భామ‌లూ… నోరు జార‌డం మీ న‌యా ఫ్యాష‌నా??

చిత్ర‌సీమ‌లో క‌థానాయిక‌ల ప‌రిస్థితి చాలా విచిత్రంగా ఉంటుంది. అవ్వ‌డానికి స్టార్సే అయినా… స్వేచ్ఛ ఉండ‌దు. ఏది ప‌డితే అది మాట్లాడ‌కూడ‌దు. సెట్లో ఎన్ని అవ‌మానాలు ఎదురైనా, క‌థానాయకుల‌తో, ద‌ర్శ‌కుల‌తో ఇబ్బందులు ఎదురైనా.. ఓర్చుకొని ఉండాల్సిందే. అయితే… ఈమ‌ధ్య క‌థానాయిక‌లు కాస్త ఫ్రీడ‌మ్ తీసుకొంటున్నారు. య‌దేచ్ఛ‌గా మాట్లాడుతున్నారు. వాళ్ల మాట‌ల‌కు విలువ ఇస్తోంది చిత్ర‌సీమ‌! దాన్ని అలుసుగా తీసుకొని… కొంత‌మంది భామ‌లు రెచ్చిపోతున్నారు. చిన్న చిన్న విష‌యాలకే కాంట్ర‌వ‌ర్సీలు సృష్టిస్తున్నారు. ట్వీట్ల‌తో, నోటి మాట‌ల‌తో… రాద్దాంతం చేస్తున్నారు.

ఈమ‌ధ్య తాప్సి ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావుపైనే సెటైర్లు వేసింది. త‌న బొడ్డుపై కొబ్బ‌రికాయ ఎలా విసిరారో.. క‌థ‌లు క‌థ‌లుగా బాలీవ‌డ్ మీడియాకు చెప్పింది. రాఘ‌వేంద్ర‌రావు గురించి త‌ప్పుడు మాట ఒక్క‌టీ మాట్లాడ‌లేదు గానీ… త‌న‌ని తెర‌పై చూపించిన విధానాన్ని జోక్‌గా మార్చేయ‌డం మాత్రం కొంద‌రిని బాధించింది. ‘బోయ్ ఫ్రెండ్ ఉంటే.. సౌత్ ఇండియన్ ఇండ్ర‌స్ట్రీలో అవ‌కాశాలు రావు’ అని ఇలియానా చెప్ప‌డం కూడా హాట్ టాపిక్‌గా మారిందిప్పుడు. ద‌ర్శ‌క నిర్మాత‌ల ఆలోచ‌న ధోర‌ణి ఎలా ఉంటుందో ఇలియానా తేల్చి చెప్పేసింది. సౌత్ ఇండియాలో అవ‌కాశాలు త‌గ్గిన ఇలియానా… ఇక ఇక్క‌డి ప‌రిశ్ర‌మ గురించి ఏం మాట్లాడినా ఫ‌ర్వాలేద‌ని భావించిందేమో.. కాస్త ఘాటుగానే స్పందించింది.

అంతెందుకు.. ‘ఓ టాలీవుడ్ హీరో న‌న్ను రూమ్‌కి పిలిచాడు’ అంటూ రాధా ఆప్టే సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేయ‌డం గుర్తుండే ఉంటుంది. రాధిక‌ను ర‌మ్మ‌న్న ఆ టాలీవుడ్ హీరో ఎవ‌రు?? అనే విష‌యంపై ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ న‌డిచింది. ‘1 నేనొక్క‌డినే’ పోస్ట‌రుపై స‌మంత రేపిన వివాదం మ‌హేష్ అభిమానుల‌కు ఇంకా గుర్తుండే ఉంటుంది. ఆ త‌ర‌వాత మ‌హేష్ ఫ్యాన్సంతా స‌మంత‌కు యాంటీ అయిపోయారు. ‘ప్రభాస్ అంటే ఎవ‌రు’ అంటూ నిత్య‌మీన‌న్ ప్ర‌శ్నించ‌డం కూడా అప్ప‌ట్లో సంచ‌ల‌న‌మే. ఈ డైలాగ్ నిత్య‌మీన‌న్‌ని చాలాచోట్ల నిల‌దీసింది. ఆ త‌ర‌వాత నిత్య త‌న త‌ప్పునీ తెలుసుకొంది.

నిత్య కామెంట్లో కాస్త గ‌ర్వం క‌నిపించింది. రాధికా ఆప్టే స్టేట్‌మెంట్‌లో… హీరోల అరాచ‌క‌త్వం బ‌య‌ట‌ప‌డింది. ఇలియానా చెప్పింది చూస్తే… టాలీవుడ్‌లో ద‌ర్శ‌క నిర్మాత‌ల ఆలోచ‌న తీరు అర్థం అవుతుంది. అయితే తాప్సి తీరు మరీ దారుణం. ఏరు దాటాక తెప్ప త‌గ‌లేయ‌డం లా… త‌న‌కు తొలి అవ‌కాశం ఇచ్చిన రాఘ‌వేంద్ర‌రావుపైనే జోకులు వేయ‌గ‌లిగింది. క‌థానాయ‌లకు కొత్త కొత్త ఫ్యాష‌న్ల‌తో ఆక‌ట్టుకోవ‌డం అల‌వాటే. ఏ ఫ్యాష‌న్ వ‌చ్చినా చ‌టుక్కున ప‌ట్టేస్తారు. ఇప్పుడు వాళ్ల‌కు నోరు జార‌డం ఫ్యాష‌న్ అయిపోయిందేమో. ఈ ట్రెండ్ ఇంకెంత కాలం కొన‌సాగిస్తారో మ‌రి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.