాత పవన్ సినిమా ఏమిటన్న కన్ ఫ్యూజన్ అందరిలోనూ వుంది. ఇదే జోష్ లో పవన్ కల్యాణ్ మరో సినిమా చేస్తారని, ఆ తరవాత రాజకీయాలతో బిజీ అయిపోతారన్న టాక్ నడుస్తోంది. అదే నిజమైతే వన్ తదుపరి సినిమా ఎవరితో అనే చర్చ జోరుగా సాగుతోంది.
సురేందర్ రెడ్డితో పవన్ ఓ సినిమా చేస్తారన్న ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. సురేందర్ రెడ్డి కూడా పవన్ కోసం ఓ కథ రెడీ చేశారు. ముందస్తు కమిట్మెంట్ ప్రకారం ఈ సినిమానే పవన్ పట్టాలెక్కించాలి. దానికి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయని టాక్. ఆమధ్య దర్శకుడు సముద్రఖని వపన్ కోసం ఓ కథ సిద్ధం చేశారని ప్రచారం జరిగింది. వీరిద్దరి కాంబినేషన్ లో ‘బ్రో’ సినిమా వచ్చింది. అప్పటి నుంచీ ఇద్దరూ మరోసారి కలిసి పని చేయాలనుకొంటున్నారు. త్రివిక్రమ్ ఈ కాంబోని సెట్ చేసే పనిలో ఉన్నారని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.
అయితే ఇప్పుడు వంశీ పైడిపల్లి పేరు కొత్తగా వినిపిస్తోంది. విజయ్ తో `వారసుడు` తెరకెక్కించిన తరవాత వంశీ టచ్ లో లేరు. హిందీలో అమీర్‌ఖాన్, సల్మాన్ ఖాన్లకు కథలు చెప్పారు. కానీ వర్కవుట్ కాలేదు. ఇప్పుడు పవన్ కల్యాణ్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ కథని దిల్ రాజు స్వయంగా పవన్ దగ్గరకు తీసుకెళ్లారని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. పవన్ తో ‘వకీల్ సాబ్’ తెరకెక్కించారు దిల్ రాజు. పవన్ ఇచ్చిన అతి తక్కువ కాల్షీట్లని సద్వినియోగం చేసుకొంటూ సినిమా పూర్తి చేశారు. ఈసారి కూడా అదే ప్లాన్ తో పవన్ ని సంప్రదించారని తెలుస్తోంది. దిల్ రాజుతో పవన్‌కి ఉన్న ఎటాక్మెంట్ దృష్ట్యా పవన్ ఈ ప్రాజెక్ట్ ఓకే చేయడం ఖాయమన్న సంకేతాలు గట్టిగా వినిపిస్తున్నాయి. 2029 ఎన్నికలలోపు పవన్ రెండు సినిమాలు చేయగలిగితే.. తప్పకండా ఈ కాంబో సెట్ అవ్వొచ్చు. ఒకే సినిమాకు పరిమితం అయితే మాత్రం.. సురేందర్ రెడ్డి సినిమానే టేకాఫ్ చేసే అవకాశం ఉంది.