ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పి, అప్రతిహతంగా సాగిన తాడేపల్లి ప్యాలెస్ కోటరీలో ఇప్పుడు ఊహించని రీతిలో అంతర్గత భూకంపం కనిపిస్తోంది. ఒకప్పుడు జగన్ మోహన్ రెడ్డి చుట్టూ ఉంటూ.. పార్టీ, ప్రభుత్వ నిర్ణయాలను శాసించిన ఆ కోటరీ ఇప్పుడు పూర్తిగా చెల్లాచెదురైంది. నాడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎవరెవరు ఎంతెంత వెనకేసుకున్నారనే లెక్కలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తుండటంతో, ప్యాలెస్ లోపల తీవ్ర అపనమ్మకం, నిశ్శబ్దం ఆవరించాయి. తన పేరుతో దోచుకుని ..తనకు ఇచ్చింది సగం కూడా లేదని అసలు లీడర్‌కు తెలియడమే కాదు.. ఒకరికి తెలియకుండా.. ఒకరు ఎంత పోగేసుకున్నారో సిట్ లెక్కలు చెప్పడంతో సర్కస్ ప్రారంభమవుతోంది.
‘సాయన్న’ ప్లేస్ లో చెవిరెడ్డి.. జగన్‌కు అంతుచిక్కని లెక్కలు!
ఒకప్పుడు తాడేపల్లి కోటరీలో కీలక పాత్ర పోషించిన సాయిరెడ్డిని జగన్ చాలా త్వరగా పక్కన పెట్టారు. సాయన్న వయసయిపోయింది.. ఆయన స్థానంలో చెవిరెడ్డి పని చేస్తారని అందరికీ చెప్పారు కూడా. జగన్ తనను అంతగా నమ్మి ఛాన్స్ ఇస్తే.. చెవిరెడ్డి తన పదవులను, ప్యాలెస్ సాన్నిహిత్యాన్ని వాడుకుని ఎన్ని వందల కోట్లు వెనకేసుకున్నారో ఇప్పుడు అంచనా వేయడం జగన్ వల్ల కావడం లేదనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా సాగుతోంది. నాడు అత్యంత నమ్మకస్తుడిగా మెలిగిన సాయన్న ఇప్పుడు అవమానాలు భరించలేక పార్టీ నుంచి వెళ్లిపోయారు. అటు వందల కోట్ల ఆర్థిక ఆరోపణలు, సొంత అజెండాతో బుక్ అయిన చెవిరెడ్డిని ఇప్పుడు జగన్ దగ్గరకు తీసుకోలేని నిస్సహాయ స్థితి ఏర్పడింది.
అసలు కన్నా కొసరే ఎక్కువ.. నోట మాట రాని జగన్?
కోటరీలో పీఏ కీలక వ్యక్తి. పీఏ అంటే జగన్ ప్రతినిధే. ఆ పీఏ కేఎన్ఆర్ వ్యవహారం వింటే జగన్ రెడ్డికే నోట మాట రావడం లేదని చెప్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఫండ్స్, ప్రభుత్వ కాంట్రాక్టులు, బదిలీల వ్యవహారాల్లో అసలు కంటే ఆయన తిన్న కొసరు వందల రెట్లు ఎక్కువగా ఉందని ఆధారాలతో సహా తేలడంతో ప్యాలెస్ వర్గాలు షాక్‌కు గురయ్యాయి. జగన్‌ను అడ్డం పెట్టుకుని, ఆయనకు తెలియకుండానే ఈ కోటరీ నేతలు సమాంతర సామ్రాజ్యాలను నడిపించారని, ఇదంతా చూశాకే తాడేపల్లిలో ఇప్పుడు ఒక రకమైన శ్మశాన నిశ్శబ్దం ఆవరించిందని చెబుతున్నారు.
సజ్జల క్యాంపులో గుసగుసలు.. ఆ ఉత్సాహం వెనుక గుట్టేంటి?
ఇంత జరుగుతున్నా, తాడేపల్లిలోని ఒకే ఒక్క క్యాంపులో మాత్రం బయటకు కనిపించని అంతర్గత ఉత్సాహం కనిపిస్తోంది. అదే సజ్జల రామకృష్ణారెడ్డి క్యాంపు. వైసీపీ ఘోర పరాజయం పాలైన తర్వాత అందరి వేళ్లు సజ్జల వైపు చూపించినప్పటికీ, జగన్ ఇప్పటికీ కొన్ని విషయాల్లో ఆయనపైనే ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. మిగిలిన కోటరీ సభ్యుల గుట్టు, వందల కోట్ల దోపిడీ లీలలు బయటకు వచ్చి వారు సైడ్ అయిపోతుంటే.. తమ క్యాంపు గుట్టు మాత్రం ఇంకా బయటకు రాలేదనే ధీమా సజ్జల వర్గంలో కనిపిస్తోందని టాక్.
ఎన్నాళ్లీ దాగుడుమూతలు.. గుట్టు రట్టయ్యేది ఎప్పుడు?
సజ్జల క్యాంపు ప్రస్తుతం సేఫ్‌గా ఉన్నామని సంబరపడుతున్నప్పటికీ.. కోటరీ అంతా కలిసి జగన్‌ను ఎలా బురిడీ కొట్టించారో, పాలనను ఎలా భ్రష్టు పట్టించారో క్షేత్రస్థాయిలో ప్రజలందరికీ ఇప్పటికే అర్థమైపోయింది. తాడేపల్లి కోటరీ చేసిన ఈ అంతర్గత దోపిడీల తాలూకు పూర్తి గుట్టు, వారి అసలు రంగులు కూడా త్వరలోనే అధికారికంగా బయటపడటం ఖాయం. ప్యాలెస్ వేదికగా ప్రస్తుతం నడుస్తున్న గుట్టు రట్టు సీరియల్లో ముందుగా పొలిటికల్ కెరీర్ ముగుస్తుందో చూడాలి.
