తాప్సి ఎవరు?
సొట్ట బుగ్గలుంటాయి… రాఘవేంద్రరావు సినిమాతో ఇంట్రడ్యూస్ అయ్యింది తనే కదా?
గ్లామర్ రోల్స్ చేసింది… హాట్ హాట్ గా కనిపించింది.. తనే కదా..
తెలుగులో హిట్స్ లేక ఐరన్ లెగ్ అనిపించుకుంది… ఆ కథానాయికే కదా…
ఇక్కడ అవకాశాలు రాక బాలీవుడ్ వెళ్ళిపోయింది.. ఆ పంజాబీ పడుచే కదా…
నిన్నా మొన్నటి వరకూ ఇంతేనేమో. కానీ ఇప్పుడు తాప్సి అంటే ఇవేమీ కాదు.. తాప్సి అంటే ‘పింక్’ సినిమా…
తాప్సి అంటే మీనల్ అనే అమ్మాయి
తాప్సి అంటే… బిగ్ బీ అమితాబ్ కి ధీటుగా నటించే సత్తా వున్న అద్భుతమైన నటి.
అవును…. తాప్సి దశ, దిశ ని కొత్తగా చూపించిన సినిమా వచ్చింది. అదే ‘పింక్’.
‘పింక్’ అనే సినిమాలో తాప్సి చేస్తోంది అనగానే ఎవ్వరు పెద్దగా పట్టించుకోలేదు.
అమితాబ్ సినిమా అన్నా పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. మరో రొటీన్ పాత్ర అయ్యుంటుందేమో అనుకుని లైట్ తీసుకున్నారు. ఐతే ‘పింక్’ సినిమాతో అందరికీ అంతులేనంత షాక్ ఇచ్చింది తాప్సి. ఈ సినిమా చూసి బయటకి వచ్చాక తప్పకుండా రెండు పాత్రలు గుర్తు ఉండిపోతాయి. ఒకటి అమితాబ్, రెండు తాప్సి.
అమితాబ్ గొప్ప నటుడు. పింక్ సినిమా వున్నా లేకపోయినా ఆయన లోని నటుడికి ఏం లోపం ఉండదు. కానీ ‘పింక్’ … తాప్సి అనే నటిని ఈ చిత్రసీమకు పరిచయం చేసింది. మన తెలుగు సినిమాల్లో కనిపించిన తాప్సి, ఈ తాప్సి ఒక్కరేనా అనే అనుమానం వొచ్చేలా, తాప్సిని మానవాళ్ళు సరిగా గుర్తించలేదేమో అనుకుని సిగ్గు పడేలా, తాప్సిని చూసి మిగిలిన కథానాయికలు ఈర్ష పడేలా నటించింది. మరి ముఖ్యంగా కోర్టు సన్నివేశాల్లో తాప్సి నటన కట్టిపడేస్తోంది. నిస్సహాయత, ఏమీ చెయ్యలేని తనం, ఎదిరించాలని వున్నా సరిపోని బలం, ఈ సమాజం కుళ్ళు మాటలని భరించలేని దుఃఖం.. ఆక్రందన, ఆవేదన, కోపం కలగలిపి తన నటనలో చూపించింది. తన డబ్బింగ్ తానే చెప్పుకుంది తాప్సి. అది తాప్సిలోని నటిని మరింత ఎలివేట్ చేసింది.
పింక్ సినిమాతో తాప్సి పై దర్శకులకూ, నిర్మాతలకూ వున్న దృక్పధం తప్పకుండా మారుతుంది. తాప్సి అనేకాదు ప్రతీ కథానాయికలోని వున్న నటిని చూడాలన్న ప్రయత్నం తప్పకుండా మొదలవుతుంది. మనకథానాయికలు నటించడం చేత కానీ దద్దమ్మలు కాదు… దర్శకులు సరిగా ఉపయోగించుకోలేక, సరైన పాత్రలు పడక గ్లామర్ బొమ్మలుగా మిగిలిపోతున్నారు అంతే అనే నిజానికి తాజా నిదర్శనం తాప్సి.